ఈ క్షేత్రము ద్రాక్షారామ నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్లు, పామర్రు నుండి నాలుగు కిలోమీటర్లు, కె. గంగవరం మీదుగా కోరుమిల్లి వైపు వెళ్ళు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారి బస్సు ద్వారా పాణంగిపల్లి చేరవచ్చును. ఈ క్షేత్రము మూల నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయమున ఉన్న శ్రీ లలితా త్రిపురసుందరీ సమేత ఉత్తరేశ్వర స్వామిని దర్శించి అభిషేకార్చనలు నిర్వర్తించిన యెడల వారి గ్రహదోషాలు తొలగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము.
ఈ నక్షత్ర పాద శివాలములలో ఎక్కడ లేని విధంగా ఈ క్షేత్రమునందు అమ్మవారు లలితాత్రిపురసుందరీ రూపంలో దర్శనమిస్తారు. సుమారు 150 సంవత్సరముల పూర్వం నుండి విలసిల్లిన ఈ ఆలయం 2004వ సంవత్సరంలో పునరుద్ధరించబడి అర్చామూర్తులు పునఃప్రతిష్ఠ గావింపబడినవి. అయితే 1940వ సంవత్సరంలో పునఃప్రతిష్టించబడిన ధ్వజస్తంభం ఎట్టి మార్పు చెందలేదు. ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువై ఉన్నారు. శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, మరియు సుబ్రహ్మణ్యషష్ఠి కూడా ఇక్కడ వైభవోపేతంగా నిర్వహించబడతాయి.