ఈ క్షేత్రము ముక్తేశ్వరం గ్రామానికి అతి సమీపంలో కలదు. ముక్తేశ్వరం నుండి ముమ్మడివరం వెళ్ళు మార్గంలో ఈ గ్రామం వుంటుంది. బస్సు సౌకర్యం ఉన్నను ప్రైవేటు వాహనముల ద్వారా చేరుట సులభము.శతభిషం నక్షత్రం మూడవ పాదమునకు చెందిన క్షేత్రము అగుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చనము శుభదాయకం అని భక్తుల విశ్వాసము.
ఈ ఆలయం 18వ శతాబ్దంలో పెద్దాపుర సంస్థానాధీశులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. 2014 మార్చినెలలో గ్రామస్థులు మరియు దేవాదాయశాఖవారి సహకారంతో ఆలయ ప్రాకారము, శిఖరము పునర్నిర్మించబడి ధ్వజస్తంభం మరియు మూలవిరాట్టుల పునఃప్రతిష్ఠ జరిగింది. కళ్యాణమంటపం పురాతనమైనది. ఆలయ ముఖమంటపంపై శివకుటుంబం యొక్క శిల్పము, ఆలయ ప్రాకారంపై ద్వాదశ జ్యోతిర్లింగముల చిత్రములు భక్తులను ముగ్థులను చేస్తాయి. ఈ ఆలయానికి సంబంధించి విశేష కథనం చెబుతారు.
పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ముక్తేశ్వర క్షేత్రం సందర్శించినప్పుడు వారితోపాటు వచ్చిన తత్వవేత్తలు, వేదకోవిదులు ఈ గ్రామంలోనే విడిదిచేసినట్లు ఆ కారణం చేత ఈ గ్రామం పూర్వనామము ‘తత్వపురి’గా వుండి ఉత్తరోత్తరా తొత్తరమూడిగా నామాంతరం చెందినట్లు తెలియుచున్నది,. అంతేకాక ఈ ప్రాంతం పూర్వం మునిఖండంగా ఉండేదని శివలింగం ‘మృఖండ’ మహర్షిచే ప్రతిష్టింపబడినదని ఆలయ అర్చకస్వామి వారి కథనం. ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గణపతి, పార్వతీదేవి మరియు అయ్యప్ప కొలువై వున్నారు. చండీశ్వరాలయం కలదు.
ఇవి కాక క్షణముక్తేశ్వర ఆలయం ఎదురుగా కొలువైయున్న రాజరాజేశ్వరీ సమేత ముక్తేశ్వరస్వామివారి ఆలయం కూడా ఈ గ్రామానికి చెందినదే. ఈ ఆలయాన్ని 1903వ సంవత్సరంలో నిర్మించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి దివ్య కళ్యాణోత్సవము పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి కళ్యాణము మరియు షష్ఠితో పాటు హనుమజ్జయంతి, హనుమద్వ్రతము కనుమరోజున ప్రభల తీర్థం విశేషంగా జరుగుతాయి.