ఈ క్షేత్రము కె. గంగవరం, పామర్రు రహదారిపై కలదు. పామర్రు, కోరుమిల్లి మార్గాన వెళ్ళు రవాణా సంస్థవారి బస్సు ద్వారా ఈ క్షేత్రమును చేరవచ్చును. ప్రైవేటు వాహనం ద్వారా చేరుట సులభము. ఈ క్షేత్రము మూల నక్షత్రం మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులు అముజూరు ఆలయమున ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించి అభిషేకార్చనలు నిర్వర్తించిన యెడల వారి గ్రహదోషాలు తొలగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము.
సుమారు రెండు శతాబ్దము పైబడి విలసిల్లిన ఈ ఆలయం 1986వ సంవత్సరంలో పునరుద్ధరింపబడినట్లు తెలుస్తున్నది. గణపతి అంతరాలయంలో కొలువైయున్నాడు. ఈ క్షేత్రంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయం కూడా కలదు. ఈ ఆలయానికి చేర్చి శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారి ఆలయం నిర్మాణంలో వున్నది. ఈ ఆలయంలో శిలా శ్రీచక్రం మరియు దుర్గాదేవి ప్రతిష్టింపబడనున్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘ శుద్ధ ఏకాదశి నుండి శైవాగమపరంగా పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ధనుర్మాస ఉత్సవములు కూడా ఇక్కడ వైభవోపేతంగా నిర్వహింపబడతాయి.