info@bheemasabha.com

శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామి (క్షణముక్తీశ్వరుడు) – ముక్తీశ్వరం

పూర్వాభాద్ర నక్షత్రం – ప్రథమ చరణంMuktheswaram

ముక్తీశ్వరం తతస్తీర్థం శృణుశ్వసుసమాహితః !
యస్మిన్ తీర్థేనరా ముక్తిం క్షణాద్యాంతి శివాజ్ఞయా !!
ఈ క్షేత్రమును చేరుటకు రాజమండ్రి, అమలాపురముల నుండి బస్సు సౌకర్యము గలదు. అలాగే కోటిపల్లి వరకు కాకినాడ, రాజమండ్రి పట్టణముల నుండి బస్సు ద్వారా వచ్చిన పిదప గౌతమీనదిని నావద్వారా దాటిన యెడల తీరముననే ఈ క్షేత్రము గలదు. పూర్వాభాద్ర నక్షత్రం మొదటి పాదమునకు చెందిన క్షేత్రము కావుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చనము శుభదాయకం అని భక్తుల విశ్వాసము. ఈ ముక్తీశ్వర క్షేత్రమున క్షణకాలమైన శివుని సేవించిన యెడల ముక్తిని పొందగలరని శివుని శాసనము గలదు. ఆ ఆరనముననే ఇచట వేంచేసియున్న పరమేశ్వరునికి క్షణముక్తీశ్వరుడని పేరు ప్రసిద్ధిచెందెను.

ఈ ఆలయనకు క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవస్వామివారు. ఈ ప్రాంగణముననే శ్రీదేవీ, భూదేవి సమేతుడయిన శ్రీ కేశవస్వామివారు మరియు శ్రీ భక్తాంజనేయస్వామివారు వేంచేసియున్నారు.
ఈ ఆలయమునకు అభిముఖముగా నూతనముగా నిర్మించబడిన శ్రీరాజరాజేశ్వరీ సమేత ముక్తీశ్వరస్వామివారి ఆలయము గలదు. ఈ ఆలయము కూడా కడురమణీయముగా నిర్మింపబడినది. క్షణముక్తీశ్వర క్షేత్రమున పూజాధికములు శైవాగమ సంప్రదాయమున నిర్వహించబడుచున్నవి.

వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి కళ్యాణోత్సవము పాంచాహ్నికంగా జరుగుతుంది. దానితో పాటు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామివారి కల్యాణం కూడా జరగడం విశేషం. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి ఘనంగా నిర్వహించబడతాయి. అంతేకాక ముక్కనుమకు ప్రభల తీర్థం అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. ఏకాదశ రుద్రులు ఈ క్షేత్రానికి విచ్చేస్తారు.