ఈ క్షేత్త్రము దంగేరు గ్రామమునకు మరియు శివాల గ్రామమునకు సమీపమున గలదు. బస్సు ద్వారా కంటే ప్రైవేటు వానములద్వారా (ఆటో) గాని, సొంత వాహనముపై క్షేత్రము చేరుట సులభము. ఈ క్షేత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము రెండవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత బాలాత్రిపురసుందరి సమేత నీలకంఠేశ్వరస్వామి వారికి అర్చనాభిషేకములు నిర్వహించిన శుభఫలితములు చేకూరగలవు.
అతి పురాతన ఆలయాలలో ఒకటైన ఈ ఆలయము మొదట 1811వ సంవత్సరములో నిర్మితమైనట్లు ఇక్కడి శిలాఫలకము ద్వారా తెలిసింది. తదుపరి 1998వ సంవత్సరంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ నవగ్రహ మంటప నిర్మాణము జరిగినది. ప్రస్తుతం ఆలయం (2011)లో గ్రామస్థుల సహకారము మరియు దేవస్థాన నిధులతో పునర్నిర్మించబడ్డది. ఈ ఆలయమునకు చేర్చి రామాలయము కలదు. నాగేంద్రస్వామివారి ఆలయము ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నది.
ఈ ఆలయమున ఏడు గణపతి, కుమారస్వామి, చండీశ్వరుడు, నవగ్రహముల ఉపాలయములు గలవు.
వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా స్వామివారి దివ్య కళ్యాణోత్సవములు జరుగును. ఇవి కాక శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి ఇక్కడ వైభవోపేతముగా జరుగును.