ఈ క్షేత్రము చేరుటకు ద్రాక్షారామ – కోటిపల్లి ప్రధాన రహదారిలో గంగవరం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు. గంగవరం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా ఈ క్షేత్రమును చేరవచ్చును. శతభిషం నక్షత్రం నాలుగవ పాదమునకు చెందిన క్షేత్రము అగుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చనము శుభదాయకం అని భక్తుల విశ్వాసము. అగస్త్య మహర్షి ప్రతిష్టగా చెప్పబడుచున్న ఈ ఆలయ నిర్మాణం సుమారు వెయ్యి సంవత్సరాల పూర్వం నిర్మించబడినట్లు తెలియుచున్నది. ఆలయ నిర్మాణపు శైలిని గమనించిన ఎడల ఈ విషయం స్పష్టమౌతుంది.
అంతేకాక ఆలయ స్థిత శివలింగము కూడా అత్యంత పురాతనమైనది. గత పుష్కరాల సమయంలో (2003వ సంవత్సరంలో)ఆలయ ప్రాకార నిర్మాణం జరిగింది. ఉపాలయాలలో అమ్మవారు, గణపతి, చండీశ్వరుడు కొలువైయున్నారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి కళ్యాణోత్సవము పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి నిర్వహించబడతాయి. (నంది సమీపంలో చిన్న సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం కలదు)