ఈ క్షేత్రము చేరుటకు ముక్తేశ్వరం నుండి కోటిపల్లి రేవువైపు సుమారు ఒక కిలోమీటరు ప్రయాణించి ఎడమవైపుకు మళ్ళవలెను. ఈ గ్రామం ముక్తేశ్వరం నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండును. ప్రైవేటు వాహనముల ద్వారాగానీ స్వంత వాహనముల ద్వారా గానీ చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో శ్రవణం నక్షత్రం నాలుగవ పాదానికి చెందినది. ఈ జాతకులు స్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.
సుమారు 300సంవత్సరముల పైబడి వున్న ఆలయం. 2003లో గత గోదావరి పుష్కరాల సమయంలో పునరుద్ధరించబడి పునఃప్రతిష్ఠ జరిగినది. ఈ క్షేత్రమునకు విశేష కథనం కలదు. త్రేతాయుగ సమయంలో శ్రీరామచంద్రమూర్తి క్షణముక్తేశ్వర క్షేత్రమున కోలువైయున్న పరమేశ్వరుని సేవించే ఉద్దేశంతో వచ్చినప్పుడు వారితో వచ్చిన వీరులందరూ ఈ ప్రాంతాన విడిది చేసినారని ఆ కారణంచేత ఈ గ్రామానికి వీరపల్లిపాలెం అని నామం కలిగినట్లు స్థానికులు చెబుతారు.
ఈ ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మరియు చండీశ్వరులు ఉపాలయాలలో కోలువైయున్నారు. ఈ గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకస్వామివారి ఆలయం మరియు లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయము కలవు. జ్యేష్ఠ బహుళ చవితి నుండి పాంచాహ్నికంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యషష్ఠి తీర్థం ఇక్కడ ప్రత్యేకం.