ఈ క్షేత్రము సందర్శించుటకు ఉభయ గోదావరి జిల్లాల నుండి విస్తృతమైన రవాణా సౌకర్యము గలదు. ఈ క్షేత్రము స్వాతి నక్షత్రం రెండవ పాదానికి చెందినది. ఈ జాతకులకు ఈ క్షేత్ర స్థిత అగస్త్యేశ్వర కైలాసేశ్వరస్వామిని దర్శించుకుని అర్చన, అభిషేకాదులు నిర్వహించిన యెడల విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ గ్రామమునకు పూర్వనామము మాండవీపురము. పూర్వము ఈ గ్రామము నేడు వున్నచోట కాక ప్రస్తుతం బైపాస్ రోడ్డు వున్న ప్రాంతమునకు సమీపమున ఉండేదిదట.
అగస్త్యమహర్షి ప్రతిష్టించిన శివలింగము ఉత్తరోత్తరా భూగర్భమునందుండి త్రవ్వకాలలో బయట పడినట్లు చెపుతారు. సుమారు మూడు శతాబ్దములకు పూర్వము పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయమును నిర్మించినారు. ఈ ఆలయమున మహారాజుగారి ద్వారా కైలాసేశ్వర నామముతో వేరొక శివలింగ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఈ ఆలయమున కొలువైయున్న క్షేత్రపాలకులు శ్రీ జనార్థనస్వామివారు నవ జనార్ధన క్షేత్రములలో ఒకరు.