ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిపై ఉండుట వలన ఈ క్షేత్రమును చేరుట అతి సులభము. అంతేకాక ఆలయము కూడా బస్సు స్టాపునకు అతి సమీపములో వుండడం చేత సులభముగా వెళ్ళవచ్చును. ఈ ఆలయము పుష్యమి నక్షత్రం మూడవ పాదమునకు చెందినది కావడం వలన ఈ ఆలయ స్థిత భావానీశంకరస్వామిని దర్శించి అర్చన, అభిషేకములు నిర్వర్తించిన యెడల ఈ నక్షత్రంవారు వారి గ్రహపీడలు తొలగి శుభ ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.
శతాబ్ధముల చరిత్రగల ఈ ఆలయము సుమారు 300వందల సంవత్సరముల క్రితం నాటి పిఠాపురం మహ్హారాజావారు మరియు గ్రామస్థుల సహకారంతో గ్రామమందు ధనధాన్య సమృద్ధికై ఆలయ పునరుద్ధరణ జరిగినది. ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువై ఉన్నారు. అంతేకాక నాగబంధము కూడా ప్రతిష్టించబడినది. గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయము, గణపతి ఆలయము మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయములు కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. మరియు శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి అత్యంత వైభవోపేతంగా జరుగును.