info@bheemasabha.com

శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి – మెళ్ళూరు

మఖనక్షత్రం – ద్వితీయ చరణంmelluru

ఈ క్షేత్రం చేరుటకు కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిపై నరసాపురపుపేట వద్ద గొల్లలమామిడాడ రహదారివైపు మళ్ళి సుమారు మూడు, నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తరువాత ఎడమప్రక్కకు మళ్ళవలెను. బస్సురూటు కలదు. కాని ప్రైవేటు వాహనమున వచ్చుట సులభము. గొల్లలమామిడాడ వైపునుంచి కూడా ఇదే మార్గము ద్వారా మెళ్ళూరు చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో మఖ నక్షత్ర్తం రెండవ పాదానికి చెందినది ఈ జాతకులు ఇచట కొలువైయున్న స్వామివారికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన విశేష ఫలితములు లభించగలవని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రమునకు విశేష చరిత్ర కలదు. వేల సంవత్సరముల క్రితం ఈ లింగం అగస్త్య మహర్షిచే ప్రతిష్టించబడినట్లు కథనం.

ఉత్తరోత్తరా ఈ శివాలయం అనేక కారణాల చేత ధ్వంసం కావడం చేత సుమారు 1981వ ప్రాంతంలో సమీపమున ఉన్న చెరువులో ఈ లింగము దొరకడం దానిని గ్రామస్థులు వెలికి తీసి చిన్న మందిరం నిర్మించి అందు సశాస్త్రీయంగా ప్రతిష్టించడం జరిగింది. తదుపరి 1983వ సంవత్సరంలో గ్రామస్థులందరూ అత్యంత శ్రమకోర్చి విశాలమైన ఆలయాన్ని నిర్మించి అందు మరియొక శివలింగమును అమ్మవారితో సహా ప్రతిష్టించడం జరిగింది. అయితే 1981లో ప్రతిష్టించిన శివలింగం కూడా ప్రక్కనే చిన్నగుడిలో నేటికిని పూజలందుకోవడం విశేషం. ఈ ఆలయం ఎదురుగా పెద్దనంది స్వరూపం 1951, 1952వ సంవత్సరంలో నిర్మించబడి కన్నుల పండుగ చేయుచున్నది. ఈ ఆలయ ముఖమంటపము విశాలముగా వుండి పురాణ, భజన ఇత్యాది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలముగా ఉండును.

ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపము, దత్తాత్రేయులు, చండీశ్వరుడు, శివకోటి స్థూపము ఉపాలయములుగా కలవు. ఈ గ్రామంలో వున్న మరొక ఆలయం సామ్రాజ్య సీతారామస్వామి వారి ఆలయం. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇది కాక ఈ క్షేత్రములో శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా నిర్వహించబడును.