info@bheemasabha.com

శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత భవానీ శంకరుడు – ఉప్పుమిల్లి

ఆశ్వనినక్షత్రం – ద్వితీయచరణంUppumilli-1

ఈ క్షేత్రము చేరుటకు యానాం – ద్రాక్షారామం ప్రధాన రహదారి నుండి మార్గము కలదు. ప్రధాన రహదారి వద్ద దిగి లోనికి వెళ్ళిన యెడల ఈ ఆలయమునకు చేరవచ్చును. ఉప్పుమిల్లి గ్రామమునకు విస్తృత రవాణా సౌకర్యము కలదు. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో మొదటిదైన అశ్వని నక్షత్రం రెండవపాదానికి చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత భవానీ శంకరస్వామిని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన విశేష ఫలితములుండునని భక్తుల విశ్వాసము.

ఈ క్షేత్రమునకు సంబంధించి విశేషమైన స్థలపురాణం కలదు. కలియుగారంభ సమయమున దేవతలకు మునీశ్వరులకు ఋషీశ్వరులకు స్నాన సంధ్యా వందనాది జప తపాదులకు పవిత్ర జలము లేనందున భగీరథుడు అను మహాముని ఆకాశగంగ కొరకై శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేసెను. అందులకు శంకరుడు మెచ్చి ఆకాశగంగను తన శిఖనందు బంధించి జడపాయ ద్వారా కొంత జలమును క్రిందకు వదులసాగెను. ఆ జలమును మానవ క్షేమమునకై సప్తమహాఋషులు ఒక్కొక్కరూ ఒక్కో ప్రదేశమునకు ఆ గంగను తీసుకువెళ్ళెను. ఆ మునులలో ఒకరైన అత్రి మహాముని కొంత జలమును ఈ గ్రామమునకు తూర్పున ఉత్తరముగా ప్రవహింప జేస్తూ లవణసముద్రమున కలిపినందున ఈ గ్రామమునకు ఉప్పుమిల్లి గ్రామముగా పేరువచ్చినది. ఈ నదిని అత్రిమహాముని తీసుకువచ్చినందుకు ఈ నదికి అత్రీయ గోదావరి అనియు ఉత్తరముగా ప్రవహించుటచే ఉత్తర వాహిని అనియు ఈ నదిని గొప్పరేవుగా పిలిచెడివారు. ఇప్పుడు గొప్పిరేవుగా పిలువబడుచున్నది. ఈ ఆత్రేయ గోదావరి సప్తసాగర యాత్రలలో రెండవది. ఈ గ్రామమునకు దక్షిణ భాగమున అఖండ గౌతమీ గోదావరి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఆత్రేయ గోదావరిలో కలియుచున్నది.

త్రేతాయుగమున ఈ ప్రదేశమంతయూ మహారణ్యము కావున ఇందు సీతారామలక్ష్మణులు పితృవాక్య పరిపాలనకై ఈ మహారణ్యమునందు నివశించుచూ లోక సంరక్షరార్థము త్రిపుర సుందరి శంకరులను ప్రతిష్ఠించి పూజించెడివారు. ఆనాటి నుండి ఇచ్చటి తపోనిధులు భక్తులు కూడా ఆత్రేయ గోదావరిలో స్నానము చేసి స్వామిని పూజించి ఆరాధించెడివారు. వారిలో భవానీ అను మహాభక్తురాలు వృద్ధురాలు స్వామిని నిత్యమూ పూజిస్తూ స్మరిస్తూ ఉండెడిది.Uppumilli

ఈమె కొద్దికాలమునకు వృద్ధాప్యములో మరణావస్థలో ఉండి లేవలేనిదై త్రిపురసుందరి శంకరులను నిత్యమూ స్మరిస్తూ ఉండగా త్రిపురసుందరి ఈ ప్రదేశమందు నివశించు భక్తుల యొక్క యోగక్షేమములు తెలుసుకొనుటకై బాలిక రూపములో తిరుగుచూ వారి కష్టములను కాపాడుచూ ఉండెడిది. ఇట్టి సమయమున భక్తురాలైన భవానీ ఇంటికి బాలికరూపంలో వచ్చి ఆమె భక్తిని గ్రహించినదై నీకు ఏమి కావలయును అని అడుగగా ఈమె సాక్షాత్తూ భగవత్ స్వరూపిణి కావచ్చునని భవానీ గ్రహించినదై త్రిపురసుందరీ శంకరులను చూచునటుల వరం ప్రసాదించమని వేడుకొనగా అంతట త్రిపురసుందరి శంకరులు ప్రత్యక్షమయ్యెను. అంతట భవానీ సంతోషసంముగ్దురాలై పరవశించిపోయి మీరు ఇరువురూ కూడా నాయందే ఉండి నా మరణానంతరము నా పేరు మీ నామములో ఒకటిగా సార్థకము చేసి నాకు ముక్తి నొసగుమని వేడుకొనెను.

అందులకు స్వామి ఆనందముగా భక్తురాలికి ఇచ్చిన మాట ప్రకారము ఈ ప్రదేశమునందే నివశిస్తూ శంకరుడు భవానీ శంకరునిగాను త్రిపురసుందరి బాలిక రూపములో తిరుగుచూ భక్తులను ఆదుకొనుటచే బాలా త్రిపురసుందరిగాను పిలువబడుచుండెను. భక్తురాలికి ఇచ్చిన మాట ప్రకారము స్వామి వదిలి వచ్చిన స్థలమును ఇంకనూ గుడి దిబ్బగా పిలువబడుచున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. ఇదే ఆలయములో లక్ష్మీ నారాయణులు కూడా ప్రతిష్టింపబడి శివకేశవులకు అభేదము గోచరించుచున్నది. ఈ క్షేత్ర స్థిత లింగమూర్తి స్వయంభువుగా ప్రసిద్ధి. ఈ గ్రామంలో ఇంకనూ సుబ్రహ్మణ్యస్వామి ఆలయము, భక్తాంజనేయస్వామి గణపతి ఆలయములు కలవు.