


ఈ క్షేత్రము వృద్ధగౌతమి నదీతీరాన విలసిల్లియున్నది. ఈ క్షేత్రము చేరుటకు యానాం – ద్రాక్షారామ రహదారి యందలి ఇంజరం నుండి వెళ్ళవచ్చును. లేదా యానాం గోదావరి వంతెన నుండి గట్టుమీదుగా కోటిపల్లి వైపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు.ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో మొట్టమొదటి నక్షత్రము అశ్వని నక్షత్రపు ప్రథమ చరణమునకు చెందినది. ఈ నక్షత్రమున జన్మించిన వ్యక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చన, అభిషేకాదులు నిర్వహించిన ఎడల వారి సమస్త గ్రహపీడలు తొలగి సుఖవంతులగుదరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
నక్షత్ర శివాలయాలలో మొదటిదైన ఈ ఆలయమునకు మరియు గ్రామమునకు విశేష పూర్వచరిత్ర కలదు. పూర్వము రావణుడు ప్రతిరోజూ ప్రాతఃకాలమున వెయ్యి శివలింగాలను పూజించేవాడు. అతని వధనానంతరము ఆ శివలింగాలను ఆ విధంగా పూజించేవారు ఎవరూ లేక కాశీ గంగా నదీజలాల్లో కలిపివేశారట. ఆ లింగాలు అప్పుడప్పుడు జాలర్లకు దొరుకుతుండేవట. 1958వ సంవత్సరంలో కీ.శే. శ్రీ చంద్రాభట్ల వెంకటరామశాస్త్రిగారు కాశీ వెళ్ళినప్పుడు జాలర్లు గంగానదిలో లభించిన ఒక శివలింగం (నర్మదబాణం) తెచ్చినారు. అప్పుడే “బ్రహ్మపురి” గ్రామంలో నిర్మించబడుతున్న శివాలయంలో ఆ లింగమును ప్రతిష్ఠించినారు. ఈ లింగము స్వతస్సిద్ధముగా మూడు విభూతిరేఖలను, మూడవ కన్నును కలిగియుండుట ప్రత్యేకత. భక్తితో ఈ శివుని అర్చించిన వారికి తమ తమ కోరికలు నెరవేరుతున్నాయని ఆయాభక్తుల అనుభవాలు.
పార్వతీ పరిణయ సమయంలో బ్రహ్మగారి ఒకతలలోని కండ్లు మోహదృష్టితో పార్వతిని చూచుచుండుటను చూచిన పరమేశ్వరుడు చేతితో కొట్టగా ఆ శిరస్సు బ్రహ్మనుండి వేరైనదేగాని శివుని చేతి నుండి బ్రహ్మ హత్య కారణంగా తల ఊడలేదు. శంకరుడు పవిత్రనదీ జలాలలో స్నానం చేస్తూ వచ్చి ఈ గ్రామము వద్ద గౌతమీ నదిలో మునిగి లేచే సరికి శివుని చేతి నుండి బ్రహ్మగారి తల విడిపోయిందట. ఆ కారణం చేత ఈ గ్రామానికి “బ్రహ్మపుర్రె” అని పేరువచ్చి కాలక్రమంగా మార్పులు వచ్చి ఇప్పుడు “బ్రహ్మపురి”గా పిలువబడుచున్నది. ఇది స్థల పురాణం. ఈ ఆలయము ప్రవేశ ద్వారమునకు ముందు ఆంజనేయస్వామి వారి విగ్రహము దర్శనమిస్తూ భక్తులకు స్వాగతం చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆలయం లోపల శ్రీఅన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామితో పాటు మహాగణపతి, శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి, వెంకటేశ్వరస్వామి, స్వామి అయ్యప్ప మరియు షిరిడీసాయినాథుని ఉపాలయము కలవు.
ఈ గ్రామమందు ఈ ఆలయం కాక శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం కూడా కలదు. మాఘబహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి మరియు వేణుగోపాలస్వామివార్ల దివ్య కల్యాణములు నిర్వహింపబడుట విశేషము. ఈ ఆలయం శ్రీ రామమడుగుల వెంకటరత్న సోమయాజులుగారిచే నిర్మించబడినట్లు బ్రహ్మశ్రీ చంద్రాభట్ల వెంకటరామశాస్త్రిగారు ఆలయమునకు స్థలము దానంగా ఇచ్చినట్లు అలాగే శ్రీమతి కాకర్లపూడి వెంకట నరసమ్మగారు ధూప దీప నైవేద్యముల నిమిత్తము మాగాణి భూమిని సమకూర్చినట్లు ఇచ్చటి శిలాఫలకం ద్వారా తెలియుచున్నది. అనేక సంవత్సరములుగా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమములను శ్రీయుతులు సాగివెంకట సూర్యనారాయణరాజుగారి కుటుంబీకులు మరియు గ్రామంలోని ఇతర భక్తులు నిర్వహిస్తున్నారు.

ఈ క్షేత్రము చేరుటకు యానాం – ద్రాక్షారామం ప్రధాన రహదారి నుండి మార్గము కలదు. ప్రధాన రహదారి వద్ద దిగి లోనికి వెళ్ళిన యెడల ఈ ఆలయమునకు చేరవచ్చును. ఉప్పుమిల్లి గ్రామమునకు విస్తృత రవాణా సౌకర్యము కలదు. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో మొదటిదైన అశ్వని నక్షత్రం రెండవపాదానికి చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత భవానీ శంకరస్వామిని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన విశేష ఫలితములుండునని భక్తుల విశ్వాసము.
ఈ క్షేత్రమునకు సంబంధించి విశేషమైన స్థలపురాణం కలదు. కలియుగారంభ సమయమున దేవతలకు మునీశ్వరులకు ఋషీశ్వరులకు స్నాన సంధ్యా వందనాది జప తపాదులకు పవిత్ర జలము లేనందున భగీరథుడు అను మహాముని ఆకాశగంగ కొరకై శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసెను. అందులకు శంకరుడు మెచ్చి ఆకాశగంగను తన శిఖనందు బంధించి జడపాయ ద్వారా కొంత జలమును క్రిందకు వదులసాగెను. ఆ జలమును మానవ క్షేమమునకై సప్తమహాఋషులు ఒక్కొక్కరూ ఒక్కో ప్రదేశమునకు ఆ గంగను తీసుకువెళ్ళెను. ఆ మునులలో ఒకరైన అత్రి మహాముని కొంత జలమును ఈ గ్రామమునకు తూర్పున ఉత్తరముగా ప్రవహింప జేస్తూ లవణసముద్రమున కలిపినందున ఈ గ్రామమునకు ఉప్పుమిల్లి గ్రామముగా పేరువచ్చినది. ఈ నదిని అత్రిమహాముని తీసుకువచ్చినందుకు ఈ నదికి అత్రీయ గోదావరి అనియు ఉత్తరముగా ప్రవహించుటచే ఉత్తర వాహిని అనియు ఈ నదిని గొప్పరేవుగా పిలిచెడివారు. ఇప్పుడు గొప్పిరేవుగా పిలువబడుచున్నది. ఈ ఆత్రేయ గోదావరి సప్తసాగర యాత్రలలో రెండవది. ఈ గ్రామమునకు దక్షిణ భాగమున అఖండ గౌతమీ గోదావరి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఆత్రేయ గోదావరిలో కలియుచున్నది.
త్రేతాయుగమున ఈ ప్రదేశమంతయూ మహారణ్యము కావున ఇందు సీతారామలక్ష్మణులు పితృవాక్య పరిపాలనకై ఈ మహారణ్యమునందు నివశించుచూ లోక సంరక్షరార్థము త్రిపుర సుందరి శంకరులను ప్రతిష్ఠించి పూజించెడివారు. ఆనాటి నుండి ఇచ్చటి తపోనిధులు భక్తులు కూడా ఆత్రేయ గోదావరిలో స్నానము చేసి స్వామిని పూజించి ఆరాధించెడివారు. వారిలో భవానీ అను మహాభక్తురాలు వృద్ధురాలు స్వామిని నిత్యమూ పూజిస్తూ స్మరిస్తూ ఉండెడిది.
ఈమె కొద్దికాలమునకు వృద్ధాప్యములో మరణావస్థలో ఉండి లేవలేనిదై త్రిపురసుందరి శంకరులను నిత్యమూ స్మరిస్తూ ఉండగా త్రిపురసుందరి ఈ ప్రదేశమందు నివశించు భక్తుల యొక్క యోగక్షేమములు తెలుసుకొనుటకై బాలిక రూపములో తిరుగుచూ వారి కష్టములను కాపాడుచూ ఉండెడిది. ఇట్టి సమయమున భక్తురాలైన భవానీ ఇంటికి బాలికరూపంలో వచ్చి ఆమె భక్తిని గ్రహించినదై నీకు ఏమి కావలయును అని అడుగగా ఈమె సాక్షాత్తూ భగవత్ స్వరూపిణి కావచ్చునని భవానీ గ్రహించినదై త్రిపురసుందరీ శంకరులను చూచునటుల వరం ప్రసాదించమని వేడుకొనగా అంతట త్రిపురసుందరి శంకరులు ప్రత్యక్షమయ్యెను. అంతట భవానీ సంతోషసంముగ్దురాలై పరవశించిపోయి మీరు ఇరువురూ కూడా నాయందే ఉండి నా మరణానంతరము నా పేరు మీ నామములో ఒకటిగా సార్థకము చేసి నాకు ముక్తి నొసగుమని వేడుకొనెను.
అందులకు స్వామి ఆనందముగా భక్తురాలికి ఇచ్చిన మాట ప్రకారము ఈ ప్రదేశమునందే నివశిస్తూ శంకరుడు భవానీ శంకరునిగాను త్రిపురసుందరి బాలిక రూపములో తిరుగుచూ భక్తులను ఆదుకొనుటచే బాలా త్రిపురసుందరిగాను పిలువబడుచుండెను. భక్తురాలికి ఇచ్చిన మాట ప్రకారము స్వామి వదిలి వచ్చిన స్థలమును ఇంకనూ గుడి దిబ్బగా పిలువబడుచున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. ఇదే ఆలయములో లక్ష్మీ నారాయణులు కూడా ప్రతిష్టింపబడి శివకేశవులకు అభేదము గోచరించుచున్నది. ఈ క్షేత్ర స్థిత లింగమూర్తి స్వయంభువుగా ప్రసిద్ధి. ఈ గ్రామంలో ఇంకనూ సుబ్రహ్మణ్యస్వామి ఆలయము, భక్తాంజనేయస్వామి గణపతి ఆలయములు కలవు.

కుయ్యేరు క్షేత్రమును చేరుటకు కాకినాడ, యానాం, ద్రాక్షారామల నుండి కూడా విస్తృతమైన రవాణా సౌకర్యం కలదు. అంతేకాక ఈ ఆలయము ప్రధాన రహదారిపై ఉండుట చేత చేరుట అతిసులభం. ఈ క్షేత్రము అశ్వని నక్షత్రము మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మల్లేశ్వరస్వామిని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన శుభ ఫలితములు కలుగునని భక్తుల విశ్వాసము. అత్యంత పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం సుమారు రెండువందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు తెలుస్తున్నది. అయితే ఆలయం జీర్ణావస్థలోకి వచ్చిన కారణం చేత గ్రామస్థుల సహకారంతో పునఃనిర్మాణం చేపట్టడం జరుగుచున్నది.
అలాగే శివలింగం కూడా కాశీ క్షేత్రము నుండి తీసుకుని వస్తున్నట్లు తెలిసినది. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఈ ఆలయం 08-03-2015 నుండి పునఃప్రతిష్ఠతో సహా ప్రారంభం కానున్నట్లు తెలిసినది. ఈ గ్రామంలో రుక్మిణీ సత్యభామా సమేత శ్రీమదనగోపాలస్వామి వారి ఆలయం మరియు శ్రీ సీతారామస్వామివారి ఆలయము కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇదికాక ఈ క్షేత్రములో శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా నిర్వహించబడును. అంతేకాక మాసోత్సవములు ఆయనోత్సవములు జరుగును.

దుగ్గుదూరు క్షేత్రం కుయ్యేరు గ్రామానికి సమీపంలో గొల్లపాలెం – కుయ్యేరు రహదారి యందు కలదు. ఈ గ్రామం చేరుటకు కాకినాడ నుండి బస్సు సౌకర్యం మాత్రమే గాక గొల్లపాలెం, కుయ్యేరు గ్రామాలనుండి ఆటో సౌకర్యం కూడా గలదు. దుగ్గుదూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి క్షేత్రం నక్షత్ర శివాలయాలలోని అశ్వని నక్షత్రం – నాలుగవ పాదానికి చెందినదిగా చారిత్రిక కథనం.
అందువల్ల ఆ జాతకులకు ఈ క్షేత్రదర్శనం, అర్చనం విశేష ఫలాన్నిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆత్రేయ గోదావరి తీరాన విలసిల్లిన ఈ దుగ్గుదూరు గ్రామం యొక్క నామం విషయంలో ఒక ఆసక్తికరమైన కథనం కలదు. దుగ్ధమనగా క్షీరం (పాలు) స్వచ్చతకు, శాంతికి ప్రతీకగా చెబుతారు. దానికి తగ్గట్టుగానే ఈ గ్రామంలో పాడిపరిశ్రమ విశేషంగా జరుగుటయేగాక, ప్రజలు కూడా శాంతికాముకులుగా యుండుట విశేషం. దుగ్ధము నుండి ఈ గ్రామానికి దుగ్దూరు నామం కలిగి పిదప వ్యవహారంలో దుగ్గుదూరుగా మారినదట.
ఈ క్షేత్రాన కోలువైయున్న గణపతికి కామ్య గణపతియని పేరు. దానికి తగ్గట్టుగానే ఈ గణపతి సర్వసిద్దిదాయకుడు. ఏ సంకల్పంతోనయితే స్వామిని నిష్కల్మష భక్తితో త్రికరణశుద్ధిగా సేవిస్తారో ఆ సంకల్పసిద్ధి జరిగినట్లు దృష్టాంతములు గలవు. ఈ ఆలయం సుమారు 250సంవత్సరములకు పూర్వము పిఠాపురం సంస్థానాధీశులు రేచర్ల గోత్రజ్ఞులు రావు గంగాధర రామారావుగారిచే పునర్నిర్మితమయినది. ఆ కారణం చేతనే నేటికిని ఈ ఆలయమున ప్రథమపూజ వారి పేరున జరుగుతుంది. ఇచ్చటి ఈశ్వర రూపం అఘోర రూపంగా చెబుతారు. అంతేకాక పరమేశ్వర స్వరూపమునకు మల్లిఖార్జున నామధేయం కూడా ఆలయ పునఃనిర్మాణం సమయంలో పిఠాపురాధీశులచే స్థిరపరచబడినది.
మల్లికార్జునుడు సత్వగుణ స్వరూపుడు అందువల్ల ఈ స్వామి దర్శనం, అర్చనల వలన సత్వగుణాన్ని పెంపొందిస్తాయని భక్తజనుల విశ్వాసం. స్వామివారి ప్రత్యద్భోత్సవం (దివ్యకల్యాణం) వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా శైవాగమ సిద్ధాంతపరంగా జరుగుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రాల రోజులలో విశేష పూజలు నిర్వహించబడతాయి. ఈ క్షేత్రం ఆత్రేయ గోదావరి తీరాన గలదు. ఈ ఆలయానికి వామపార్శ్వాన రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మరియు పశ్చిమంగా ముప్పిళ్ళమ్మ అమ్మవారి ఆలయాలు వున్నాయి.

ఈ క్షేత్రము యానాం ద్రాక్షారామ ప్రధాన రహదారిపై కోలంక గ్రామమున కలదు. ప్రధాన రహదారి నుండి సుమారు కిలోమీటరు లోపల ఈ ఆలయమునకు చేరవచ్చును. ఈ ఆలయము కేవలం నక్షత్ర శివాలయం మాత్రమే కాక అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయమును కోటిపల్లి – యానాం మార్గం ద్వారా చేరవచ్చును. రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం కలదు.
భరణి నక్షత్రము మొదటి పాదమున జన్మించినవారు ఈ ఆలయము సందర్శించి అచటి స్వామికి అర్చనాభిషేకములు చేసిన యెడల వారి విపత్తులు తీరి సంకల్పసిద్ధి కలుగుతుందని విశ్వాసము. ఈ క్షేత్రము పైన తెలిపినట్లు చంద్ర ప్రతిష్టితమైన అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా తూర్పుకోణమున కోలంక గ్రామంలో ప్రతిష్టించబడినది. ఇచ్చటి స్థలపురాణం ప్రకారం అనేక శతాబ్దాలుగా వున్న ఈ క్షేత్రము 9వ శతాబ్ద కాలంలో చాళుక్య భీమునిచే పునరుద్దరింపబడినట్లుగా తెలియుచున్నది. తదనంతరం పెద్దాపురం రాజుగారైన శ్రీవత్సవాయి తిమ్మజగపతిరాజుగారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారట. ఈ ఆలయమునకు చేర్చి కేశవస్వామివారి ఆలయము కలదు.
ఈ రెంటికీ మధ్య ఖాళీ స్థలములో క్రీ.శ.1986 సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులవారి దివ్య ఆశిస్సులతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ప్రతిష్ట, శ్రీ అట్లూరి సత్యనారాయణ రాజు, శ్రీమతి సత్యనారాయణమ్మ దంపతుల చేతులమీదుగా జరిగినది. తదుపరి 1999వ సంవత్సరములో ఆలయ పునరుద్ధరణ శివలింగ పునఃప్రతిష్టతో పాటు పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, నంది, ధ్వజస్తంభము ఇత్యాదుల పునఃప్రతిష్ట జరిగినది. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయము శ్రీవాణీ మాతాజీ సత్సంగము వారి ఆధ్వర్యంలో నిర్మింపబడి నిర్వహించబడుచున్నది. ఆలయము వెనుక భాగమున శ్రీవత్సవాయి తిమ్మజగపతిరాజుగారి పేరున వాహనశాల నిర్మాణం జరిగినది.
ఇచ్చట ఉమా సమేత సోమేశ్వరస్వామి వారికి మరియు శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా ఏకముహూర్తములో కళ్యాణోత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారికి ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి కళ్యాణోత్సవం జరుగుతుంది.

ఈ క్షేత్రం యానాం – కోటిపల్లి ప్రధాన రహదారిపైన కలదు. ఈ ఆలయం చేరుటకు అధికశ్రమ అవసరంలేదు. ప్రధానరహదారిపైన కుడివైపున ఉండుట వల్ల యానాం నుండి కోటిపల్లి వైపు వెళ్ళు బస్సుగాని, ఆటోగాని ఎక్కి ఇంజరం శివాలయం అని చెబితే సరిపోతుంది.భీమమండలంలో వేంచేసియున్న శ్రీ ఉమాసమేత కృపేశ్వరస్వామివారిని దర్శించుకోవడం సర్వపాపహరంగాను, సంపత్కరంగాను భావించడం జరుగుతున్నది, ముఖ్యంగా భరణి నక్షత్రం – ద్వితీయ చరణంలో జన్మించిన వారికి ఈ ఆలయస్థితి శివస్వరూపదర్శనం, అర్చనాభిషేకాదుల వలన విశేష ఫలం లభించగలదని భక్తజనుల విశ్వాసం.
ఈ ఆలయ నిర్మాణం సుమారు నాలుగు శతాబ్దములకు పూర్వం అక్కన్నమాదన్నల కాలంలోనే జరిగినట్లు తెలియుచున్నది. ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరులతో పాటు, నవగ్రహమంటపము కలవు, అంతేకాక ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారామస్వామివారి ఆలయం కలదు. శివాలయం ఎదురుగా ఆంజనేయస్వామివారు కొలువై వుండటం ఈ క్షేత్ర విశేషం. ఈ ఆలయానికి జేర్చి పురాతనమయిన మదనగోపాలస్వామివారి మందిరం గలదు. ఆలయ కుడ్యములపై ద్వాదశ జ్యోతిర్లింగములు, మరియు నవదుర్గల చిత్రములు అందంగా చెక్కబడియున్నవి. ఆలయప్రాంగణంలో ధ్యానముద్రలో యున్న శివుని విగ్రహం కన్నుల పండుగగా దర్శనమిచ్చును.

శ్రీ పార్వతీ హృదయ పంకజ భాస్కరాయగంగామనః కుసుమగుచ్చకపుష్పదాయనిత్యంసమాశ్రిత జనావనదీక్షితాయవ్యాసేశ్వరాం జగతాంపతయేనమస్తే.పై పద్యము పీఠికాపుర ఆస్థాన కవివర్యులు, శతావధాని కీ.శే. ఓలేటి వెంకటరామశాస్త్రిగారి వ్యాసేశ్వరాష్టకంలోనిది. ఈ పద్యం ఆలయం కుడ్యంపైన చెక్కబడియుండటం విశేషం. ఇక ఈ క్షేత్రం ఇంజరం గ్రామమునకు సమీపంలో కలదు. క్షేత్రమును చేరుటకు కాకినాడ నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం ఉన్నను ఇంజరం గ్రామం నుండి ఆటో లేదా ఇతర రవాణా సాధనాల ద్వారా పల్లిపాలెం జేరుట సులభం. వ్యాసమహర్షి ద్వారా ప్రతిష్టితమయినట్లుగా భావించబడుతున్న ఈ క్షేత్రం భరణి నక్షత్రం, తృతీయ పాదంలో జన్మించిన వ్యక్తులకు విశేష ఫలాన్నిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రస్తుత ఆలయం సుమారు రెండు శతాబ్దములకు పూర్వం నిర్మితమయినట్లు తెలియుచున్నది. తదుపరి అనేక మంది దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమములు జరిగినట్లు తెలియుచున్నది.
ఆలయమునకు ఉత్తరంగా ఆత్రేయ గోదావరినది ప్రవహిస్తున్నది. పశ్చిమాభిముఖంగా శివుడు ఉండడంతో కాశీ సమక్షేత్రంగా భావిస్తారు. ఈశాన్యంగా పుష్కరిణి కలదు. దక్షిణదిశలో ఔదుంబర వృక్షం వుండటం ఇక్కడి విశేషం. సంతానలేమిచే బాధపడేవారు ఈ క్షేత్రంలో అర్చనాభిషేకాదుల వల్ల ఫలితం కలుగగలదని భక్తుల విశ్వాసం. అంతేకాక అపరిష్కృతమయిన సమస్యలు వ్యాసేశ్వరస్వామివారి కృపచేత పరిష్కారం అవుతాయని కథనం. ఈ క్షేత్రంలోని మరొక విశేషం ఏమనగా ఇక్కడి శివలింగంపై తృతీయనేత్రం మాదిరిగా వుండటం అభిషేక సమయాలలో శివలింగం తాకిన వారికి విద్యుత్తు తాకినప్పుడు మాదిరిగా జలదరింపు కలుగుతుందట. ఈ ఆలయంలోని నవగ్రహ మంటపంలో ఆంజనేయస్వామి వారి విగ్రహం ప్రతిష్టించారు. ఇవికాక ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, దత్తాత్రేయస్వామి కొలువై యున్నారు. వైశాఖశుద్ధ ఏకాదశికి స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

ఈక్షేత్రము యానాం – ద్రాక్షారామ రహదారిలోని ఇంజరం గ్రామమునకు సుమారు 5, 6 కిలోమీటర్ల దూరమున కలదు. బస్సు సౌకర్యంలేని కారణము చేత ఈ గ్రామమునకు చేరుట ప్రయివేటు వాహనముల (ఆటో, కారు)ద్వారా చేరవలయును. ఈ క్షేత్రము భరణి నక్షత్ర నాలుగవ పాదంలో జన్మించినవారికి అత్యంత శుభప్రదమని విశ్వాసము, ఈ క్షేత్రమునందు దర్శనము మరియు అర్చనాభిషేకముల వలన పైన చెప్పబడిన జాతకులు విశేష ఫలములు పొందగలరని నమ్మిక. ఈ శివలింగ ప్రతిష్ఠ త్రేతాయుగమునందు శ్రీరామచంద్రమూర్తిచే జరిగినట్లు కథనం. శ్రీరామచంద్రుడు దండకారణ్యమున పాదాచారియై ప్రయాణము చేయు సమయములో ఇచ్చటి కోనేటియందు సాయం సంధ్యావందనం చేసుకున్న తరువాత సైకత లింగ ప్రతిష్ఠ చేసినట్లు కథనం.
ఈ గ్రామము యొక్క నామము విషయములో కూడా ఒక ఆసక్తికరమైన కథనం కలదు. పూర్వము శూర్పణఖ శ్రీరామచంద్రుని వరించి వచ్చినప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు మరియు చెవులు ఖండించగా అవి ఈ ప్రాంతమున పడినట్లు చెబుతారు. చుప్పనాతి అంగములు పడిన క్షేత్రము గావున ఈ గ్రామమునకు తొలుత “చుప్పంగల” అను నామం ఉండెడిదట. ఉత్తరోత్తర అదియే ఉప్పంగలగా మారినదట. ఈ ఆలయమునందలి మరియొక విశేషమేమనగా ఇచ్చటి నందీశ్వర విగ్రహము తిరుగునట్లుగా నిర్మించబడినది (త్రిప్పుడునంది). గ్రామమునందు ఎవరైనా స్త్రీ ప్రసవవేదన పడుచు ప్రసవము కష్టమైన ఎడల ఆ స్త్రీ యొక్క భర్త నంది ముఖమును ఆమె ఇంటివైపు త్రిప్పిన యెడల ఆ స్త్రీకి సుఖప్రసవము జరుగుతుందని నమ్మకము. దీనికి దృష్టాంతకంగా కొన్ని సంఘటనలు అచట స్థానికులు తెలియజేశారు.ఈ ఆలయమునకు కీర్తిశేషులు శ్రీమతి మన్యంగారు స్థలమును వితరణ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ క్షేత్రము కాకినాడ – యానాం ప్రధాన రహదారిపై కలదు. ఆలయమునకు చేరుటకు నీలపల్లి బస్సుస్టాపు వద్ద దిగి లోనికి వెళ్ళవలెను.ఈ క్షేత్రము కృత్తిక నక్షత్రం మొదటి పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శివమూర్తిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించినచో వారికి అరిష్ట నివృత్తి జరిగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము. ఈ గ్రామము యొక్క నామధేయము కూడా క్షేత్ర స్థిత నీలకంఠేశ్వరస్వామి పేరుమీద నీలపల్లి అయినట్లు ఒక కథనం.
ప్రస్తుతం ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నది. ఆలయమందలి మూలమూర్తులను ఒక ప్రక్కగా తాత్కాలిక మందిరమందు ప్రతిష్టించిరి. జీర్ణమైన పూర్వాలయము 500 సంవత్సరముల క్రితం నిర్మించబడెనని తెలియుచున్నది. ఈ ఆలయమును జేర్చి విశాల ప్రాంగణంలో శ్రీ సీతారామస్వామివారు మరియు శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కొలువై వున్నారు. ఈ ఆలయ ప్రాంగణమునకు శ్రీసీతారామ సమేత వెంకటేశ్వర ఆలయముగా నామకరణం జరగడం విశేషం. శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. ఈ క్షేత్రమునందు శరన్నవరాత్రులు, మరియు సుబ్రహ్మణ్యషష్ఠి తీర్థము విశేషంగా నిర్వహించబడును.

అద్దంపల్లి గ్రామం చేరుటకు యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారిలో అండ్రంగి వైపు మళ్ళవలెను. ద్రాక్షారామ అండ్రంగి మార్గములో రోడ్డు రవాణాశాఖవారి బస్సు సౌకర్యం ఉన్నను నియమిత సమయములలో ఉండుట వలన ప్రయివేటు వాహనములలో చేరుట ఉత్తమము. ఈ క్షేత్రము కృత్తిక నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. ఈ జాతకులు అద్దంపల్లి యందు కొలువైయున్న శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన శుభములు చేకూరునని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ స్థిత లింగ స్వరూపము సప్తఋషుల ప్రతిష్టయని కథనం.
అంతేకాక ఆలయం కూడా చోళరాజుల కాలంలో నిర్మితమైనట్లు తెలియుచున్నది. అయినను నేటికీ ఏ రకమైన పునరుద్ధరణ కార్యక్రమములు జరిగినట్లు లేదు. ఈ ఆలయమందలి దేవీ స్వరూపమైన పార్వతీదేవి అత్యంత ప్రభావంతమైన శక్తిగా భక్తుల నమ్మకం. అమ్మవారికి మ్రొక్కిన యెడల వారి కష్టములు తీరునని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు కూడా ఇచట ప్రసిద్ధి.

ఈ క్షేత్రము అద్దంపల్లికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రమును చేరవలెనన్న అద్దంపల్లెకు చేరడానికి ముందే మళ్ళవలెను. కృత్తిక నక్షత్రం మూడవపాదమున జన్మించిన వ్యక్తులు ఈ క్షేత్ర స్థిత పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించి అర్చించుకున్న యెడల వారి ఇబ్బందులు తొలగి సుఖసంతోషాలు పొందగలరని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రము కూడా అతి పురాతనమైనదయినను సుమారు ముప్పై సంవత్సరముల క్రితం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయమునందు ఏ విధమైన ఉపాలయములు లేవు. అలాగే గ్రామంలో కూడా ప్రతిష్ఠ ఆలయములు లేవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. శరన్నవరాత్రి ఉత్సవములు కూడా విశేషముగా నిర్వహించబడును.

ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిపై కలదు. ఆలయము కూడా రహదారి ప్రక్కనే ఉండడం చేత చేరడం కూడా అత్యంత సులభము. ఈ క్షేత్రము కృత్తిక నక్షత్రము నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఉండూరు క్షేత్రములో వేంచేసియున్న శ్రీ ఉమా సమేత మార్కండేయస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించడం ద్వారా శుభఫలితములను పొందగలరు. ఈ క్షేత్రము పురాతన శైవక్షేత్రములలో ఒకటిగా ఉన్నది. పూర్వ ఆలయము 1906వ సంవత్సరములో నిర్మించబడ్డట్లు ఇచ్చటి శిలాఫలకము ద్వారా తెలియుచున్నది. తిరిగి 1972వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ జరిగింది. ఈ ఆలయములో విశాలమైన ముఖ మంటపము మరియు కాలక్షేప మంటపము కలవు. ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయస్వామి, చండీశ్వరుల ఉపాలయములు కలవు. ఇటీవల నాగప్రతిష్ట జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఆ సమయంలో చివరిరోజున వైభవోపేతంగా రథోత్సవం జరుగుతుంది. వీటితో పాటు శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా జరుగును.

ఈ క్షేతము అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన పెనుమళ్ళ క్షేత్రమునకు కిలోమీటరు దూరములో కలదు. ఈ క్షేత్రమునకు బస్సు సౌకర్యము కలదు. ప్రయివేటు వాహనాల ద్వారా గాని స్వంత వాహనము ద్వారా గాని ఈ క్షేత్రమును చేరవచ్చును. ఈ క్షేత్రము రోహిణి నక్షత్రము మొదటి పాదమునకు చెందినది. ఈ ఆలయ స్థిత శ్రీపార్వతీ సమేత నీలకంఠేశ్వరస్వామి వారికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన రోహిణి నక్షత్రం మొదటి పాదమున జన్మించినవారి పీడలు తొలగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము.
ఈ ఆలయమునందు సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు కూడా కొలువైయున్నారు. పురాతన క్షేత్రమైన ఈ ఆలయం యాభై సంవత్సరాల క్రితం పునరుద్ధరణ జరిగినట్లు తెలుస్తున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున జరుగును. శరన్నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి కూడా నిర్వహించబడతాయి.
రోహిణి నక్షత్రం – ద్వితీయ చరణంకాజులూరు గ్రామం చేరుటకు కాకినాడ – ద్రాక్షారామ మార్గమధ్యమందలి గొల్లపాలెం గ్రామము నుండి మరియు ద్రాక్షారామ – యానాం మధ్యమందలి కుయ్యేరు గ్రామము నుండి మార్గము గలదు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారి బస్సు సౌకర్యం కలదు. ఈ ఆలయము నక్షత్ర శివాలయములలో ఒకటిగా ప్రసిద్ధిగాంచినది. రోహిణీ నక్షత్రమందలి ద్వితీయపాదమున జన్మించినవారు ఈ ఆలయ సందర్శనచే సమస్త గ్రహదోషముల నుండి విముక్తులగుదురని భక్తజనుల విశ్వాసము. కాజులూరు గ్రామము శతాబ్ధములుగా ఆధ్యాత్మిక వికాసమునకు పట్టుగొమ్మగా యున్నది. ఈ గ్రామము ఆత్రేయ గోదావరీ నదీతీరాన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్థిల్లుచున్నది. శ్రీ అగస్త్త్యేశ్వరస్వామి ఆలయము బహుప్రాచీనమైనది, పురాతనమైనది.
ఈ శివలింగ ప్రతిష్ఠ దక్షయజ్ఞమునకు పూర్వము అగస్త్య మహామునిచే జరిగినట్లుగా చెబుతారు. ఈ శివలింగము ఒక పెద్ద నాగపుట్టపై ప్రతిష్టింపబడుటచేత ఈ ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర ఆలయమునకు ప్రతీకగా భావించి సుబ్రహ్మణ్యషష్ఠి మరియు ఇతర నాగదేవత సంబంధ పర్వదినములందు విశేష అర్చనలు జరుపుచుందురు. సర్వమంగళ సమేత శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము భీష్మ ఏకాదశి రోజు వైభవోపేతముగా జరుగును. ఈ గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయము, శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర ఆలయము, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయము మరియు జగన్నాథస్వామివారి ఆలయము కలవు. ఈ గ్రామమందు షిరిడిసాయి మందిరము మరియు గ్రామ దేవతలా ఆలయములు ప్రసిద్ధి.

ఈ క్షేత్రము తనుమళ్ళకు సమీపంగా వున్నను కాజులూరు నుండి లేదా దుగ్గుదూరు నుండి పక్కా రోడ్డు సౌకర్యం వుండడం చేత ఆ గ్రామము నుండి అయితపూడి చేరుట సులభము. అయితే ఈ గ్రామమునకు ప్రత్యేకించి రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యము లేదు. అందువల్ల ప్రయివేటు వాహనముల (ఆటో) ద్వారా చేరవచ్చును. రోహిణి నక్షత్రము మూడవపాదంలో జన్మించిన వారికి ఈ క్షేత్ర స్థిత శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామివారి దర్శనము, అర్చనాభిషేకాదులు శుభ ప్రదమని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్ర స్థిత లింగమూర్తి శ్రీరామచంద్ర ప్రతిష్టగా కథనం. శ్రీరామచంద్రమూర్తి సంధ్యావందనానంతరం ఇచట సైకతలింగ ప్రతిష్ఠగావించి అర్చించినట్లుగా కథనం.
ఈ ఆలయమునకు సుమారు మూడు శతాబ్ధముల చరిత్ర కలదు. 2005వ సంవత్సరములో ఈ ఆలయ పునర్నిర్మాణము జరిగినది. ప్రస్తుత ఆలయ ముఖద్వారముపై పరమశివుడు జ్ఞానముద్రలో వున్నట్లు శిల్పీకరించబడినది. అలాగే మంటపముపై గణపతి, అయ్యప్ప ఇత్యాది మూర్తులు గలవు. ఈ ఆలయమునకు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మరియు చండీశ్వరుల ఉపాలయములు వున్నవి. గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారి ఆలయము కూడా కలదు.స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇంకనూ ఈ ఆలయమున శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి మహోత్సవములు జరుగును.

శీల గ్రామం చేరుటకు ద్రాక్షారామం నుండి రోడ్డు రవాణా సంస్థవారి బస్సులు గలవు. అంతేకాక గొల్లపాలెం నుండి కుయ్యేరు వెళ్ళు మార్గంలో కాజులూరు చేరుటకు మార్గం కలదు. ప్రయివేటు వాహనముల (ఆటో లేదా కారు) ద్వారా వెళ్ళు వారు ఈ మార్గాన్ని అనుసరించవచ్చును.ఇక ఈ క్షేత్రమున కోలువైయున్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి రోహిణి నక్షత్రం – నాలుగవపాదాన జన్మించిన వ్యక్తులకు యోగకారకుడు. ఈ క్షేత్ర దర్శనము, ఆర్చనాభిషేకాదులు పై జాతకులకు విశేష ఫలితములు కలుగజేస్తాయని భక్తుల విశ్వాసం.
శ్రీ రామార్చితపాదపద్మయుగళంశ్రీకంఠమైశ్వర్యదం !సౌరీంద్రాదిసమస్తదేవావినుతంశౌర్యేణసుశోభితం !గౌరీనాధమనంతవైభవయుతంగౌరీసమారాధితం !దీరం శూలధరంమమార్తిహరణంశ్రీరామలింగంభజే !!
పై శ్లోకం మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావుగారు శ్రీరామలింగేశ్వరస్వామివారిని గూర్చి వ్రాసినది. ఈ క్షేత్రమున కొలువైయున్న శ్రీరామలింగేశ్వరులు త్రేతాయుగమునందు శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్టించబడ్డ సైకతలింగంగా చెపుతారు. రావణబ్రహ్మ వధానంతరం బ్రహ్మహత్యాదోష నివారణార్థం వశిష్టుల సూచన ప్రకారం ప్రతిష్టించిన అనేక శివలింగములలో ఈ గ్రామంలోని శివలింగం కూడా ఒకటియని కథనం. అంతేకాక వేదవ్యాస మహర్షి కాశీపురమును విడిచి దక్షారామమును చేరు క్రమంలో అగస్త్యమహర్షిని కలిసి శిష్యులతో కూడి ఈ గ్రామాన కొలువైయున్న పార్వతీ సమేత రామలింగేశ్వరుని సేవించినట్లుగా చారిత్రిక కథనం. అట్టి మహోత్కృష్టమైన ఈ దివ్యక్షేత్రం కేవలం పైన తెలుపబడ్డ జాతకులకు మాత్రమేకాక అందరికీ కూడా సర్వశుభకరము, పాపహరము.
ఈ గ్రామంలో ఈ క్షేత్రంతో పాటుగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి ఆలయం కలదు. రామలింగేశ్వరాలయంలో గణపతి, పార్వతీదేవి ఉపాలయములు కలవు. రామలింగేశ్వరస్వామివారి దివ్య కల్యాణం మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇది మాత్రమేగాక గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రుల అనంతరం భక్తుల సహకారంతో విశేషంగా అన్నసమారాధన జరుగుతుంది. ప్రముఖ సంస్కృతపండితులు బ్రహ్మశ్రీ పులవర్తి నూకాలరావుగారు తమ శివ చాలీసా గ్రంథంలో శీల గ్రామంలో వెలసియున్న శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరులను స్తుతిస్తూ రామలింగేశ్వరాష్టకమ్ రచించారు.

ఈ క్షేత్రం కాకినాడ నుండి యానాం మార్గంలో కలదు. తాళ్ళరేవు మండల కార్యాలయం దాటి అరకిలోమీటరులోపు రహదారికి కుడివైపు ఆలయమునకు మార్గము చూపుతూ సిమెంటు ఫలకం ఉండును. ఈ క్షేత్రము భీమమండలమునందు కలదు. నక్షత్ర శివాలయములలో ఈ ఆలయం మృగశిర నక్షత్రము – ప్రథమ చరణమునకు సంబంధించినదిగా భావింప బడుచున్నది.
ఆ జన్మనక్షత్రమున జన్మించినవారు ఈ క్షేత్ర దర్శనం, అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల సత్ఫలితాలు కలుగగలవని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఉన్న ఆలయనిర్మాణం క్రీ.శ. 1737వ సంవత్సరంలో శ్రీయుతులు దినవాహి వీర్రాజుగారిచే నిర్మించబడినట్లు అక్కడి శిలాశాసనం ద్వారా తెలియుచున్నది.

ఈ క్షేత్రము కాకినాడ – యానాం ప్రధాన రహదారిలోని చొల్లంగి జంక్షన్ నుండి గాని లేదా కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని నడకుదురు గ్రామం వద్ద గురజనాపల్లి జంక్షన్ నుండి గాని చేరవచ్చును. ఈ గ్రామం చేరుటకు బస్సు సౌకర్యం అనుకూలంగా వుండదు కావున పై రెండు జంక్షన్లలో బస్సు దిగి ఆటో ద్వారా ఆలయము చేరవచ్చును. నక్షత్ర శివాలయాలలో ఈ క్షేత్రము వృషభరాశి యందలి మృగశిర నక్షత్రం రెండవ పాదమునకు చెందినది.
ఈ జాతకులు ఈ క్షేత్రమున వెలసిన శివమూర్తిని శ్రద్ధగా అర్చించిన యెడల శుభ ఫలములు చేకూరగలవని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రము వృద్ధగౌతమి నదీతీరాన కలదు. అంతేకాక ప్రసిద్ధ సప్తగోదావరి యాత్ర జరుగు చొల్లంగి గ్రామము ఈ క్షేత్రమునకు అత్యంత సమీపమున గలదు. పురాతన ఆలయము జీర్ణమైనందున 1997పునఃనిర్మాణం మరియు అర్చామూర్తుల శాస్త్రోక్త పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి ఆలయము కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. మరియు శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా జరుగును.

ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రమైన పెనుమళ్ళ గ్రామానికి అతి సమీపమున గలదు. కాకినాడ నుండి ద్రాక్షారామ నుండి రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం కలదు. అలాగే యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని ఎర్రపోతవరం జంక్షన్ నుండి ప్రయివేటు వాహనము (ఆటో) ద్వారా గాని స్వంత వాహనముల ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము మిధునరాశి యందలి మృగశిర నక్షత్రం మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులకు ఈ ఆలయ స్థిత శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి అర్చన, అభిషేకములచే విశేష ఫలములు లభించగలవని భక్తుల విశ్వాసము. అత్యంత పురాతన క్షేత్రములలో ఒకటైన ఈ ఆలయమునకు విశేష స్థల పురాణం కలదు.
పూర్వము నారద మహర్షి విష్ణుమాయను జయించుట కొరకు పీఠికాపురము నుండి ద్రాక్షారామమునకు వచ్చు క్రమములో మార్గమధ్యాన ఈ క్షేత్రము వద్ద బస చేసి ఈ క్షేత్ర సమీపాన వున్న తటాకమందలి జలముతో మల్లేశ్వరస్వామివారికి ఆర్ఘ్యపార్ష్యాదులు సమర్పించినారట. ఆ కారణము చేత స్వామి పుష్కరిణికి నారదగుండమని నామధేయము కలిగినది.
ఈ ఆలయము 1988వ సంవత్సరంలో పునరుద్ధరించబడినది. ఈ ఆలయమందలి కళ్యాణమంటపము 1976వ సంవత్సరంలో నిర్మించబడినట్లుగా అక్కడి శిలాఫలకము ద్వారా తెలియుచున్నది. ఈ ఆలయమందు సుబ్రహ్మణ్యస్వామి మరియు చండీశ్వరుల ఉపాలయములతో పాటు శివకోటి స్థూపం కలదు. ఈ గ్రామమందు పురాతన కుంతీ మాధవస్వామివారి ఆలయము మరియు కోదండరామాలయము కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. మరియు శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి కూడా వైభవంగా నిర్వహించబడును.

ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిలో జగన్నాథగిరి గ్రామపు బస్సుస్టాపునకు అతి సమీపమున కలదు. ప్రధాన రహదారిలో ఉండుట వలన ఇటు కాకినాడ నుండి అటు ద్రాక్షారామ నుండి విశేషమైన రవాణా సౌకర్యం కలదు. ఈ క్షేత్రము మృగశిర నక్షత్రము నాలుగవ పాదమునకు చెందినది.
ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శివస్వరూపానికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించడం ద్వారా విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రము అతి పురాతనమైనను దురదృష్టవశాన ఆలయము అందలి శివలింగము శిథిలమై ఉండుట చేత సుమారు 90 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ పెండ్యాల చలపతిరావు అను పుణ్యాత్ముడు ప్రస్తుతం ఉన్న శివలింగాన్ని కాశీక్షేత్రము నుండి తీసుకుని వచ్చి ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.
ఈ ఆలయమున సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ మంటపము, స్వామి అయ్యప్ప మరియు ఆంజనేయస్వామి ఉపాలయములు కలవు. వీటితో పాటు గ్రామ శివారున కొలువైయున్న గ్రామదేవత పనుగుదులమ్మ ఆలయము కూడా పురాతనమైనది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇదికాక సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. అంతేకాక అయ్యప్ప మాలాధారణలు, హనుమత్ జయంతి, హనుమత్ వ్రతము ఈ ఆలయాన ప్రసిద్ధి.

ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని ఉండూరు వంతెన దాటిన వెంటనే ఎడమప్రక్క రహదారి వెంబడి గాని లేదా జగన్నాధగిరి గ్రామం నుండిగాని చేరవచ్చును. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యము కలదు. (కాకినాడ – అండ్రంగి సర్వీసు) ప్రయివేటు వాహన సదుపాయం కూడా లభ్యం అవుతుంది. ఈ క్షేత్రము చంద్రప్రతిష్టితమైన అష్టసోమేశ్వర క్షేత్రములలో ఈశాన్య దిక్కున ప్రతిష్టింపబడ్డ శైవక్షేత్రం మరియు నక్షత్ర శివాలయములలో ఆరుద్ర నక్షత్రం మొదటి పాదానికి చెందినది. అందువల్ల ఈ జాతకులకు ఈ క్షేత్రము అభిషేకార్చనలు విశేష ఫలితాన్నివ్వగలవని భక్తుల విశ్వాసము. క్షేత్ర ప్రసిద్ధి అనుసరించి ఇతర నక్షత్రాలలో జన్మించిన వారికి కూడా క్షేత్ర దర్శన మరియు అర్చనాదులు శుభప్రదమని ఇచ్చటి అర్చకస్వామి వెల్లడించారు.
పైన తెలిపినట్లుగా ఈ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రమునకు ఈశాన్యం దిక్కున చంద్రునిచే ప్రతిష్టింపబడిన అతిప్రాచీన క్షేత్రం. ఈ ఆలయ జీర్ణోద్ధరణ సుమారు రెండువందల సంవత్సరముల క్రితం రామచంద్రాపురం రాజావారి అనుమతితో కీ.శే. శ్రీ నండూరి కంచిరాజుగారి ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది ఈ క్షత్ర స్థిత దేవీ స్వరూపము పూర్వనామము రాజరాజేశ్వరీదేవిగా వుండి తదుపరి వ్యావహారికంలో ప్రస్తుత నామదేయమైన పార్వతీదేవిగా మార్పుచెందడం విశేషం.
శ్రీయుతులు ఉప్పలపాటి రామభద్రరాజుగారి సౌజన్యంతో 1962వ సంవత్సరంలో కళ్యాణమంటప నిర్మాణం జరిగింది. తదుపరి ఉప్పలపాటి ధర్మరాజు గారిచే వాహనశాల నిర్మితమైనది. రాజమండ్రి వాస్తవ్యులయిన శ్రీయుతులు దేశిరెడ్డి మురళీకృష్ణ గారిచే 2012వ సంవత్సరంలో నాగప్రతిష్ట జరిగినది. వీరి నిధులతోనే త్వరలో మహాముఖ మంటప నిర్మాణము చేయుటకు ఆలోచన కలదు. ఈ ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం పాంచాహ్నికంగా జరగడం విశేషం. ఈ సందర్భంగా ధ్వజారోహణం, రథోత్సవం కూడా జరుగుతాయి. ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయము, సాయిబాబా ఆలయము కూడా కలవు.
ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిపై వున్నది. ఆలయమును చేరుటకు గొల్లపాలెం ప్రధాన రహదారి నుండి కాజులూరు వైపు మళ్ళవలెను. కాకినాడ నుండి కుయ్యేరు వైపు వెళ్ళు బస్సుల ద్వారా ఈ ఆలయానికి చేరవచ్చును. ప్రధాన రహదారి నుండి ఆలయం వరకు ఆటో సౌకర్యం కలదు. ఈ క్షేత్రము ఆరుద్ర నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. కనుక ఈ జాతకులు శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వరస్వామిని దర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల వారి గ్రహపీడలు తొలగి శుభఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.
గోకర్ణం (కర్నాటక రాష్ట్రం)లో వెలసిన స్వామివారే ఇక్కడ అదే పేరుతొ వెలియడం విశేషం. రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని శ్రీలంకకు తీసుకునివెళ్తునప్పుడు గణపతి ఎదురైనప్పుడు ఆ లింగాన్ని భూమిపై ఉంచిన స్థలమే గోకర్ణక్షేత్రము. ఆ క్షేత్రములోని శివుడు గోకర్ణేశ్వరుడు (మహాబలేశ్వరుడు) ఆ పేరుతొ గొల్లపాలెం గ్రామంలో శివలింగం వెలియడం విశేషం. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో అత్యంత సుందరతనంగా వుండడం భక్తులను అబ్బురపరుస్తుంది.
ఈ ఆలయంలో ఆంజనేయస్వామివారు క్షేత్రపాలకుడు. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్పస్వామి ఆలయాలు ఈ ఆలయ ప్రాంగణంలో వున్నాయి. అంతేకాక గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు విష్ణాలయం కూడా కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, అయ్యప్పస్వామి జన్మదినం వైభవోపేతంగా జరుగుతుంది.

ఈ క్షేతము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిపై కరప గ్రామం దాటిన తరువాత వచ్చును. అయితే ఆలయం చేరుటకు బస్సు స్టాపు నుంచి సుమారు కిలోమీటరు దూరం వెళ్ళవలెను. ఆలయం దాదాపు గ్రామ శివారున కలదు. ఆరుద్ర నక్షత్రం మూడవ పాదమునకు చెందినవారు ఈ ఆలయ సహిత మాణిక్యంబా సమేత భీమేశ్వరస్వామివారి దర్శన, అర్చన మరియు అభిషేకము వలన విశేష ఫలితములను పొందగలరని భక్తుల విశ్వాసము. పురాతనమైన ఈ క్షేతమునందు ఆలయము మరియు శివలింగము 1995వ సంవత్సరమున పునర్నిర్మించబడి పునఃప్రతిష్ఠ జరిగినది.
ఈ ఆలయమునందు శ్రీమాణిక్యాంబాదేవి,, శ్రీ లక్ష్మీసమేత నారాయణులు, స్వామి అయ్యప్పల ఉపాలయములు కలవు. ఆలయము వెలుపల ఆంజనేయస్వామివారి విగ్రహము కలదు. ఈ గ్రామమున ఈ ఆలయము కాక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయము మరియు శ్రీ కోదండరామ స్వామివారి ఆలయము కలవు.స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున జరుగును. ఇంకా శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి మరియు అయ్యప్ప పూజలు వైభవంగా నిర్వహించబడును.

ఈ క్షేత్రము వేళంగి సమీపంలో కలదు. వేళంగి నుండి సంపరవైపు వెళ్ళు మార్గంలో కాండ్రేగుల గ్రామమునకు ముందు గలదు. ఈ క్షేత్రము చేరుటకు రోడ్డు రవాణా సంస్థ వాహనములే కాక ప్రైవేటు వాహనము (ఆటో)ల సౌకర్యం కూడా కలదు. ఈ క్షేత్రము ఆరుద్ర నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు కూరాడ నందు కొలువైయున్న వీరభద్రస్వామి వారిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన యెడల శుభాఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము. ఈ ఆలయము సుమారు రెండువందల సంవత్సరముల క్రితం నిర్మితమైనట్లు తెలియుచున్నది.
ఈ గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయము, వెంకటేశ్వరస్వామివారి ఆలయము, సంజీవ ఆంజనేయస్వామి ఆలయము, గ్రామదేవత అన్నాపరమ్మ ఆలయము మరియు గ్రామశివారులో పోతురాజు గుడి కలవు. స్వామివారి కళ్యాణోత్సవము వైఖాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది .అంతేకాక ఇక్కడ సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాలు కూడా విశేషంగా నిర్వహించబడతాయి. ముఖ్యంగా పోతురాజు ఉత్సవాలు ఇక్కడ అత్యంత విశేషంగా జరుపబడతాయి. చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి ఈ ఉత్సవం తిలకించడానికి అనేకమంది భక్తులు తరలివస్తారు.

ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిలో కలదు. అందువల్ల కాకినాడ నుండి విశేషమైన రవాణా సౌకర్యం కలదు. చేరుట సులభము. ఈ క్షేత్రము పునర్వసు నక్షత్రము రెండవ పాదమునకు చెందినది. అందువల్ల ఈ జాతకులు కరప యందు వెలసిన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన శుభ ఫలితములు కలుగునని భక్తజనుల విశ్వాసము. ఈ ఆలయ చరిత్ర బహు పురాతనమైనది. స్వామి, శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్త అని కథనం. గత ఆలయము 1849వ ప్రాంతంలో నిర్మించబడినట్లుగా అక్కడి శిలాఫలకాలను బట్టి తెలుస్తోంది.
తదుపరి 1950వ సంవత్సరంలో జీర్ణాలయం పునరుద్ధరణ జరిగింది. తదుపరి అనేకమంది భక్తులు వారి వారి శ్రద్ధానుసారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పిఠాపురం రాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లుగా అర్చకస్వాముల కథనం. ఈ ఆలయమునకు ఉపాలయములుగా నవగ్రహ మంటపము, ఆంజనేయస్వామివారి ఆలయము కలవు. అంతేకాక పురాతనమైన విష్ణాలయం కూడా కలదు. స్వామివారి దివ్య కల్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు కూడా ఇక్కడ విశేషంగా నిర్వహించబడతాయి.