ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ నుండి మండపేట నుండి రవాణా సంస్థ వారి బస్ సౌకర్యం కలదు. మండపేట లేదా చింతలూరు సెంటర్ నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చును. చంద్ర ప్రతిష్టితమైన ఈ క్షేత్రం అష్టసోమేశ్వర క్షేత్రాలలో ఒకటి. అతి పురాతనమైన ఈ ఆలయం సుమారు 500 నుండి 600 సంవత్సరములకు పూర్వం నిర్మించబడ్డది. అయితే ధ్వజస్తంభం 1957వ సంవత్సరంలో శ్రీ యుతులు ముద్రగడ నాగయ్యగారి సహకారంతో పునఃప్రతిష్టించబడ్డది. కళ్యాణోత్సవాలు ముద్రగడ వంశీయులు పేరుమీద జరుగుతాయి.
అంతరాలయంలో గణపతి, ఉపాలయాలలో అమ్మవారు మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై వున్నారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకులు శ్రీలక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయానికి చేర్చి ప్రసిద్ధ నవజనార్ధన క్షేత్రమైన శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం కలదు. స్వామివారి దివ్య కల్యాణోత్సవం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహించబడతాయి.