info@bheemasabha.com

శ్రీ బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠ త్రిపురాంతకస్వామి – శివల

ఉత్తరాభాద్ర నక్షత్రం – చతుర్థ చరణంsivala

ఈ క్షేత్రము దంగేరు గ్రామమునకు అతి సమీపమున కలదు. ఈ క్షేత్రము చేరుటకు యానాం-ద్రాక్షారామ మార్గంలో బాలాంతరం వైపుకు మళ్ళి గుడిగళ్ళభాగ మీదుగా వెళ్ళవచ్చును. కె.గంగవరం నుండి కూడా దంగేరు మీదుగా చేరవచ్చును. ఉత్తరాభాద్ర నక్షత్రము నాలుగవ పాదమునకు చెందిన ఈ క్షేత్ర స్థిత శివదర్శనము, అర్చనాభిషేకములు ఈ జాతకులకు శుభ ఫలితములివ్వగలవని మరియు వారనుభవిస్తున్న సమస్త గ్రహపీడలు తొలుగునని భక్తుల విశ్వాసము.

అతి పురాతనమైన ఈ క్షేత్ర పూర్వాలయము 1916వ సంవత్సరములో నిర్మితమైనట్లు తెలుస్తున్నది. అలాగే ఈ ఆలయము జీర్ణావస్థకు చేరుకున్నదని దేవాదాయశాఖ మరియు భక్తుల సహకారంతో 1989వ సంవత్సరంలో పునర్నిర్మాణము జరిగి ప్రారంభిచబడినది. ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ 1991లో జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చండీశ్వరుల ఉపాలయములతో పాటు నవగ్రహ మంటపము కూడా కలదు. ఈ ఆలయమునకు చేర్చి షిరిడీసాయినాథుని మందిరము నిర్మాణములో ఉన్నది. ఈ గ్రామంలో మరొక ఆలయము శ్రీ వెంకటేశ్వరస్వామివారిది.

స్వామివారి దివ్య కళ్యాణమహోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. దీనితో పాటు ఈ ఆలయములో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కళ్యాణము మరియు షష్ఠి ఉత్సవములు పాంచాహ్నికంగా జరగడం విశేషం. ఇవికాక గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు వైభవోపేతంగా నిర్వహించబడతాయి. మరొక ముఖ్య విశేషం కనుమ రోజున ప్రభల ఉత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది.