info@bheemasabha.com

శ్రీ సర్వమంగళా సమేత అగస్త్యేశ్వర స్వామి – కాజులూరు

Kajuluruరోహిణి నక్షత్రం – ద్వితీయ చరణం

కాజులూరు గ్రామం చేరుటకు కాకినాడ – ద్రాక్షారామ మార్గమధ్యమందలి గొల్లపాలెం గ్రామము నుండి మరియు ద్రాక్షారామ – యానాం మధ్యమందలి కుయ్యేరు గ్రామము నుండి మార్గము గలదు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారి బస్సు సౌకర్యం కలదు. ఈ ఆలయము నక్షత్ర శివాలయములలో ఒకటిగా ప్రసిద్ధిగాంచినది. రోహిణీ నక్షత్రమందలి ద్వితీయపాదమున జన్మించినవారు ఈ ఆలయ సందర్శనచే సమస్త గ్రహదోషముల నుండి విముక్తులగుదురని భక్తజనుల విశ్వాసము. కాజులూరు గ్రామము శతాబ్ధములుగా ఆధ్యాత్మిక వికాసమునకు పట్టుగొమ్మగా యున్నది. ఈ గ్రామము ఆత్రేయ గోదావరీ నదీతీరాన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్థిల్లుచున్నది. శ్రీ అగస్త్త్యేశ్వరస్వామి ఆలయము బహుప్రాచీనమైనది, పురాతనమైనది.

ఈ శివలింగ ప్రతిష్ఠ దక్షయజ్ఞమునకు పూర్వము అగస్త్య మహామునిచే జరిగినట్లుగా చెబుతారు. ఈ శివలింగము ఒక పెద్ద నాగపుట్టపై ప్రతిష్టింపబడుటచేత ఈ ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర ఆలయమునకు ప్రతీకగా భావించి సుబ్రహ్మణ్యషష్ఠి మరియు ఇతర నాగదేవత సంబంధ పర్వదినములందు విశేష అర్చనలు జరుపుచుందురు. సర్వమంగళ సమేత శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము భీష్మ ఏకాదశి రోజు వైభవోపేతముగా జరుగును. ఈ గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయము, శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర ఆలయము, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయము మరియు జగన్నాథస్వామివారి ఆలయము కలవు. ఈ గ్రామమందు షిరిడిసాయి మందిరము మరియు గ్రామ దేవతలా ఆలయములు ప్రసిద్ధి.