
ఈ క్షేత్రము యానాం ద్రాక్షారామ ప్రధాన రహదారిపై కోలంక గ్రామమున కలదు. ప్రధాన రహదారి నుండి సుమారు కిలోమీటరు లోపల ఈ ఆలయమునకు చేరవచ్చును. ఈ ఆలయము కేవలం నక్షత్ర శివాలయం మాత్రమే కాక అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయమును కోటిపల్లి – యానాం మార్గం ద్వారా చేరవచ్చును. రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం కలదు.
భరణి నక్షత్రము మొదటి పాదమున జన్మించినవారు ఈ ఆలయము సందర్శించి అచటి స్వామికి అర్చనాభిషేకములు చేసిన యెడల వారి విపత్తులు తీరి సంకల్పసిద్ధి కలుగుతుందని విశ్వాసము.
ఈ క్షేత్రము పైన తెలిపినట్లు చంద్ర ప్రతిష్టితమైన అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా తూర్పుకోణమున కోలంక గ్రామంలో ప్రతిష్టించబడినది. ఇచ్చటి స్థలపురాణం ప్రకారం అనేక శతాబ్దాలుగా వున్న ఈ క్షేత్రము 9వ శతాబ్ద కాలంలో చాళుక్య భీమునిచే పునరుద్దరింపబడినట్లుగా తెలియుచున్నది.
తదనంతరం పెద్దాపురం రాజుగారైన శ్రీవత్సవాయి తిమ్మజగపతిరాజుగారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారట. ఈ ఆలయమునకు చేర్చి కేశవస్వామివారి ఆలయము కలదు. ఈ రెంటికీ మధ్య ఖాళీ స్థలములో క్రీ.శ.1986 సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులవారి దివ్య ఆశిస్సులతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ప్రతిష్ట, శ్రీ అట్లూరి సత్యనారాయణ రాజు, శ్రీమతి సత్యనారాయణమ్మ దంపతుల చేతులమీదుగా జరిగినది. తదుపరి 1999వ సంవత్సరములో ఆలయ పునరుద్ధరణ శివలింగ పునఃప్రతిష్టతో పాటు పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, నంది, ధ్వజస్తంభము ఇత్యాదుల పునఃప్రతిష్ట జరిగినది. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయము శ్రీవాణీ మాతాజీ సత్సంగము వారి ఆధ్వర్యంలో నిర్మింపబడి నిర్వహించబడుచున్నది.
ఆలయము వెనుక భాగమున శ్రీవత్సవాయి తిమ్మజగపతిరాజుగారి పేరున వాహనశాల నిర్మాణం జరిగినది. దీనికి శ్రీయుతులు దాట్ల సత్యనారాయణ రాజుగారు ఆధ్వర్యం వహించారు. ఇచట ఉమా సమేత సోమేశ్వరస్వామి వారికి మరియు శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా ఏకముహూర్తములో కళ్యాణోత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారికి ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి కళ్యాణోత్సవం జరుగుతుంది.

క్షేత్రం – ఆగ్నేయం మరియు
ఉత్తరాభాద్ర నక్షత్రం – ప్రథమచరణం
ఈ క్షేతము చేరుటకు యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారి నుండి మరియు కె.గంగవరం నుండి కూడా మార్గము కలదు. రోడ్డు రవాణా సంస్థల బస్సులతో పాటు ప్రయివేటు వాహన (ఆటో) సౌకర్యం కూడా వుంటుంది.ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రాలలో ఒకటిగానేగాక నక్షత్ర శివాలయాలలో ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదానికి చెందిన క్షేత్రం కావడం కూడా మరో విశేషం. అందువల్ల ఈ క్షేత్ర దర్శనం, అర్చన, ఉభయ ఫలదాయకం. ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రమునకు చుట్టూ అష్టదిక్కులలో చంద్రునిచే ప్రతిష్టింపబడ్డ అష్టసోమేశ్వర లింగంలలో ఆగ్నేయ దిగ్భాగాన కొలువైన శంకర స్వరూపం ఈ ఉమాసమేత సోమేశ్వరులు.
ఈ క్షేత్రము వేల సంవత్సరముల చరిత్ర కలిగినది. గతంలో వున్న ఆలయం భూమి ఉపరితలమునకు సుమారు నాలుగడుగుల లోతులో ఉండేది. మెట్లుదిగి లోనికి ప్రవేశించేవారు. దరిమిలా 2011వ సంవత్సరంలో ఆలయం పునర్నిర్మాణం జరిగినది. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపము, చండీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివార్ల ఉపాలయములు గలవు. ఈ క్షేత్రములో ఈ ఆలయంగాక ఇంకా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయము, వెంకటేశ్వరస్వామి ఆలయము, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయము మరియు ఆంజనేయస్వామివారి ఆలయము కలవు.
స్వామివారి దివ్య కళ్యాణమహోత్సవము వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా అత్యంత వైభవోపేతంగా జరుగును. ఇది కాక ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవములు కూడా విశేషముగా జరుగుతాయి.

శతభిష నక్షత్రం – ప్రథమచరణం
కోటితీర్థమితి ఖ్యాతం త్రీషులోకేషు విశ్రుతం
వింధ్యస్య దక్షిణేపార్స్వే గోదావర్యాస్తటే శుభే
ఛాయాసోమేశ్వరోదేవస్తత్ర సన్నిహితశ్శివః
తత్ర స్నానేన దానేన సద్యోముచ్యంతి మానవాః
ఈ క్షేతము చేరుటకు రాజమండ్రి నుండి కాకినాడ నుండి రోడ్డు రవాణా శాఖవారి బస్సు సౌకర్యము విశేషముగా కలదు. అలాగే ద్రాక్షారామ నుండి ప్రయివేటు వాహన (ఆటో) సౌకర్యం కూడా కలదు. చేరుట అతి సులభము. ఈ క్షేత్రము చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వర క్షేత్రాలలో ఒకటి, ఈ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర లింగమునకు దక్షిణ దిక్కున కలదు. అలాగే నక్షత్ర శివాలయాలలో శతభిషం నక్షత్రం మొదటి పాదానికి చెందిన క్షేత్రం కావడం మరో విశేషం. అందువల్ల ఈ క్షేత్ర దర్శనం, అర్చనాభిషేకాదుల వల్ల విశేష ఫలితాలు కలుగు అవకాశం గలదు.
శ్రీఛాయాసోమేశ్వరునివృత్తాంతము: పూర్వము చంద్రుడు తన గురుపత్నియగు తారను జూచి కామపరవశుడై ఆమెను గూడిన కారణమున తన సహజఛాయను గోల్పోయెను. క్షయవ్యాధి పీడితుడాయెను. తన సమస్యలకు గురుపత్నీ సమాగమమే కారణముగా నెంచి పశ్చాత్తాపముతో తరుణోపాయము గానరాక శ్రీమన్నారాయణుని పలువిధముల గీర్తించి, ఆయనకై తపమొనర్చెను. దానికి కరుణాంతరంగుడు శ్రీహరి కరుణించి, చంద్రుని యాతన గ్రహించినవాడై అతనితో “చంద్రా! నీవు కోటితీర్థమునకు జేరి యచటి గౌతమీనది యందు స్నానము గావించి, సిద్ధిజనార్ధన నామముతో వెలసియున్న నన్ను దర్శించి, శ్రీ కోటీశ్వరుని భక్తిశ్రద్ధలతో గొలిచి, ఈ క్షేత్రమున నీ పేరున శ్రీ పార్వతీ సహిత సోమేశ్వరలింగమును, స్థాపించి బిల్వదళములతో పూజించిన యెడల నీ పూర్వపు ఛాయను తిరిగి పొందగలవని వరమిచ్చెను”. చంద్రుడట్లే గావించి తనఛాయను తిరిగిపొందెను. ఆ విధంగా ఈ లింగమునకు “ఛాయాసోమేశ్వరుడ”నియు, ఈ క్షేత్రమునకు “సోమతీర్థ”మనియు పేర్లు. ఈ లింగము భోగలింగము. అట్లు ఈ క్షేత్రము “కోటిఫలి” క్షేత్రమయినది. ఈ క్షేత్రమునే “ఇంద్రతీర్థమ”ని కూడా పిలుతురు.
ఈ క్షేత్రమున శ్రీదేవి, భూదేవి సమేత సిద్ధిజనార్థానస్వామి వారు క్షేత్రపాలకులుగా విలసిల్లియున్నారు. ఈ ఆలయప్రాంగణమున ఇంకను శ్రీ ఉమా సమేత కోటీశ్వరస్వామి, శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయాసోమేశ్వరస్వామి, శ్రీకాలభైరవుడు, నవగ్రహాలయము గలవు. ప్రధాన ఆలయములు మూడింటికి మూడు ఆసక్తిదాయకమగు వృత్తాంతములు వివరింపబడినవి.

నైఋతి మరియు పూర్వాషాఢ నక్షత్రం – ద్వితీయచరణం
ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ నుండి మండపేట నుండి రవాణా సంస్థ వారి బస్ సౌకర్యం కలదు. మండపేట లేదా చింతలూరు సెంటర్ నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చును. చంద్ర ప్రతిష్టితమైన ఈ క్షేత్రం అష్టసోమేశ్వర క్షేత్రాలలో ఒకటి. అతి పురాతనమైన ఈ ఆలయం సుమారు 500 నుండి 600 సంవత్సరములకు పూర్వం నిర్మించబడ్డది. అయితే ధ్వజస్తంభం 1957వ సంవత్సరంలో శ్రీ యుతులు ముద్రగడ నాగయ్యగారి సహకారంతో పునఃప్రతిష్టించబడ్డది. కళ్యాణోత్సవాలు ముద్రగడ వంశీయులు పేరుమీద జరుగుతాయి.
అంతరాలయంలో గణపతి, ఉపాలయాలలో అమ్మవారు మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై వున్నారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకులు శ్రీలక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయానికి చేర్చి ప్రసిద్ధ నవ జనార్ధనక్షేత్రమైన శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం కలదు. స్వామివారి దివ్య కల్యాణోత్సవం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహించబడతాయి.

స్వాతి నక్షత్రం – చతుర్థ చరణం
ఈ క్షేత్రము మండపేట నుండి ద్రాక్షారామ నుండి పామర్రు నుండి కూడా చేరవచ్చును. రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం కలదు.
చంద్ర ప్రతిష్టిత ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా ఉండి నక్షత్ర శివాలయాలలో స్వాతి నక్షత్రం నాలుగవ పాదమునకు చెందిన క్షేత్రం కావడాన ఈ ఆలయ దర్శన మరియు అర్చనాభిషేకాదుల చేత ఈ జాతకులు మాత్రమే కాక అన్యులకు కూడా శుభ ఫలితాలను చేకూర్చగలవని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రములో విశేషమేమనగా ప్రస్తుత శివాలయము, శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి మరియు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో వుంటాయి. ఈ ఆలయంలో గణపతి, పార్వతీదేవి, చండీశ్వరుడు ఉపాలయాలు కలవు.
నవగ్రహ మంటపం కూడా వున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి కూడా ఇక్కడ విశేషంగా నిర్వహించబడతాయి.

వాయువ్యం మరియు హస్త నక్షత్రం – ప్రథమచరణం
ఈ క్షేత్రము కాకినాడ – రావులపాలెం ప్రధాన రహదారిపై పసలపూడి దాటిన పిదప వున్నది. విశేష రవాణా సౌకర్యం కలదు. చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటైన ఈ ఆలయమునకు వేయి సంవత్సరములపైన చరిత్ర కలదు. అన్ని అష్టసోమేశ్వర క్షేత్రముల కన్న ఈ క్షేత్రము అందలి ఆలయము అతి విశాల ప్రాకారమునందు అద్భుతంగా నిర్మించబడ్డది. ఆలయమును చూడగానే ఆలయము యొక్క పురాతనత్వము తెలియనగును. ఆలయము ఎదురుగా ఉన్న తటాకమునందు నూతనంగా నిర్మించబడ్డ్డ పరమశివుని భారీ విగ్రహము ఈ క్షేత్రమునకు మరింత శోభ తెచ్చినది. ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రమే కాక హస్తా నక్షత్రం మొదటి పాదమునకు చెందిన క్షేత్రం కావడం విశేషం. ఈ జాతకులు ఈ ఆలయాన కొలువైయున్న శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరుని దర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఎడల విశేష ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.
ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, ఆంజనేయస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పర్వతవర్థినీ సమేత బ్రహ్మేశ్వరస్వామి, కాలభైరవుడు, చండీశ్వరుడు, సూర్యనారాయణమూర్తి మరియు డుండి గణపతి ఉపాలయాలలో కొలువైయున్నారు. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాంగణం ప్రశాంతముగా మరియు ధ్యానమునకు అత్యంత అనుకూలంగా ఉండడం విశేషం.
స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. కళ్యాణోత్సవ సమయంలో రథోత్సవం కూడా జరుగుతుంది. శరన్నవరాత్రి, వైకుంఠ ఏకాదశి వారోత్సవాలు, మాసోత్సవాలు, సుబ్రహ్మణ్యషష్ఠి మరియు కల్యాణం, గణపతి నవరాత్రులు, హనుమజయంతి ఘనంగా నిర్వహించబడతాయి.

ఉత్తరం మరియు
రాశిలింగము – కర్కాటకం, సింహం – గురుగ్రహం – ఉత్తరందిక్కు ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు మూడుకిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు. రామచంద్రాపురం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా కూడా చేరవచ్చును.సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదాలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం. అతి పురాతనమైన ఈ ఆలయం సుమారు అరవై సంవత్సరముల క్రితం పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. అత్యంత విశేషమైన ఈ ప్రాంగణం శివ విష్ణు స్వరూపాలు వరుస మందిరాలలో కొలువైవుండడం అద్భుతం. వరుసగా గణపతి, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరులు, సోమేశ్వరస్వామి, బాలాత్రిపురసుందరి అమ్మవారు, అంక సీతారామస్వామి, శ్రీరుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కొలువై వున్నారు. ఇవి కాక చండీశ్వరాలయం, నవగ్రహ మంటపం కూడా కలవు. ఈ గ్రామంనందు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి, వృద్ధ సోమేశ్వరాలయం, వినాయక ఆలయములు కలవు. కర్కాటక, సింహరాశి యందు జన్మించిన వారు వారి వారి నక్షత్ర పాద శివాలయాలతో పాటు ఈ క్షేత్రంలో కోలువైయున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి వారిని కూడా దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన ఎడల విశేష గలితములు పొందవచ్చునని భక్తుల విశ్వాసము.
స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి సోమేశ్వరస్వామి వారికి, వేణుగోపాలస్వామివారికి, వెంకటేశ్వరస్వామివారికి ఏకకాలంలో పాంచాహ్నికంగా నిర్వహించబడతాయి. ఇది క్షేత్ర విశేషం. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా జరుగుతాయి. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి.

ఈశాన్యం మరియు
ఆరుద్ర నక్షత్రం – -ప్రథమ చరణం ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని ఉండూరు వంతెన దాటిన వెంటనే ఎడమప్రక్క రహదారి వెంబడి గాని లేదా జగన్నాధగిరి గ్రామం నుండిగాని చేరవచ్చును. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యము కలదు. (కాకినాడ – అండ్రంగి సర్వీసు) ప్రయివేటు వాహన సదుపాయం కూడా లభ్యం అవుతుంది.
ఈ క్షేత్రము చంద్రప్రతిష్టితమైన అష్టసోమేశ్వర క్షేత్రములలో ఈశాన్య దిక్కున ప్రతిష్టింపబడ్డ శైవక్షేత్రం మరియు నక్షత్ర శివాలయములలో ఆరుద్ర నక్షత్రం మొదటి పాదానికి చెందినది. అందువల్ల ఈ జాతకులకు ఈ క్షేత్రము అభిషేకార్చనలు విశేష ఫలితాన్నివ్వగలవని భక్తుల విశ్వాసము. క్షేత్ర ప్రసిద్ధి అనుసరించి ఇతర నక్షత్రాలలో జన్మించిన వారికి కూడా క్షేత్ర దర్శన మరియు అర్చనాదులు శుభప్రదమని ఇచ్చటి అర్చకస్వామి వెల్లడించారు. పైన తెలిపినట్లుగా ఈ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రమునకు ఈశాన్యం దిక్కున చంద్రునిచే ప్రతిష్టింపబడిన అతిప్రాచీన క్షేత్రం.
ఈ ఆలయ జీర్ణోద్ధరణ సుమారు రెండువందల సంవత్సరముల క్రితం రామచంద్రాపురం రాజావారి అనుమతితో కీ.శే. శ్రీ నండూరి కంచిరాజుగారి ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది ఈ క్షత్ర స్థిత దేవీ స్వరూపము పూర్వనామము రాజరాజేశ్వరీదేవిగా వుండి తదుపరి వ్యావహారికంలో ప్రస్తుత నామదేయమైన పార్వతీదేవిగా మార్పుచెందడం విశేషం. శ్రీయుతులు ఉప్పలపాటి రామభాద్రరాజుగారి సౌజన్యంతో 1962వ సంవత్సరంలో కళ్యాణమంటప నిర్మాణం జరిగింది. తదుపరి ఉప్పలపాటి ధర్మరాజు గారిచే వాహనశాల నిర్మితమైనది. రాజమండ్రి వాస్తవ్యులయిన శ్రీయుతులు దేశిరెడ్డి మురళీకృష్ణ గారిచే 2012వ సంవత్సరంలో నాగప్రతిష్ట జరిగినది. వీరి నిధులతోనే త్వరలో మహాముఖ మంటప నిర్మాణము చేయుటకు ఆలోచన కలదు. ఈ ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం పాంచాహ్నికంగా జరగడం విశేషం. ఈ సందర్భంగా ధ్వజారోహణం, రథోత్సవం కూడా జరుగుతాయి.
ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయము, సాయిబాబా ఆలయము కూడా కలవు.