+91 7731881113
info@epoojastore.com

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి – ఠాణేలంక

పూర్వాభాద్ర నక్షత్రం – 3వ పాదంThanelanka

ఈ క్షేత్రము ముమ్మడివరం గ్రామానికి అతి సమీపాన గలదు. ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చును. పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదమునకు చెందిన క్షేత్రము అగుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చనము శుభదాయకం అని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ నిర్మాణము కనీసం 500 సంవత్సరముల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. 1979లో కళ్యాణ మంటపం, 1994లో ముఖమంటపం నిర్మించబడ్డాయి. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ 2000 సంవత్సరంలో జరిగినది.

ఆలయ ముఖద్వారంపై శివ కుటుంబం స్వాగతం పలుకుతున్నట్లు వుంటుంది. ఉపాలయాలలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మరియు చండీశ్వరులు కొలువైయున్నారు. తిరుగుడు నంది ఇక్కడ ప్రత్యేకం. ఎవరైనా నిండుచూలాలు ప్రసవమునకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె భర్త యొక్క కోరికపై అర్చకులు నందిని ఆ స్త్రీ వున్న వైపునకు త్రిప్పిన యెడల సుఖ ప్రసవము అయ్యేదట.

గ్రామంలో ఈ ఆలయంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ గణపతి ఆలయాలు కలవు. మాఘశుద్ధ దశమి నుండి ఏడురోజుల పాటు కళ్యాణోత్సవం జరగడం విశేషం. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణము మరియు షష్ఠి ఉత్సవములు ఇక్కడ ప్రత్యేకత.