info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి – నర్సిపూడి

విశాఖ నక్షత్రం – ద్వితీయ చరణంNarsipudi-(2)

ఈ క్షేత్రము దుళ్ళ గ్రామమునకు అతి సమీపమున కలదు. దుళ్ళ మీదుగా గానీ ఆలమూరు సమీపంలోని కొత్తూరు సెంటర్ నుండి గానీ చేరవచ్చును. ఈ క్షేత్రము విశాఖ నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శివస్వరూపాన్ని దర్శించి అర్చనాభిషేకములు నిర్వర్తించిన శుభ ఫలితములు పొందగలరని భక్తుల నమ్మకం.

ఈ క్షేత్రము బహు పురాతన క్షేత్రములలో ఒకటి. మూడువందల సంవత్సరముల పైబడి ఉన్న ఈ ఆలయము ఇటీవల 2009వ సంవత్సరంలో గ్రామస్థులు మరియు దేవాదాయశాఖవారి సహకారంతో పునర్నిర్మాణం జరిగింది. అద్భుతంగా పునర్నిర్మించబడ్డ ఈ ఆలయంలో ప్రవేశించగానే పెద్ద పంచముఖ ఆంజనేయస్వామివారి విగ్రహం భక్తులను అబ్బురపరుస్తుంది. ఈ ఆలయంలో గణపతి, చండీశ్వరుడు ఉపాలయాలలోను, ఈ ఆలయం ప్రక్కనే ఇదే ప్రాంగణంలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వున్నాయి.Narsipudi

ఈ ఆలయం యొక్క విశిష్టతలలో ఒకటి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పూజాధికాలు నిర్వహించారు. తదుపరి ప్రస్తుత ఆచార్యులు కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించి పూజాధికాలు నిర్వహించారు. ఈ గ్రామము నందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము కూడా కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి.శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి, హనుమత్ జయంతి ఇత్యాదులు వైభవోపేతంగా జరుగుతాయి.