info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి – పందలపాక

ఉత్తర నక్షత్రం – ప్రథమ చరణంPandalapaka

ఈ క్షేత్రము చేరుటకు రాజమండ్రి నుండి కాకినాడ నుండి బస్సు సౌకర్యం కలదు. గొల్లలమామిడాడ గ్రామమునకు సమీపమున ఈ క్షేత్రము విలసిల్లియున్నది. గొల్లలమామిడాడ, బిక్కవోలు తదితర ప్రాంతములనుండి ప్రయివేటు వాహన సౌకర్యం వుంటుంది. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ఉత్తర నక్షత్రం మొదటి పాదమునకు చెందినది.

ఈ జాతకులు పందలపాక గ్రామంలో కొలువైయున్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామివారిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన శుభఫలితములు లభించగలవని భక్తుల విశ్వాసము. ఈ ఆలయము అతి పురాతన ఆలయాలలో ఒకటి మూడువందల సంవత్సరములపైన చరిత్ర కలిగిన ఈ బృహదాలయము 1934వ సంవత్సరంలో పునఃప్రతిష్టించబడ్డది. ధ్వజస్తంభం 1956వ సంవత్సరంలో పునఃప్రతిష్టించబడ్డది.

ఒకే ప్రాంగణంలో ప్రస్తుత ఆలయము, శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామివారి ఆలయము, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయము ప్రక్కప్రక్కనే వుండడం విశేషం. విశాలమైన ఈ ఆలయ ముఖమంటపంలో అనేక దేవతామూర్తుల విగ్రహములు శిల్పీకరించబడినవి. ముఖ్యంగా శివసంబంధమైన పౌరాణిక ఘట్టములు దశావతారములు ఇత్యాదులు భక్త సందర్శకులను కట్టిపడేస్తాయి. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అలాగే శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా నిర్వహించబడతాయి. సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణోత్సవము పాంచాహ్నికంగా జరపడం ఇక్కడ విశేషం. ఈ ఆలయంలో నవగ్రహ మంటపము, చండీశ్వరాలయము కలవు.