ఈ క్షేత్రము చేరుటకు రాజమండ్రి నుండి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారి బస్సు సౌకర్యం కలదు. అలాగే మండపేట నుండి కూడా ఈ క్షేత్రము చేరుటకు ఆరు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు. చేరుట సులభము. ఈ క్షేత్రము విశాఖ నక్షత్రం మొదటి పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శివస్వరూపాన్ని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన శుభ ఫలితములు పొందగలరని భక్తుల నమ్మకం.
శ్లో. వాతాపి దైత్యదమన దోషశాంతి చికీర్షయా
బాలాత్రిపురయా శంభు: అగస్త్యేన ప్రతిష్టితః !!
శ్లో. శ్రీ దుర్వాసపురే రమ్యే సర్వసంపత్సమన్వితే
అగస్త్యేశ్వర నామ్నాసౌ లోకాన వతిసర్వదా !!
దుళ్ళ గ్రామము యొక్క పూర్వ నామము దుర్వాసపురమని తెలుస్తోంది. ఈ ఆలయము అగస్త్యమహర్షి వాతాపి అను బ్రహ్మరాక్షసుని సంహరించిన పాప పరిహారార్థం ప్రతిష్టించబడినట్లు తెలియుచున్నది. అందువల్ల ఈ ఆలయ స్థిత శివమూర్తికి అగస్త్యేశ్వర నామకరణం కలిగింది. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన అనేక శివక్షేత్రముల మాదిరిగా ఈ క్షేత్రము కూడా విశేషమైన ప్రసిద్ధి కలిగి వున్నది. 2012లో గ్రామస్థుల, భక్తుల సహకారంతో పునర్నిర్మించబడి పునఃప్రతిష్ఠ చేయబడ్డ ఈ ఆలయం అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. ఆలయ ముఖద్వారం చెంత భవ్యనటరాజు విగ్రహం భక్తులను ఆహ్వానిస్తుంది. ఇంకా ముఖమంటపంపై వివిధ దేవతామూర్తులు శిల్పీకరించబడ్డారు. ఆలయంలో బాలాత్రిపురసుందరి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, దత్తాత్రేయుడు, నాగబంధము, చండీశ్వరుడు ఉపాలయాలలో గలరు. నవగ్రహమంటపము కూడా వున్నది. గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత మదనగోపాలస్వామి, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాలు కలవు.
స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘబహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి కూడా ఇక్కడ వైభవోపేతంగా జరుగుతాయి. ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజున గ్రామస్థుల సహకారంతో శాంతి కల్యాణం నిర్వహించబడుతుంది. స్వామివారి కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలు స్వీకరించినవారికి, వివాహము కానివారికి వివాహము, నిస్సంతులకు సంతాన ప్రాప్తి, నష్టద్రవ్యలాభము, గ్రహదోషశాంతి, ఉద్యోగలాభము వంటివి చేకూరగలవని విశ్వాసము. స్వామివారి శాంతి కళ్యాణం జరిపించుకోదలచిన భక్తులు ఆలయ అర్చకులను సంప్రదించవచ్చును. ఆలయము నందలి అన్ని కార్యక్రమములు శైవాగమ సిద్ధాంతపరంగా నిర్వర్తించబడతాయి.