info@bheemasabha.com

శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరస్వామి – చింతపల్లి

పుబ్బ నక్షత్రం – ప్రథమ చరణంChintapalli

చింతపల్లి గ్రామం చేరుటకు కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిలోని కరప గ్రామం నుండి సంపరమీదుగా మార్గం కలదు. అలాగే గొల్లలమామిడాడ, వెదురుపాక గ్రామాల ద్వారా కూడా వెళ్ళవచ్చును. రోడ్డు రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యం వున్నను నియమిత సమయాలలో మాత్రమే ఉండడంవల్ల ప్రైవేటు వాహనాల ద్వారా గాని స్వంత వాహనాల ద్వారా గాని చేరుట మంచిది.

ఈ క్షేత్రము పుబ్బ నక్షత్రం మొదటి పాదమునకు చెందినది. ఈ జాతకులు చింతపల్లిలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభాద్రేశ్వరస్వామివారిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల విశేష ఫలితాలను పొందగలరని భక్తజనుల నమ్మకం. ఈ ఆలయ పురాతనత్వంపై సరియైన అంచనా లేకున్ననూ ఆలయ నిర్మాణశైలి మరియు నిర్మాణానికి వినియోగించిన సామాగ్రిని గమనించినట్లయితే శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రంగా తెలుస్తోంది.

ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ 1916వ సంవత్సరంలో జరిగినట్లుగా అక్కడి లిఖిత సమాచారం ద్వారా తెలుస్తోంది. సుమారు 30ఏళ్ళ క్రితం ముఖమంటపము పునఃరుద్ధరణ జరిగింది.ఈ ఆలయమునందు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అంతరాలయంలో మంటపమే కాక గణపతికి ముఖమంటపంలో చిన్న ఉపాలయం కలదు. అలాగే చండీశ్వరుడు కూడా కొలువై వున్నాడు. స్వామివారికి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ బహుళ ఏకాదశిరోజు నుండి పాంచాహ్నికంగా నిర్వహించబడతాయి. గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి ఆలయం కలదు.