info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి – వెదురుపాక

పుబ్బ నక్షత్రం – ద్వితీయ చరణం

ఈ గ్రామంలో దేశ వ్యాప్త ప్రఖ్యాతి చెందిన విజయదుర్గాపీఠం ఉండటం చేత విస్తృత రవాణా సౌకర్యం గలదు. రాజమండ్రి నుండి రోడ్డు రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యం కలదు. ఈ క్షేత్రము చేరుట సులభము. పుబ్బ నక్షత్రం రెండవ పాదమునకు చెందిన ఈ క్షేత్రములో అర్చనాభిషేకములు నిర్వర్తించిన ఈ జాతకులకు శుభ ఫలితములు చేకూరగలవని భక్తుల విశ్వాసము. అత్యంత పురాతన శైవక్షేత్రాలలో ఒకటైన ఈ క్షేత్రము సుమారు 1800 సంవత్సరాల పూర్వమునుండి విలసిల్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఆలయానికి ముందువున్న ఆలయం సుమారు 500 ఏళ్ళు వున్నట్లు తెలుస్తోంది. 2004వ సంవత్సరం జనవరి 26వ తేదీన గ్రామస్థుల సహకారంతో ఆలయం పునర్నిర్మింపబడి స్వామివారి పునఃప్రతిష్ఠ జరిగినది. ఈ ఆలయ ముఖద్వారంపై ఓంకారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఆలయమందు చండీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు కొలువైయున్నారు.

ఇంకా ఈ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి మరియు శ్రీ రామా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయములు కలవు. అన్నవరంలో మాదిరిగా ఏకపీఠంపై శివలింగము, సత్యనారాయణమూర్తి, అమ్మవారు కొలువై వుండడం సత్యనారాయణస్వామివారి ఆలయంలో విశేషం. ఈ ఆలయమందు స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా వైభవోపేతంగా నిర్వహించబడతాయి. సుబ్రహ్మణ్యషష్ఠి రోజు నుండి మూడు రోజుల పాటు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం జరుగుతుంది.