ఈ క్షేత్రము చేరుటకు రామచంద్రాపురం నుండి బస్సు సౌకర్యంకలదు. గంగవరం మీదుగా కూడా ఈ క్షేత్రమును చేరవచ్చును. పూర్వాషాఢ నక్షత్రం మూడవ పాదమునకు చెందిన క్షేత్రము అగుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చన శుభదాయకం అని భక్తుల విశ్వాసము.
పురాతన చరిత్ర గల ఈ క్షేత్రము 1940 ప్రాంతంలో పునరుద్ధరణ మరియు అర్చామూర్తుల పునఃప్రతిష్ఠ జరిగింది. 2003వ సంవత్సరంలో ముఖమంటప నిర్మాణం జరిగింది. ఈ ఆలయానికి చేర్చి ఇదే ప్రాంగణంలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కలదు. అంతరాలయంలో గణపతి కొలువైయున్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహించబడతాయి.