ఈ క్షేత్రము వేళంగి నుండి కాపవరం వెళ్ళు మార్గంలో కలదు. వేళంగి వరకు బస్సు సౌకర్యం కలదు. అటుపైన ప్రైవేటు వాహనంలో వెళ్ళవచ్చును. ఈ ఆలయము పుష్యమి నక్షత్రం రెండవ పాదమునకు చెందినది కావడం వలన ఈ ఆలయ స్థిత స్వామిని దర్శించి అర్చన, అభిషేకములు నిర్వర్తించిన యెడల ఈ నక్షత్రంవారు వారి గ్రహపీడలు తొలగి శుభ ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము. ఈ ఆలయం 350సంవత్సరముల పైబడి విలసిల్లినట్లు తెలుస్తోంది.
దాదాపుగా ఏరకమైన పునరుద్ధరణ పనులు జరుగలేదు. అంతరాలయంలో గణపతి, ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి చేర్చి కోదండ రామాలయం కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి నిర్వహించబడతాయి.