info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి – సోమేశ్వరం

హస్త నక్షత్రం – ప్రథమచరణం

ఈ క్షేత్రము కాకినాడ – రావులపాలెం ప్రధాన రహదారిపై పసలపూడి దాటిన పిదప వున్నది. విశేష రవాణా సౌకర్యం కలదు. చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటైన ఈ ఆలయమునకు వేయి సంవత్సరములపైన చరిత్ర కలదు. అన్ని అష్టసోమేశ్వర క్షేత్రముల కన్న ఈ క్షేత్రము అందలి ఆలయము అతి విశాల ప్రాకారమునందు అద్భుతంగా నిర్మించబడ్డది.

ఆలయమును చూడగానే ఆలయము యొక్క పురాతనత్వము తెలియనగును. ఆలయము ఎదురుగా ఉన్న తటాకమునందు నూతనంగా నిర్మించబడ్డ్డ పరమశివుని భారీ విగ్రహము ఈ క్షేత్రమునకు మరింత శోభ తెచ్చినది. ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రమే కాక హస్తా నక్షత్రం మొదటి పాదమునకు చెందిన క్షేత్రం కావడం విశేషం. ఈ జాతకులు ఈ ఆలయాన కొలువైయున్న శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరుని దర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఎడల విశేష ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.

ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, ఆంజనేయస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పర్వతవర్థినీ సమేత బ్రహ్మేశ్వరస్వామి, కాలభైరవుడు, చండీశ్వరుడు, సూర్యనారాయణమూర్తి మరియు డుండి గణపతి ఉపాలయాలలో కొలువైయున్నారు. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాంగణం ప్రశాంతముగా మరియు ధ్యానమునకు అత్యంత అనుకూలంగా ఉండడం విశేషం. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. కళ్యాణోత్సవ సమయంలో రథోత్సవం కూడా జరుగుతుంది. శరన్నవరాత్రి, వైకుంఠ ఏకాదశి వారోత్సవాలు, మాసోత్సవాలు, సుబ్రహ్మణ్యషష్ఠి మరియు కల్యాణం, గణపతి నవరాత్రులు, హనుమజయంతి ఘనంగా నిర్వహించబడతాయి.