info@bheemasabha.com

గోదావరి పుష్కర చరిత్ర

పుష్కర చరిత్ర:-

పవిత్ర గోదావరినదికి పుష్కరములు వచ్చే విషయం మనకందరికీ విదితమే. ఈ సంవత్సరం జులై పద్నాలుగు (14) నుండి ఇరవైఅయిదు (25) వరకు గోదావరి నదికి పుష్కరములు నిర్ణయించబడ్డాయి, ఈ సందర్భంగా మనమందరం కూడా పుష్కరముల చరిత్ర గురించి ఆ సమయంలో చేయవలసియన విధివిధానాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. సహజంగా మనం ప్రతి ఏటా అనేక రకాలయిన పండుగలను పర్వదినాలను జరుపుకుంటూ ఉంటాము. ఆయా రోజులలో వివిధ రకాలయిన భోజ్యములు, పదార్థములతో బంధుమిత్రులను తృప్తిపరుస్తూ ఉంటాము. ఈ పుష్కర శోభ గోదావరి మాతకు పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే విశేష పర్వం అయితే మిగిలిన పండుగలలో మాదిరిగా ఉత్సాహంగానూ, ఆనందంగానూ మనం జరుపుకొనే విధి పుష్కరవిది కాదు.

ఈ సమయంలో మనం ఒక రకంగా కర్తవ్యాన్ని ధర్మాన్ని ఆచరించవలసిన అవసరం ఉన్నది. అంటే పితృదేవతలను ఋణవిముక్తులను చేయవలసిన బాధ్యత మనపైన ఉన్నది. అందుచేత పెద్దవారందరూ పుష్కరసమయంలో నదీస్నానము చేసి తమ పితృదేవతలు అనగా తాతముత్తాతలను, అర్థాంతరంగా కాలధర్మం చెందినవారినీ, పెద్దలనూ పేరుపేరునా గుర్తుచేసుకొని వారికి తర్పనములను, పిండప్రధానములను శాస్త్రోక్తంగానూ, అతి పవిత్రంగానూ సమర్పించడం ముఖ్యం. పండుగలలో పిండివంటలు చేసుకొనకపోయినా మనకు ఎట్టి కష్టనష్టములు, సమస్యలు రావు. అయితే పుష్కర తిథులలో పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వడం తప్పనిసరి. దీనిని ధర్మంగా భావించి ఆచరిస్తే పితృదేవతల ఆకలిదప్పులు తీరతాయి. వారికి స్వర్గలోకప్రాప్తి సిద్ధిస్తుంది. వితండవాదులు, నాస్తికులు భావిస్తున్నట్లుగా ఈ కార్యం కొందరు పురోహితులను లేక ఆలయాల తాలూకు అర్చకులను పోషించే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఇది ఒక వైదిక విధి. సరే, మనం ఆసలీ పుష్కరం అంటే ఏమిటి? దానికి గల ప్రాశస్త్యం ఏమిటి? దిగువ పేరాలలో తెలుసుకుందాం.

భగవంతుడు మనకిచ్చిన అనంత ఐశ్వర్యాలలో నీరు ప్రధానమైనది. అలాగే చరాచర జగత్తుకు జలమే జీవనాధారం. అందుకే పోతన శ్రీమదాంధ్ర భాగవతంలో జీవనానికి పర్యాయపదంగా జలాన్ని ఉదాహరించడం గజేంద్రమోక్ష ఘట్టంలో మనం చూస్తాం. అంతేగాక వేదకాలం నుండి జలాన్ని పంచభూతాలలో ఒకటిగా మనం చూడడం జరుగుతోంది. నీరు మనకు దాహాన్ని తీర్చడం, శరీర దుర్గంధాన్ని పోగొట్టడం మాత్రమే కాక మనకు కావలసిన ఆహారాన్ని కూడా అభివృద్ధి పరుస్తుంది. దీనితో పాటు వాతావరణాన్ని సమతౌల్యంగా ఉంచుతూ మనకు ఆరోగ్యాన్నివ్వటం మరియ ప్రకృతి వైపరీత్యాలనుండి కాపాడడం చేస్తుంది. పుష్కర సమయాలలో జలస్వరూపమైన నదీమ తల్లిని సేవించుకోవడం కూడా మన విద్యుక్త ధర్మం.

“పుష్కర” శబ్దానికి నిఘంటుపరంగా తామరపువ్వు, ఆకాశము, జలము, నక్షత్రము, మృదంగము, ఏనుగు తొండము ఇత్యాది ఇరవై ఏడ అర్థములు ఉన్నవి. ఈ పుష్కరములు అనేవి జీవనదులకు మాత్రమే వర్తిస్తాయి. (వస్తాయి). ఆ కాలంలో ఎనభైకోట్ల దేవతలు ఆయా నదులలో స్నానం చేస్తారు. అంతేకాక సప్తచిరంజీవులయిన పరశురామ, ధృవ, మార్కండేయ, హనుమ, ఆశ్వద్ధామాదులు, నదీదేవతలు, సిద్ధులు, సాధ్యులు, వసురుద్ర ఆదిత్యులు, సతీసమేతంగా ఇంద్రాది దిక్పాలకులు, త్రిమూర్తులు కూడా తేజోరూపంలో పవిత్ర స్నానాదులు ఆచరిస్తారట. అంతేగాక పుష్కర సమయంలో ముల్లోకాలయందలి పవిత్ర నదీనదాలయందు పవిత్ర జలములు పుష్కర సమయంలో ఈ నదులయందు అంతర్వాహినిగా ప్రవహిస్తాయని మన ప్రాచీనుల విశ్వాసం.

పుష్కరం అంటే …

పరమశివుని అష్టమూర్తిగా వేదంలోనూ శివమహాపురాణంలోనూ అభివర్ణించడం మనకి తెలుసు. ఆ అష్టమూర్తులు పంచభూతములు, సూర్యచంద్రులు మరియు క్షేత్రజ్ఞులు (యజమాని లేదా జీవుడు). యుగ ప్రారంభంలో “పుష్కరుడు” అనే పేరుతొ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట, ఆయన గొప్ప శివభక్తుడు. పైన తెలుపబడిన అష్టమూర్తులలోని రుద్రుని పుష్కరుడు జలరూపంలో ఉపాసన చేసేవాడు., తన కఠోరమైన తపంతో పరమేశ్వరుని మెప్పించి స్వయంగా తానే జలతత్వ సిద్ధిని పొంది అన్ని తీర్థాలకూ పవిత్రతనూ కలిగించే అధికారాన్ని పొందాడు.

అంతేగాక ఎల్లవేళలా జలరూపంలో బ్రహ్మదేవుని యొక్క కమండలమునందు స్థిరంగా ఉండేలా వరాన్ని కూడా పొందాడు. అనగా మొత్తం జలంపైన అధికారమే కాక బ్రహ్మ కమండలంలో నివశిస్తూ జలతత్వ ఉపాసన చేయసాగాడు. కొంతకాలానికి దేవగురువైన బృహస్పతి కూడా పుష్కరుని మాదిరిగా జలంపైన అధికారం పొందాలని బ్రహ్మ కొరకు తీవ్ర తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించి జలస్వరూపంలో ఉన్న పుష్కరుడు ఎల్లప్పుడూ తనతో ఉండేలా వరం కోరాడు. అయితే దానికి పుష్కరుడు అంగీకరించలేదు. తాను బ్రహ్మ కమండలంలోనే ఉంటానని బృహస్పతితో శాశ్వతంగా ఉండలేనని తన నిర్ణయాన్ని బ్రహ్మకు తెలియజేశాడు.

చివరకు బ్రహ్మ సమక్షంలో బృహస్పతికి పుష్కరునికి ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారంగా బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక రాశి నుండి మరియొక రాశిలోకి మారినప్పుడు, అదే విధంగా బృహస్పతి ఒక నదిపై నుండి మరియొక నదిపైకి తన దృష్టిని మార్చినప్పుడు పుష్కరుడు ఆ నదియందు ప్రవేశించి పన్నెండు రోజులపాటు ఉండి తిరిగి బృహస్పతి ఆ నదిని విడిచే సమయంలో చివరి పన్నెండు రోజులు బృహస్పతితో ఆ నదిలో ఉండేటట్లు నిర్ణయించారు. మిగిలిన రోజులలో ప్రతిదినం మధ్యాహ్న సమయాన రెండు ముహూర్తాల కాలం బృహస్పతితో ఉండి మిగిలిన సమయమంతా బ్రహ్మ కమండలంలో ఉండేటట్లు పుష్కరుని బ్రహ్మ ఒప్పించారు.

ఆ రకంగా జలరూపుడైన పుష్కరుడు బృహస్పతితో పాటు ఏ నదిలో ప్రవేశించి ఆ నదీజలాన్ని పవిత్రమయం చేస్తాడు. సమయాన్ని పుష్కరంగా వ్యవహరిస్తారు. ఆ సమయంలోన సమస్త దేవతలు, ఋషులు మరియు నదీదేవతలు ఆయా నదులయందు ప్రవేశించు కారణంగా భక్తజనులందరూ పుష్కర సమయంలోనే విశేషించి స్నానాదులు నిర్వర్తించి పవిత్రులు అవుతూ ఉంటారు.

గోదావరి పుష్కర విశేషములు:-

బలి చక్రవర్తిని పాతాళలోకానికి అధిపతిగా నియంచిన శ్రీమహావిష్ణువునకు (వామనావతారమునకు), ఈశ్వరుడు అనుగ్రహించిన గంగాజలంతో బ్రహ్మ పాదపూజ గావించి ఆ జలాన్ని శిరస్సుపైన జల్లుకున్నాడు. ఈ విధంగా విష్ణుపాదాలు కడిగిన గంగ ఆయన పాదలయందు జారి మేరు పర్వతం మీద పడి నాలుగు దిక్కులకు ప్రవహించింది. తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్న గంగను దేవతలు, ఋషులు స్వీకరించారు. దక్షిణదిశగా ప్రవహిస్తున్న గంగను శివుడు స్వీకరించి తన జటాజూటంలో బంధించాడు. పశ్చిమ దిక్కుగా ప్రవహించే గంగ బ్రహ్మ కమండలంలో స్థిరపడింది. ఇక ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్న గంగ శ్రీమహావిష్ణువును ఆశ్రయించింది. శివుని జటాజూటములో ఉన్న గంగను గౌతమమహర్షి ప్రసన్నం చేసుకుని భువికి రప్పించారు. ఈ గంగ కుశావర్తమందలి నాసికా త్రయంబకం వద్ద పుట్టి బ్రహ్మగిరి మీదుగా ప్రవహిస్తూ తూర్పు సముద్రం వద్ద (అంతర్వేది) సముద్రంలో సంగమించింది.

గౌతమమహర్షి ద్వారా భువికి చేరిన ఈ నదికి గౌతమి అని పేరు కలిగింది. దురదృష్టవశాత్తు గోహత్యాపాతకం పొందిన గౌతమమహర్షి ఈ జలరాశిని గోభస్మము మీదుగా ప్రవహింపజేసి గోహత్యాపాతకం నుండి బయటపడ్డాడు. గోహత్యాపాతకము నుండి విముక్తి గాంచినది కాబట్టి ఈ పవిత్ర గౌతమీనదికి గోదావరి అనే నామధేయము కలిగినట్లు తెలుస్తుంది.  రాజమహేంద్రవరం వరకు ప్రవహించిన ఈ అఖండ గోదావరి ఏడ పాయలుగా చీలి వివిధ దిశలుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ ఏడ పాయలకు ఏడు నామములు కలవు.

1. తుల్య 2. ఆత్రేయ 3. భరద్వాజ 4. గౌతమి 5. వృద్ధగౌతమి 6. కౌశిక 7. వశిష్ఠ ఇందలి వశిష్ఠకు వైనతేయ అని కూడా పేరు కలదు సర్వమూలను నాశనమోనరించిన వైనతేయుడు (గరుత్మంతుడు) తన నాసికకు అంటిన రక్తాన్ని ఈ నదిలో శుద్ధపరచుకున్న కారణంగా ఈ నదికి వైనతేయమని పేరు కలిగినది. అయితే ఇందలి మూడు పాయలు ప్రస్తుతం అంతర్వాహినిగా ఉన్నాయి. కేవలం నాలుగు మాత్రేమే ప్రవాహరూపంలో మనకు గోచరిస్తాయి.

ఏయే నదులకు పుష్కరాలు వర్తిస్తాయో తెలుసుకుందాం:-

బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారినప్పుడు ఒక్కోనదికి పుష్కరాలు సంభవిస్తాయని మనం ముందు తెలుసుకున్నాం,. గంగ, యమున, సరస్వతి, నర్మద, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, సింధు మొదలయిన పన్నెండు నదులకు మాత్రమే ఈ పుష్కరాలు వస్తాయని మనకు తెలుస్తున్నది. అనగా పన్నెండేళ్ళకొకసారి ఈ నదులలో పుష్కర ప్రవేశం జరుగుతుంది. 1. గంగ : మేషరాశి 2. నర్మద (రేవా): వృషభరాశి 3. సరస్వతి : మిథునరాశి 4. యమున : కర్కాటకరాశి 5. గోదావరి : సింహరాశి 6. కృష్ణ : కన్యారాశి 7. కావేరి : తులారాశి 8. భీమరథి : వృశ్చికరాశి 9. పుష్కరిణి : ధనుస్సు రాశి 10. తుంగభద్ర : మకరరాశి 11. సింధునది : కుంభరాశి 12. ప్రణితనది : మీనరాశి

పుష్కరాల్లో ఏం చేయాలి?

ఇట్టి పవిత్ర పుష్కర సమయాల్లో దేవతలకు కుటుంబంలోని పెద్దలకు, అకాల మృత్యువు ప్రాప్తించిన పిన్నలకు పితృకర్మలు చేసి తర్పణాలు వదలాలి. అలాగే యథాశక్తి సువర్ణ, రజత, భూ, గోదానాదులను సమర్పించి పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి కలిగించాలి. అంతేకాక ఈ సమయంలో గ్రహ జపాదులు నిర్వర్తించి పేదలకు అన్నవస్త్రాలు దానములు చేయాలి. వీలయినంతవరకూ ఇతరుల కష్టములు తొలగించి సంతోషపరచాలి. ఆ విధంగా చేసిన యెడల ఆ యజమాని యొక్క కుటుంబము ఆయురారోగ్యాఐశ్వర్యాలతో తులతూగుతుందని మహర్షుల ఉవాచ.

ఇలాంటి పుష్కరాలు పన్నెండు సార్లు సంభవిస్తే తదుపరి పుష్కరాన్ని మహాపుష్కరం లేదా మహాకుంభమేళాగా వ్యవహరిస్తారు. అంటే ప్రతి 144 సంవత్సరాలకొకసారి ప్రతినదికీ మహాపుష్కరం ఏర్పడుతుంది. ప్రస్తుతం పవిత్ర గోదావరికి ఏర్పడబోయే పుష్కరాలు అటువంటి మహాపుష్కరంగా దైవజ్ఞులు, ఆద్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు.  ఈ సమయంలో బృహస్పతి సింహరాశియందు ప్రవేశిస్తున్న కాలంలో గోదావరికి జులై పద్నాలుగు నుండి ఇరవై అయిదు వరకు పుష్కరం నిర్ణయం జరిగింది.

గోదావరి స్నాన ఫలితము :-

గోదావరి స్నానానికి గల విశేష ఫలితాన్ని ఈ క్రింది శ్లోకాల ద్వారా తెలుసుకోవచ్చు.

శ్లో. రేవాతీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీతటే! దానందద్యా త్మురుక్షేత్రే గౌతమీమ్యాంత్రితయంపరం!!

అర్థం:- రేవానదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి వస్తుంది. గంగాతీరాన తనువు చాలిస్తే ముక్తి వస్తుంది. కురుక్షేత్రంలో దానం చేస్తే మోక్షం కలుగుతుందని అంటారు. గోదావరిలో స్నానం చేస్తే ఆ మూడు పుణ్యాలు యిట్టె లభ్యమవుతాయి.

శ్లో. పుష్యార్మే జన్మనక్షత్రే వ్యతీపాటే దినత్రాయే! సకృద్గోదావారీ స్నానం కులకోటిం సముద్ధరేత్!!

అర్థం:- పుష్యమినక్షత్రంవున్న ఆదివారంనాడుగాని, పుట్టినరోజునాడుగాని, వ్యతీపాతాలలోగాని, లేదా మామూలు రోజులలో వరుసగా మూడు దినాలుగాని ఎవరైతే గోదావరినదిలో స్నానం చేస్తారో వారి యొక్క వంశంలో కోటిమందికి ఊర్థ్వగతులు లభిస్తాయి.

శ్లో. యా గతి ర్థర్మశీలానాం మునీనా మూర్ధ్వరేతసాం! సా గతి స్సర్వజంతూనాం గౌతమీతీరవాసినాం!!

అర్థం:- కొంచెము కూడా ధర్మం తప్పకుండా జీవించేవాళ్ళకూ, మునులకు, యోగులకు జీవితానంతరం యేయే ఉత్తమగతులైతే ప్రాప్తిస్తాయో అటువంటి సద్గతులు గోదావరితీరంలో బ్రతికే సర్వప్రాణులకూ లభిస్తాయి.

శ్లో. అశ్వమేథ ఫలం చైవ లక్షగోదానజం ఫలం! ప్రపనోటి స్నానమాత్రేనా (సప్తయంతిచసాగరమ్) గౌతమ్యాం సింహాగేగురౌ!!

అర్థం:- పుష్కరాలప్పుడు గోదావరిలో స్నానం చేస్తే అశ్వమేథయాగం చేసినంత ఫలం లభిస్తుంది. కావున, ఎల్లరూ యీ శుభవేళ గౌతమీ స్నానమాచరించి తరింతురుగాక.

పై శోకాన్ననుసరించి మనం కేవలం బాసర, భద్రాచలం, గోష్పాదక్షేత్రం (కొవ్వూరు), రాజమహేంద్రి (రాజమండ్రి) ఇత్యాది క్షేత్రాలలో మాత్రేమేగాక నాసికాత్రయంబకం నుండి అంతర్వేది వరకు ఎక్కడ స్నానం చేసినా అదే ఫలితం లభించగలదు.

పుష్కరస్నాన విధానం

పుష్కర సమయంలో గోదావరీ నదీస్నానం చేయుటకు ముందుగ సంకల్పం చెప్పాలి. సంకల్పం చెప్పడానికి పురోహితులు అందుబాటులో ఉండవచ్చు! ఉండకపోవచ్చు!
అందువలన ఎవ్వరి సహాయం అవసరం లేకుండగ మనంతట మనమే స్నాన సంకల్పం చెప్పుకుని తీర్థవిధులను నిర్వర్తించుకొనుటకు వీలుగా స్నానవిధానం తెలియజేస్తున్నాం!

గోదావరి నదికి అభిముఖంగ గాని, ఉత్తరముఖంగ గాని కూర్చుని నమస్కారం చేస్తూ

ధ్యానం : పద్మాస్యాం పద్మపత్రాక్షీం, పద్మగర్భస్వరూపిణీం
చిన్తయేత్ పద్మపాదాడ్యాం, పద్మాసన నివేశినీం
చరుర్భుజాం సువర్ణాభాం, వరదాం పద్మధారిణీం
సుధాసంపూర్ణసౌవర్ణ, కలశద్వయ ధారిణీమ్!! క్షామయుగ్మ
పరీధానాం, రత్న కుంకుమ ధారిణీం; చంద్రచూడ ధరాం
దేవీం, దివ్య పుష్పోపశోభితామ్.

శ్రీ పుష్కర గోదావరీ దేవ్యై నమః ధ్యానం సమర్పయామి.
దంపతులు ఇరువురు గోదావరినదిలోకి మోకాలిలోతువరకు దిగి
1. పిప్పలాదాత్ సముత్పన్నే, కృత్యై లోకే భయంకరే
(హరిద్రాం) మృత్తికాం తే మయా దత్తాం, ఆహారార్థం ప్రకల్పయ
అని గట్టుపైనున్న మట్టిని గోదావరిలో కొద్దికొద్దిగా వేయాలి.

పై శ్లోకంలో స్త్రీలు ‘మృత్తికాం’ అనుదానికి బదులుగా ‘హరిద్రాం’ అని పలికి పసుపు కుంకుమలను గోదావరిలో కొద్దికొద్దిగా వేయాలి.

2. గంగా గంగేతి యో బ్రూయాత్, యోజనానాం శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం స గచ్చతి.

అని గంగా నదిని స్మరిస్తూ దంపతులిరువురు ఒకరి చేయి మరియొకరు పట్టుకొని సరిగంగాస్నానం చేయాలి.

3. అంబ త్వద్దర్భనాత్ ముక్తి: న జానే స్నానజం ఫలం
స్వర్గారోహణసోపానే, మహాపుణ్యతరంగిణీ!!

అను శ్లోకమంత్రాన్ని చెప్పి రెండవమారు తలనిండ స్నానం చేయాలి.

4. వందే కాశీం గుహం గంగాం, భవానీం మణికర్ణికాం
అతితీక్ష్ణ మహాకాయ! కల్పాంత దహనోపమా!
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి
త్వం రాజా సర్వతీర్థానాం, త్వమేవ జగతః పితా!!
అని చెప్పి దంపతులు మూడవమారు స్నానం చేయాలి.

5. పుష్యార్కే జన్మనక్షత్రే వ్యతీపాతే దినత్రయే
సకృత్ గోదావరీ స్నానక్మ్ కులకోటి సముద్ధరేత్ !!

అని గోదావరి నీటిని తలపై జల్లుకొని అనంతరం శరీరశుద్ధికొరకై గోదావరీ నదిలో (సబ్బులు వాడకుండగ) శుచిగా స్నానం చెయ్యాలి.

తర్వాత శ్రీకేశవాయనమః అని ఆచమనం చేసి
సంకల్పం చెప్పుకుని … శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం.

‘సింహగతే దేవగురౌ, స్వార్థకోటి తీర్థసహిత, పుష్కర తీర్థ రాజ సమాగమాఖ్యే మహాపర్వణీ పుణ్యకాలే అఖండ గోదావర్యాం మంగళస్నానమాహం కరిష్యే’ అని కొద్దిగ నీటిని చేతిలోని తీసుకుని గోదావరిలో విడిచి పెట్టాలి.

గోదావరినదిలో ఏ ప్రాంతంలో స్నానమాచరిస్తున్నారో, ఆ ప్రాంతం పేరు స్మరించి స్నానం చేయాలి.
ఈ విధంగ ప్రవాహానికి అభిముఖంగా మూడుసార్లు స్నానం చెయ్యాలి. తూర్పు దిక్కుగ మూడుసార్లు మునిగి స్నానం పూర్తిచేసి గోదావరీమాతకు దోసిలినిండ నీటిని తీసికొని ఎనిమిది సార్లు ఆర్ఘ్యమియ్యాలి.

స్నానాంగతయాఅర్ఘ్య ప్రదానాని కరిష్యే! అని చెప్పి

1. భానో భాస్కర మార్తాండ, చండరశ్మి దివాకర
ఆయురారోగ్యమైశ్వర్యం, శ్రియం పుత్రాంశ్చ దేహి మే (1)
శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణేనమః ఇద మర్ఘ్యం సమర్పయామి! అని నీటిని విడిచిపెట్టాలి.

2. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ
మరీచ్యాది ఆదిత్య సవిత్రు ఆర్క భాస్కరేభ్యో నమః
ఇద మర్ఘ్యం సమర్పయామి (2)
అని నీటిని విడిచిపెట్టాలి.

3. చతుర్భుజ జగత్ స్రష్ట సత్యలోకస్థిత అవ్యయ
స్వరస్వత్యాసహిత – గృహాణార్ఘ్యం నమోస్తుతే (3)

సకల జగత్ స్రష్టకాయ, చతుర్భుజబ్రాహ్మణేనమః
ఇద మర్ఘ్యం సమర్పయామి. – అని నీటిని విడిచిపెట్టాలి.

4. పుష్కరాక్ష జగన్నాథ లక్ష్మ్యా సహా జనార్ధన
అర్ఘ్యం గృహాణ గౌతమ్యాం, సింహయుక్తే బృహస్పతౌ (4)
సర్వ జగత్ స్రష్టకాయ చతుర్ముఖపరబ్రహణే నమః
ఇద మర్ఘ్యం సమర్పయామి – అని నీటిని విడిచిపెట్టాలి

5. అష్టమూర్తే మహేశాన గంగాధర కృపానిధే
గౌర్యా సహా గృహాణార్ఘ్యం, యధోక్తఫలదో భవ (5)
శ్రీ గంగాధరాయ సాంబాయ, సదాశివాయనమః
ఇద మర్ఘ్యం సమర్పయామి! అని నీటిని విడిచిపెట్టాలి.

6 బ్రహస్పతే సురాధ్యక్ష సర్వదేవ నమస్కృత
గృహాణార్ఘ్యం మయా దత్తం, సింహస్థో భార్యయా సహా (6)
శ్రీ దేవగురవే బృహస్పతయే నమః ఇద మర్ఘ్యం సమర్పయామి. అని నీటిని విడిచిపెట్టాలి!

7 తీర్థరాజ మహాభాగ పుష్కరాఘవినాశక
పుష్కరార్ఘ్యం గ్రుహాణేశ సర్వతీర్థాభిపూజిత (7)
శ్రీ పుష్కరతీర్థే పుష్కరాయ నమః ఇద మర్ఘ్యం సమర్పయామి. అని నీటిని విడిచిపెట్టాలి.

8. త్రయంబక జటోద్భూతే గౌతమస్యాఘనాశినీ
సప్తధాబ్ధిగతే దేవి! గృహాణార్ఘ్యం నమోస్తుతే (8)
శ్రీ పరమపావన్యై గోదావరీ దేవ్యైనమః ఇద మర్ఘ్యం సమర్పయామి!! అని నీటిని విడిచిపెట్టాలి.

ఈ విధముగ ఎనిమిది మారులు అర్ఘ్యమియ్యాలి. ఒక దేవతకు అర్ఘ్యమిచ్చిన తర్వాత ఒకసారి స్నానం చేసి మరొక దేవతకు అర్ఘ్యమియ్యాలి.
చివరగ ప్రవాహాభిముఖంగ మూడు మారులు, తూర్పుముఖంగ మూడుమారులు స్నానం చేసి గట్టు మీదకు వచ్చి, నూతన వస్త్రాలను ధరించి బ్రాహ్మణులకు యధోచిత దానాదులను చేసి, అనంతరం పిండప్రదానాదికర్మలను ఆచరించాలి.

ఈ విధంగా పుష్కరసమయంలో ఎనిమిది మంది దేవతలకు అర్ఘ్య ప్రదానములు పూర్తిచేసినవారు సర్వసౌఖ్యాలను అనుభవిస్తు, సిరిసంపదలతో పిల్లపాపలతో కీర్తిప్రతిష్ఠలలో చిరకాలం జీవించి పుణ్యలోకాలను చేరుతారని పుష్కరస్నానవిధి తెలియచేస్తోంది.

పుష్కర సమయం లో చేయవలసిన దానాలు:-

పుష్కరకాలం మొత్తం 12 రోజులు. ఒక్కొక్కరోజుల ఒక్కొక్క దానం చేయాలని శాస్త్రములు చెప్తున్నాయి. అన్ని దానములు చేయుట ఉత్తమం. అవకాశం లేనివారు కనీసం మూడు రకములైన దానములను చేయవచ్చు!

ఆయా వస్తువులకు బదులుగ కొంత ద్రవ్యాన్ని ప్రత్యామ్నాయ రూపంగా దానం చేయవచ్చు. ప్రతిరోజూ ఒక బ్రాహ్మణునికి బియ్యం – పప్పు – కూరలతో కూడిన దక్షిణ యిచ్చి నమస్కరించి, ఆశీస్సులను తీసుకోవాలి.

ఏమి చేయలేనివారు, చేయలేకపోవుచున్నామని పశ్చాత్తాపంతో గోదావరీమాతకు, పుష్కరునికి, బృహస్పతికి మనస్ఫూర్తిగ నమస్కరించిన సరిపోతుంది!

1వ రోజు : వెండి – బంగారం – భూమి – ధాన్యం దానం చేయాలి.
2వ రోజు : నవరత్నాలు – వస్త్రాలు – ఉప్పు – ఆవు
3వ రోజు : పాలు – తేనె – పానకం
4వ రోజు : నూనెలు – నెయ్యి – పండ్లు
5వ రోజు : ధాన్యం – నాగలి
6వ రోజు : సువాసన ద్రవ్యాలు – పచ్చకర్పూరం – గంధం
7వ రోజు : గృహం – మంచం – పీటలు
8వ రోజు : కందమూల ఫలాలు – పూవులు
9వ రోజు : దుప్పట్లు – వస్త్రాలు
10వ రోజు : మంచి ముత్యాలు – పగడాలు – తాంబూలం
11వ రోజు : పుస్తకాలు – యజ్ఞోపవీతం – వస్త్రం
12వ రోజు : దశమహాదానాలు – సాలగ్రామం
ముఖ్యగమనికి: ఎవరికి తర్పణాదులను ఇస్తున్నారో వారికి ఇష్టమైన వస్తువులను కూడ దానమీయవలెను.