info@bheemasabha.com

శ్రీ శ్యామలాంబా సమేత సోమేశ్వరస్వామి – పెదపూడి

ఆశ్లేష నక్షత్రం – ద్వితీయ చరణంPedapudi

ఈ క్షేత్రము కాకినాడ – గొల్లలమామిడాడ ప్రధాన రహదారిపై కలదు. ఆలయం కూడా రహదారిని చేర్చి ఉండుట వలన చేరుట సులభము. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు మరియు అనేక విధములైన ప్రైవేటు వాహనములు ఈ మార్గముపై తిరుగుట వలన ఈ క్షేత్రము చేరుట సులభము.
ఆశ్లేష నక్షత్రము రెండవ పాదమునకు చెందిన ఈ క్షేత్ర దర్శనము, అర్చనాభిషేకాదులు జరిపిన యెడల ఈ జాతకులకు విశేష శుభ ఫలితాలు చేకూరగలవని భక్తుల విశ్వాసము.

కేవలం ఈ జాతకులకు మాత్రమే కాక అందరికీ కూడా విశేష ఫలాలు ఈ క్షేత్ర దర్శనం చేత కలుగుతాయని అందువల్ల దూరప్రాంతముల నుండి అనేకమంది భక్తులు ఈ స్వామివారిని దర్శించి మ్రొక్కుకుంటారని అర్చకులు తెలియజేశారు. అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గతంలో (18వ శతాబ్దం) పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా శ్రీవత్సవాయి తిమ్మజగపతి మహారాజు గారిచే నిర్మించబడినట్లు తెలుస్తున్నది. తదుపరి 1991వ సంవత్సరంలో దేవాదాయశాఖ మరియు భక్తుల సహకారంతో పునర్నిర్మించబడినది.

ఈ ఆలయమునకు చేర్చి శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం కలదు. ఆలయమందు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైయున్నారు. నవగ్రహ మంటపం కలదు. గ్రామమునందు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం కూడా వున్నది. ఈ గ్రామంలో దుర్గాదేవి ఆలయము, మార్కండేయస్వామివారి ఆలయము (శివాలయం), సాయిబాబా ఆలయము ఇత్యాదులు కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవములు ఫాల్గుణ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులతో పాటు వసంత నవరాత్రులు కూడా ఈ ఆలయంలో వైభవోపేతంగా నిర్వహించబడతాయి. ఇంకా గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవములు జరుగుతాయి.