

 సూర్యభగవానుని అర్చనానంతరం ఈ ఆలయమందలి ఉష్టతాపము తగ్గించుటకై చంద్రుడు ఈ ఆలయమునకు అష్టదిక్కులయందు ఎనిమిది శివలింగములను ప్రతిష్ఠించాడు. అవి తూర్పున కోలంక, పడమర వెంటూరు, దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయాన దంగేరు, నైఋతిలో కోరుమిల్లి, వాయువ్యదిగ్భాగాన సోమేశ్వరం, ఈశాన్యాన పెనుమళ్ళ. అష్టసోమేశ్వరాలయ ప్రాంతమే భీమమండలంగా చెప్పబడుచున్నది. భీమేశ్వరుని అభిషేకము నిమిత్తముగా సప్తర్షులచే తీసుకురాబడిన గోదావరి జలాలు ఇచటనున్న సప్తగోదావరియందు అంతర్వాహినిగా ప్రవహించుచున్నట్లుగా చెబుతారు .ఇచట వెలసిన అమ్మవారు మాణిక్యాంబ, అష్టాదశ శక్తిపీఠములందు పన్నెండవ పీఠము. జగద్గురు ఆదిశంకరుల ప్రతిష్ఠ – క్షేత్రపాలకులు శ్రీలక్ష్మీనారాయణస్వామివారు శ్రీరామచంద్ర ప్రతిష్ఠ.
సూర్యభగవానుని అర్చనానంతరం ఈ ఆలయమందలి ఉష్టతాపము తగ్గించుటకై చంద్రుడు ఈ ఆలయమునకు అష్టదిక్కులయందు ఎనిమిది శివలింగములను ప్రతిష్ఠించాడు. అవి తూర్పున కోలంక, పడమర వెంటూరు, దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయాన దంగేరు, నైఋతిలో కోరుమిల్లి, వాయువ్యదిగ్భాగాన సోమేశ్వరం, ఈశాన్యాన పెనుమళ్ళ. అష్టసోమేశ్వరాలయ ప్రాంతమే భీమమండలంగా చెప్పబడుచున్నది. భీమేశ్వరుని అభిషేకము నిమిత్తముగా సప్తర్షులచే తీసుకురాబడిన గోదావరి జలాలు ఇచటనున్న సప్తగోదావరియందు అంతర్వాహినిగా ప్రవహించుచున్నట్లుగా చెబుతారు .ఇచట వెలసిన అమ్మవారు మాణిక్యాంబ, అష్టాదశ శక్తిపీఠములందు పన్నెండవ పీఠము. జగద్గురు ఆదిశంకరుల ప్రతిష్ఠ – క్షేత్రపాలకులు శ్రీలక్ష్మీనారాయణస్వామివారు శ్రీరామచంద్ర ప్రతిష్ఠ.
ఈ క్షేత్రమందలి భీమనాథుని తొలుత సూర్యభగవానుడు కొలిచినాడనుటకు నిదర్శనముగా నేటికిని ప్రాతః సమయములందు సూర్యకిరణములు స్వామివారి లింగముపై పడుచుండును. సూర్యుడు అర్చించిన అనంతరం, సప్తర్షులు, పిదప ఇంద్రాది దేవతలు భీమనాథుని అర్చించినట్లు చెబుతారు. ఈ దివ్యక్షేత్రమున శ్రీస్వామివారు, అమ్మవారు, క్షేత్రపాలకులు శ్రీలక్ష్మీనారాయణులు మాత్రమేగాక, డుండిగణపతి, కాలభైరవుడు, విరూపాక్షుడు, నటరాజేశ్వరుడు., సప్తమాతృకలు, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీమహిషాసుర మర్దని, ఆంజనేయస్వామి, నాకులేశ్వరుడు, చతుర్ముఖబ్రహ్మ, లక్ష్మీగణపతి, వటుకభైరవుడు, బ్రహ్మాది అష్టదిక్పాలకులు, నవగ్రహములు, శ్రీసూర్యేశ్వరస్వామి, శ్రీవీరభద్రేశ్వరస్వామి మరియు శ్రీచండీశ్వరస్వామి వేంచేసి యున్నారు.
పూర్వము వింధ్యాచలము మిక్కిలి గర్వియై ఎదుగుతూ పోవుటచేత సూర్యగమనమునకు ఆటంకము గలిగి విశ్వమంతయు అల్లకల్లోలమగు పరిస్థితి ఏర్పడెను. అతని గర్వమును అణచుట యెవరివల్లను కాకపోవుటచే దేవతలందరూ వింధ్య పర్వతమునకు గురువైన అగస్త్యమహర్షికి మొరపెట్టుకొనిరి. అంత అగస్త్యుడు లోకకళ్యాణార్థమై మనసంగీకరించకపోయినను కడు దుఃఖితుడై “కాశి”ని విడచి వింధ్యాచలము చెంతకు చేరెను. గురువును గాంచిన వింధ్యపర్వతము గురుచరణ స్పర్శకై తలయొంచినంతనే అగస్త్యుడు తాను తిరిగి వచ్చునంత వరకు అట్లేయుండుమని ఆదేశించి, కాశీక్షేత్ర సమానమగు దక్షారామము చేరెను. అచట లోపాముద్రా సమేతుడై సప్తగోదావరీ తీర్థమున స్నానమాచరించి మాణిక్యాంబా సమేతుడైన భీమనాధుని దర్శించి, పిదప ఆ పురమునందే స్థిరనివాసమేర్పరచుకొనెను.
ఒకప్పుడు కాశీవిశ్వనాధుడు వ్యాసమహర్షిని పరీక్షించదలచి అతనికి, అతని శిష్యగణమునకు బిక్ష దొరకకుండునట్లు చేసెను. మూడుదినములు గడచిన పిదప వ్యాసమహర్షి కాశీక్షేత్రమును శపించుటకు సిద్ధపడెను. అది గమనించి మాత అన్నపూర్ణాదేవి ముదుసలి ముత్తయిదువ రూపమున వ్యాసునికి ప్రత్యక్షమై ఆయనకు, ఆయన శిష్యులకు భిక్షనొసంగెను. పిదప విశ్వేశ్వరుడు వ్యాసుని ముందు ప్రత్యక్షమై “నీవు కుపితుడవై కాశీక్షేత్రమును శపింపనెంచితివి. ఇచట మోక్షగాములకు తప్ప భోగులకు స్థానములేదు. వెంటనే కాశీని విడిచి పొమ్మ”ని ఆదేశించెను. దానికి వ్యాసమహర్షి మిక్కిలి దుఃఖము చెందెను. అతని విచారము చూసి అన్నపూర్ణాదేవి “వత్సా! నీవంటి తపస్వులకు చింతతగదు. దక్షిణమున దక్షారామమను దివ్యక్షేత్రము గలదు. అచట పరమశివుడు భీమనాధుని రూపమున, నేను మాణిక్యాంబ రూపమున వెలసియున్నాము. నీవచటికేగి సుఖంబున వుండు”మని తెలిపి వ్యాసుని ఊరడించగా వ్యాసమహర్షి తన మూడునూర్ల శిష్యగణముతో దక్షారామముజేరి ప్రసిద్ధ తీర్థమగు సప్తగోదావరి యందు స్నానమొనరించి భీమనాధుని, అమ్మవారిని అర్చించి కాశీక్షేత్రవియోగ దుఃఖము నుండి విముక్తుడాయెను. అటుపిమ్మట అగస్త్యులతోగూడి దక్షారామముననే నివసించినట్లు కథనం.
ఈ బృహదాలయము సుమారు పన్నెండు ఎకరములపైబడిన విశాలస్థలమున నిర్మింపబడియున్నది. క్రీ.శ. తొమ్మిది, పది శతాబ్ధముల మధ్య తూర్పుచాళుక్య వంశజుడగు చాళుక్యభీముడు ఈ ఆలయమును నిర్మించినట్లు ఆధారములుగలవు. భీమేశ్వరాలయమునకు తూర్పున యాగశాల మండపం, వాయువ్యదిశలో సోమవార మంటపం, నైఋతిలో మంగళవార మంటపం, ఈశాన్యదిక్కున కాలభైరవాలయం గలవు. తూర్పున శంకరనారాయణస్వామి, ఏకశిలా నందీశ్వరుడు, సుమారు డెబ్భై అడుగుల ఎత్తైన ధ్వజస్తంభము ఉన్నవి. అష్టదిక్పాల మండపం ఎదురుగా ప్రధాన ఆలయానికి మార్గంగలదు. మూలవిరాట్ “చీకటికోణం” అని దీనికి పేరు. సుమారు పదునాలుగడుగులు ఎత్తుగా భీమేశ్వరుని స్ఫటికలింగం గలదు. పై అంతస్తు నుండి అభిషేకార్చనాదులు జరుగును. ఇచట వెలసిన భీమేశ్వరుడు భోగలింగముగా ప్రతీతి. స్వామిని సేవించిన భక్తులకు భుక్తిని, ముక్తిని ప్రసాదించునని భక్తుల విశ్వాసం.
భీమేశ్వరుని కళ్యాణము మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) రోజున కన్నుల పండుగగా జరుగును. అదే రోజున శ్రీలక్ష్మీనారాయణ స్వామి వారికి, శ్రీసూర్యేశ్వరస్వామి వారికి వైభవోపేతముగా కళ్యాణోత్సవము నిర్వహించబడును. ప్రతిమాసము మాసశివరాత్రి రోజున మరియు కార్తీకమాసమందు, మహా శివరాత్రి పర్వదినమున శ్రీస్వామి వారికి విశేషపూజలు జరుగును. ఇవి కాక ప్రతిసంవత్సరం మార్గశిర శుద్ధ చతుర్థశి రోజున స్వామివారి జన్మదినోత్సవము కడు రమ్యముగా జరుగును. ప్రతి సంవత్సరము ధనుర్మాసారంభము నుండి సంక్రాంతి వరకు క్షేత్రపాలకులయిన లక్ష్మీనారాయణులకు ధనుర్మాస పూజలు నిర్వహింపబడును.
తూర్పు దిక్కుయందు సముద్రము హద్దు, దక్షిణ దిక్కుయందు వృద్ధ గౌతమి హద్దు, పడమటి దిక్కుయందు గౌతమీ నది హద్దు, ఉత్తర దిక్కుయందు తుల్యభాగానది హద్దు, యీ నాలుగు హద్దుల మధ్య గల ప్రశస్థమైన భూమియే భీమ మండలము. ఇట్టి మండలమున దక్షారామ గ్రామమున వెలసిన దేవదేవుడే శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరుడు
దక్షారామ భీమేశ్వర క్షేత్రము దానిచుట్టూ అష్టదిక్కులలో విలసిల్లియున్న సోమేశ్వర క్షేత్రములతో కూడియున్న ప్రాంతమును భీమమండలంగా పేర్కొంటారు. ఇక ప్రస్తుత భీమసభ విషయానికి వస్తే మూలవిరాట్టుకు ఆగ్నేయంలో ఒక చిన్నగుడిలో భీమసభపేర ఒక శిలారూపమును చూడవచ్చును. దానిని జాగ్రత్తగా పరిశీలించిన ఎడల కేంద్రమున ఎత్తైన బొడిప మాదిరిగా ఒక నిర్మాణము మరియు చుట్టూ వలయములు వాటిపై చిన్న్నచిన్న బొడిపెలు కానవచ్చును. ఈ క్షేత్రము సందర్శించు అనేకమంది భక్తులు ఈ భీమసభ శిలారూపాన్ని సందర్శించడం జరగదు. ఒకవేళ చూసినా ఉపాలయమందు నమస్కరించిన రీతిలో ఆ శిలారూపానికి నమస్కరించి వెళ్ళడం జరుగుతుంది.
సుప్రసిద్ధ యోగి పుంగవులు శివబాలయోగీశ్వరులు తమ తపస్సులో ఈ భీమసభను గురించి తెలుసుకుని దాని యొక్క మర్మమును గ్రహించిరి. అటు పిమ్మట భీమసభ శిలారూపాన్ని అనుసరించి ఆయా శివక్షేత్రముల అన్వేషణ ప్రారంభమై ఉత్తరోత్తరా శివశ్రీ గంపల సోమేశ్వరరావుగారు. శివశ్రీ తాళ్ళ సాంబశివరావుగార్ల విశేష కృషిచే అష్టదిక్కులయందున్న ఎనిమిది రాశి లింగములు, తత్సంబంధిత నక్షత్ర, పాద శివక్షేతములు గుర్తించబడ్డవి.
భీమసభ యందు వివరింపబడ్డ శివాలయములకు, అన్య శివాలయములకు వ్యత్యాసము కలదు. ఇతర శివాలయములను దర్శించినపుడు మనకు ఆధ్యాత్మికానుభూతి లేదా పర్యటానుభూతి కలగటం సహజం, అది ప్రతి ఒక్కరికి అనుభవైక వేద్యమే కాని భీమసభ యందు వివరింపబడ్డ ఆలయ సందర్శనముతో మనకు కేవలం పై అనుభవమే కాక జాతక రీత్య ఉత్పన్నమయ్యే అనేక దోషములు కష్టనష్టములు నివృత్తి చెందే అవకాశం కూడా కలుగుతుంది. క్షేత్ర ప్రభావ రీత్య కానీ అచటి శివమూర్తి అనుగ్రహ రీత్యా గాని ఆయా నక్షత్రముల చరణము(పాదము)ల యందు జన్మించిన వ్యక్తులకు వారి వారి జాతక రీత్య కలిగిన అనేక సమస్యలు తొలగినట్టుగా పలువురు భక్తులు అనుభవ పూర్వకంగా తెలియజేయటం జరిగింది.
ఈ ఆలయ దర్శన విడి కూడా ఈ రకంగా ఉంటుంది, తొలుత వారి రాశి లింగమును దర్శించి పిదప వారి నక్షత్రపాద శివాలయ దర్శనము చేసుకొని చివరిగా ద్రాక్షారామ భీమేశ్వర దర్శనము అత్యంత ఫలప్రదమని భక్తకోఠి అచంచల విశ్వాసం.అందువల్ల భక్త పాఠకులకు విన్నపమేమనగా ఈ క్రమంలో దర్శన ప్రక్రియ గావించి విశేష ఫలితము పొందగలరు.