ఈ క్షేత్రము బాలాంతరము గ్రామమునకు సమీపమున గలదు. యానాం ద్రాక్షారామ వైపు ప్రధాన రహదారి నుండి బాలాంతరం వైపు మళ్ళవలెను. ప్రధాన రహదారి నుండి ఆటో సౌకర్యం వుంటుంది. లేదా స్వంత వాహనం ద్వారా వెళ్ళవచ్చును. ఈ క్షేత్రము రేవతి నక్షత్రం మూడవ పాదమునకు చెందినది కావడం వలన ఈ జాతకులు ఈ ఆలయ స్థిత లోపాముద్ర సమేత అగస్త్యేశ్వరస్వామిని అర్చించి అభిషేకాదులు నిర్వర్తించిన విశేష ఫలములు లభించునని భక్తుల విశ్వాసము.
ఈ ఆలయము అతి పురాతన శివాలయాలలో ఒకటి. అగస్త్యమహర్షి ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఇచ్చటి అమ్మవారి నామం కూడా అగస్త్యులవారి పత్ని లోపాముద్ర పేరుపై ఉండుట విశేషము. ఈ గ్రామలో ఈ ఆలయం కాక విష్ణాలయం కూడా కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి. అంతేకాక ఇక్కడ శరన్నవరాత్రులు కూడా ప్రసిద్ధి.