ఈ క్షేత్రము కె.గంగవరం గ్రామానికి అతి సమీపానగలదు. కాకినాడ నుండి పామర్రు, కోరుమిల్లి వెళ్ళు బస్సులు ఈ క్షేత్రము మీదుగా పోవును. కె. గంగవరం నుండి ప్రైవేటు వాహన సదుపాయం కలదు. అందువలన ఈ క్షేత్రము చేరుట సులభము. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదానికి చెందినది. ఈ జాతకులు సత్యవాడ యందు కొలువైయున్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయనిర్మాణ శైలి మరియు ధ్వజ స్తంభము ఈ ఆలయం యొక్క పురాతనత్వమును గూర్చి తెలుపును. ముఖ మంటపము 1948 ప్రాంతంలో నిర్మించబడినట్లుగా తెలియుచున్నది. ముఖమంటపముపై దేవతామూర్తుల విగ్రహములు నిర్మించబడ్డవి. ఈ గ్రామమును రెండవ భద్రాచలంగా పిలుస్తారు. దానికి కారణం ఈ గ్రామంలో సుమారు ఆరు రామాలయములు గలవు. శివాలయ ప్రాంగణంలోని అంతరాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైయున్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు వైభవోపేతంగా నిర్వహించబడతాయి.