info@bheemasabha.com

శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి – ఓదూరు

పుష్యమి నక్షత్రం – చతుర్థ చరణంoduru

ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిపై వున్నది. అంతేకాక ఆలయము కూడా రహదారికి చేర్చ ఉండుట వలన ఆలయమును చేరుట అతి సులభము. ఈ క్షేత్రము కర్కాటకరాశి యందలి పుష్యమి నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామిని దర్శించి అర్చన, అభిషేకములు నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు లభించునని భక్తజనుల విశ్వాసము. ఈ ఆలయమునందు ప్రస్తుత శివాలయంతో పాటు శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయము మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి ఆలయము ఇదే ప్రాంగణంలో కలవు.

ముగ్గురు దేవతామూర్తుల యొక్క దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ బహుళ ఏకాదశి రోజున పాంచాహ్నికంగా నిర్వహించడం ఈ ఆలయంలో విశేషం. అత్యంత అరుదైన మరొక విశేషం ఏమనగా సోమేశ్వరస్వామి ఆలయంలో “అఖండజ్యోతి” నిరంతరం వెలుగుతుంది. ఈ క్షేత్రంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఆలయానికి చేర్చి షిరిడీసాయినాథుని మందిరం కలదు. గ్రామంలో ఇవికాక సీతారామచంద్రస్వామి ఆలయం మరియు ఆంజనేయస్వామివారి ఆలయము కూడా వున్నాయి.