info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి – టేకి

జ్యేష్ఠ నక్షత్రం – చతుర్థ చరణంteki-(2)

ఈ క్షేత్రము చేరుటకు ద్రాక్షారామం నుండి, కోటిపల్లి నుండి, మండపేట నుండి కూడా రవాణా సౌకర్యం కలదు. రోడ్డు రవాణా సంస్థల ద్వారా గానీ ప్రైవేటు వాహనముల ద్వారా గానీ ఈ గ్రామమును సులభముగా చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో జ్యేష్ఠ నక్షత్రము నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు టేకి గ్రామంలో కోలువైయున్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించి అర్చనాదులు చేసిన యెడల తత్సంబంధ గ్రహపీడలు తొలగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము.

అతి పురాతనమైన శైవ క్షేత్రములలో ఒకటయిన ఈ క్షేత్రమునకు ఘన చరిత్ర గలదు. కణ్వమహర్షి ఈ గ్రామపు సమీపంలో ఉన్న నది వద్ద తపమాచరించినట్లు కథనం. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నట్లుగా ఇచ్చటి అర్చకస్వామి తెలియజేశారు. అంతేకాక కణ్వమహర్షి పేరుపైన ఈ గ్రామం గుండా ప్రవహించు నదికి కూడా కణ్వనది అని పేరు వచ్చినట్లు తెలుస్తుంది.

teki
ఇంతకుముందు ఉన్న ఆలయము రెండు శతాబ్దాల క్రితం నిర్మితమై శిథిలావస్థకు చేరుకున్న కారణం చేత కొన్ని సంవత్సరాల క్రితం గ్రామస్థుల సహకారంతో పునరుద్ధరణ జరిగినట్లు తెలుస్తుంది. ఆలయ ధ్వజ స్తంభం కూడా భక్తుల సహకారంతో 2006వ సంవత్సరంలో పునరుద్ధరించబడింది.

ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, అయ్యప్ప, గాయత్రీదేవి, దత్తాత్రేయులు, ఆంజనేయస్వామి ఉపాలయాలు కొలువై వున్నాయి. నవగ్రహ మంటపము కూడా కలదు. ఈ గ్రామంలో లక్ష్మీనృసింహస్వామి ఆలయము మరియు వెంకటేశ్వరస్వామి ఆలయము కూడా ప్రముఖమైనవి. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అంతేగాక శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి.