ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ – రావులపాలెం ప్రాధాన రహదారిలో పసలపూడి వద్ద నుండి చెల్లూరు వైపు వెళ్ళు రహదారిలో చెల్లూరు గ్రామ సమీపంలో కలదు. ఈ గ్రామమునకు బస్సు సౌకర్యము ఉన్నను తరచూ బస్సులు లేకపోవడం చేత ప్రైవేటు వాహనం (ఆటో) లేదా సొంత వాహనం ద్వారా చేరుట ఉత్తమం. ఈ క్షేత్తము చిత్త నక్షత్రం నాలుగవ పాదానికి చెందినది. ఈ జాతకులకు క్షేత్ర స్థిత మల్లేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన యెడల విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయం అతి పురాతనమైనది. ఇక్కడ అత్యంత విశేషమైన విషయమేమనగా ఆలయం చుట్టూ విశాలమైన తటాకము విస్తరించి ఉండుట వలన ఈ ఆలయము ద్వీపకల్పమును పోలి గోచరించును. 1960వ దశకంలో ఆలయ పునఃనిర్మాణము, పునఃప్రతిష్ఠ జరిగాయి. తదుపరి 1972వ సంవత్సరంలో ముఖమంటపము, ప్రాకారమంటపము, హోమశాల నిర్మించబడ్డవి. 2008వ సంవత్సరంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిగినది. పై నిర్మాణములన్నియు దాతలు మరియు భక్తుల సహకారంతో జరిగినట్లు తెలుస్తున్నది.
స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. అంతేకాక శరన్నవరాత్రులు కూడా ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతనమైన ఆంజనేయస్వామివారి ఆలయము మరియు మెహర్ బాబా మందిరం ఉన్నవి. ఈ గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయము ప్రసిద్ది చెందినది.