ఈ క్షేత్రము చేరుటకు యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారి యందు కుయ్యేరు దాటిన తరువాత సుమారు రెండు కిలోమీటర్ల వద్ద ఎడమ పక్కకు మళ్ళవలెను. (మార్గసూచిక గలదు). మెయిన్ రోడ్డు నుండి గ్రామంలోనికి ఆటో సౌకర్యం ఉండును. ఈ క్షేత్రము రేవతి నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది. ఈ నక్షత్రమున జన్మించినవారు శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వరస్వామి వారికి అర్చనాభిషేకములు చేసిన విశేష ఫలితములు కలుగునని భక్తుల విశ్వాసము.
ఈ క్షేత్రము బహుపురాతనమైనదని తెలియుచున్నది, అగస్త్య మహర్షి ద్వారా ప్రతిష్టితమని స్థానికుల కథనం. ఆలయము 150 సంవత్సరముల పూర్వము నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. తదుపరి 1995వ సంవత్సరములో పునర్నిర్మాణము మరియు దేవతామూర్తుల పునఃప్రతిష్ఠ జరిగినవి. ధ్వజస్తంభము 1995న పునఃప్రతిష్టించబడినది. ఆలయ కుడ్యములపై అనేక దేవతామూర్తుల చిత్రములు చిత్రించబడి భక్తజనులకు కన్నులపండుగ చేయును. ఈ ఆలయమునకు ఎదురుగా 2003సంవత్సరంలో కాలక్షేపమంటపము నిర్మించబడినది. స్వామివారి కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. ఈ ఆలయమున శరన్నవరాత్రులు మరియు గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించబడును.