info@bheemasabha.com

శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామివారి దేవస్థానం – గొల్లలమామిడాడ

ఆశ్లేష నక్షత్రం – చతుర్థ చరణంGollala-mamidada

ఈ క్షేత్రం కాకినాడ – గొల్లలమామిడాడ ప్రధాన రహదారిపైన గొల్లలమామిడాడ గ్రామానికి కొద్దిగా ముందు వుంటుంది. ఈ ఆలయాన్ని పాటిమీద శివాలయం అంటారు. గొల్లలమామిడాడ చేరుటకు కాకినాడ నుండి బిక్కవోలు నుండి రవాణా సౌకర్యం కలదు. ఆశ్లేష నక్షత్రం నాలుగవపాదంలో జన్మించినవారికి ఈ ఆలయ దర్శనం అర్చన, అభిషేకాదులు విశేషమయిన ఫలితాలు ఇస్తాయని ప్రతీతి. గొల్లలమామిడాడ గ్రామం సహజంగా ఆధ్యాత్మికపరులు, భక్తులు అధికంగా వున్న గ్రామం. అనేక ఆలయాలు గ్రామంలో విలసిల్లివుండడమే కాక చక్కగా పోషించబడుతున్నాయి.

ప్రస్తుత శివాలయం ఈ ప్రాంతంలో అనేక శతాబ్దాలుగా విలసిల్లియున్నది. అయితే ప్రస్తుత ఆలయం కీ.శ. 1976వ సంవత్సరంలో గ్రామస్థుల సహకారంతో పునర్నిర్మాణం జరిగినట్లు తెలుస్తున్నది. అద్భుతమైన నిర్మాణశైలికి విశేష శిల్ప సౌందర్యానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుంది. ప్రవేశ ద్వారం నుండి గర్భాలయ ముఖద్వారం వరకూ అనేక దేవతామూర్తుల శిల్పాలు నిర్మించబడి వున్నాయి. ముఖమంటపమునందు గాయత్రీమాత ఇత్యాది శిల్పాలు చక్కగా రూపుదిద్దబడి ఉండడం ఇక్కడి విశేషం. గర్భాలయానికి ముందు ద్వారబంధంపై శివకళ్యాణికి సంబంధించిన అపురూపఘట్టం శిల్పాకృతిలో రూపుదిద్దుకుంది. అంతేకాక పరమేశ్వరుని రజత శిల్పం కూడా ఇక్కడ వుండడం విశేషం.

స్వామివారి దివ్య కళ్యాణోత్సవం మాఘబహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజున రథోత్సవం జరుగుతుంది. అది అత్యంత వైభవోపేతంగా నేత్రపర్వంగా వుంటుంది. ఈ గ్రామంలో ప్రసిద్దమయిన సూర్యదేవాలయము, కోదండరామస్వామి ఆలయము, విశ్వేశ్వరాలయము, సమేత భీమేశ్వరాలయము, షిరిడిసాయినాథుని ఆలయము, అయ్యప్పస్వామి ఆలయము కలవు. శ్రీరామనవమి నవరాత్రులు ఈ గ్రామంలోని కోదండ రామాలయంలో దాదాపు భద్రాచలానికి సమాన స్థాయిలో నిర్వర్తించబడతాయి.