info@bheemasabha.com

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి – ఆరట్లకట్ట

పునర్వసు నక్షత్ర్రం – తృతీయ చరణంAratlakatta

ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిలో కరప గ్రామమునకు సమీపమున గలదు. ఈ గ్రామమునకు రవాణా సౌకర్యం విశేషముగా గలదు. కావున చేరుట అతి సులభము. ఈ క్షేత్రము మిథునరాశి యందలి పునర్వసు నక్షత్రం మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఇచ్చటి స్వామిని అర్చించి అభిషేకాదులు చేసిన యెడల విశేష ఫలములను పొందగలరని భక్తుల నమ్మకం. అరట్లకట్ట గ్రామమునకు మరియు ఆలయమునకు ఆసక్తికరమైన చరిత్ర కలదు. అరట్లకట్టగా పిలువబడే ఈ గ్రామము పెద్దాపురం మహారాజా శ్రీ రాజావత్సవాయి తిమ్మజగపతి మహారాజువారి ఆధీనంలో అర్థకోటగా పిలువబడేది.

ఆ రోజులలో అర్థకోట బ్రాహ్మణ అగ్రహారంగా వుండేదట. సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం శ్రీ మల్లేశ్వరస్వమివారి శివలింగం గ్రామ శివార్లో మల్లెపోదలలో ఉండుట గమనించి శ్రీ రాజావారు ఆలయం నిర్మించే ఉద్దేశంతో శివలింగాన్ని వెలికి తీయించుటకు ఎంత ప్రయత్నించినను సాధ్యపడక పోవుటచే అది స్వయంభూలింగముగా భావించి అచటనే ఆలయ నిర్మాణం జరిపి శాస్త్రోక్తంగా శివలింగమునకు భ్రమరాంబ అమ్మవారని ప్రతిష్ఠ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇచట కొలువైన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు మహత్యం కలవారని ఈ దేవతా స్వరూపం శ్రీశైల భ్రమరాంబ మరియు కాటిల్ లోని దుర్గా పరమేశ్వరి అమ్మవారి మాదిరిగా భ్రామరి శక్తిగా కలిగిన శ్రీ భ్రమరాంబాదేవిగా విజయదుర్గా పీఠాధిపతులు గాడ్ గారు ప్రతిపాదించిరి. గతంలో ఈ ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల విగ్రహాలుండేవట.

కాలక్రమేణ అవి శిథిలమైన కారణం చేత సుమారు 150సంవత్సరాల పూర్వం కాకినాడ వాస్తవ్యులు శ్రీ తటవర్తి సూరయ్యగారిచే ఆలయ ప్రాంగణంలో మహాగణపతి ఆలయ ప్రతిష్ఠ జరిగింది. 1992వ సంవత్సరంలో ముఖమంటప నిర్మాణం గ్రామస్థుల సహకారంతో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయము నందు ఉపాలయములుగా దత్తాత్రేయుడు, నాగబంధము, షిరిడిసాయి ఆలయములు గలవు. అంతరాలయము నందు లక్ష్మీగణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు నిత్య పూజలందుకుంటున్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) రోజు నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అంతేగాక ఈ ఆలయంలో శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి, గణపతి నవరాత్రులు ఇత్యాదులు అత్యంత వైభవంగా జరుగుతాయి.