ఈ క్షేత్రము కాకినాడ – రావులపాలెం ప్రధానరహదారిపై రామచంద్రాపురం పట్టణానికి సమీపమున కలదు. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ క్షేత్రమును చేరుట అతి సులభము. ఈ క్షేత్రము కన్యారాశి యందలి ఉత్తర నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది అవటం వలన ఆ జాతకులకు ఈ క్షేత్ర దర్శనం క్షేత్ర స్థిత రాజరాజేశ్వర స్వామివారికి అర్చనాభిషేకములు విశేష ఫలితములను ఇస్తాయని భక్తుల విశ్వాసం. గోదావరీ తీరాన విలసిల్లిన ఈ క్షేత్రము సుమారు ఏడు శతాబ్ధాలపైన చరిత్ర కలిగినది.
కాకతీయులు, చోళులు, రెడ్డిరాజులు మరియు ఆంగ్లేయుల కాలమునుండి కూడా ఈ ఆలయము బహుళ ప్రాచుర్యములో వున్నది. అత్యంత శోభాయమానమైన ప్రస్తుత ఆలయ నిర్మాణం కీ.శ. 1934వ సంవత్సరంలో జరిగినది. తదుపరి 1982వ సంవత్సరంలో నవగ్రహమంటప ప్రతిష్ఠ జరిగినది. ఈ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామివారు, శ్రీ షిరిడీసాయిబాబావారు, లక్ష్మీ గణపతి ఆలయము, కుమారస్వామి ఆలయము, మహాలక్ష్మీ ఆలయము మరియు రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయము ఉన్నాయి. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు ఈ క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తారు.