ఈ క్షేత్రము చేరుటకు యానాం – ద్రాక్షారామ మార్గమందలి బాలాంతరం నుండి మార్గము కలదు. బస్సు సౌకర్యము ఉన్ననూ నియమిత వేళలయందు ఉండడం చేత ప్రైవేటు వాహనం ద్వారా గానీ లేదా సొంత వాహనం ద్వారా గాని చేరుట సులభము. ఈ క్షేత్రము రేవతి నక్షత్రము మొదటి పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత లోపాముద్రా సమేత అగస్త్యేశ్వరస్వామివారిని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన ఉత్తమ ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.
ఈ ఆలయ స్థిత శివస్వరూపము అగస్త్యమహాముని ప్రతిష్టగా తెలియుచున్నది. ఈ ఆలయము వృద్ధగౌతమీ నదీ తీరమున ఉన్నది. అనేక సంవత్సరముల చరిత్రగల ఈ క్షేత్రము 2006వ సంవత్సరములో పునఃనిర్మాణం జరిగింది. ఈ ఆలయమునందు ప్రత్యేకించి ధర్మకర్తృత్వం లేదు. ఈ ఆలయమునందు ఉపాలయములుగా విజయదుర్గ, సూర్యనారాయణస్వామి, ఆంజనేయస్వామి, గణపతి, కుమారస్వామి కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. ఇవికాక గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించబడును. ఈ గ్రామములో ఈ క్షేత్రముగాక రామాలయము కూడా కలదు.