info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లిఖార్జునస్వామి – మసకపల్లి

ధనిష్ఠ నక్షత్రం – తృతీయ చరణంMasakapalli

ఈ క్షేత్రము చేరుటకు యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని కోలంక గ్రామము నుండి వెళ్ళవచ్చును. ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమంగా చెబుతారు. ఇచట ఆత్రేయి, భారద్వజ, గౌతమి నదులు సంగమిస్తాయి. ఇచట కొలువైయున్న శివస్వరూపం నక్షత్ర శివాలయాలలోని ధనిష్ఠ నక్షత్రం మూడవ పాదానికి సంబంధించినది. ఈ జాతకులు మసకపల్లి యందు కొలువైయున్న శివలింగ సందర్శనము మరియు అర్చనాదులచే వారి గ్రహపీడలు తొలగి సంతోషము, శాంతి పొందెదరని ప్రగాఢ విశ్వాసాన్ని భక్తులు ప్రకటిస్తారు.

ఈ గ్రామానికి సంబంధించి విశేషమయిన కథనమున్నది. పూర్వము మసకపల్లి గ్రామాన్ని మస్కరపురి అనే నామంతో వ్యవహరించేవారు, మస్కరులు అనగా మునీశ్వరులు, మునులు తపస్సుచేసిన ప్రాంతం కావడాన దీనికి ఆనామం వచ్చినట్లు కథనం. ఇక ఈ క్షేత్రము యానాం – కోటిపల్లిలకు సమాన దూరంలో వుండడం మరియొక విశేషం. ఈ గ్రామం శివాలయంతో సహా రెండుసార్లు గోదావరిలో మునిగిపోయినది. మూడవ పర్యాయం సుమారు డెభై, ఎనభై ఏళ్ళ క్రితం స్వామి యొక్క పునఃప్రతిష్ఠ ప్రస్తుత ఆలయంలో జరిగినట్లు తెలుస్తుంది.

ఈ శివస్వరూపాన్ని గూర్చి కూడా ఆసక్తికర కథనం అర్చకస్వామి ద్వారా తెలిసినది. ఈ లింగము పార్థప్రహార శివలింగంగా చెబుతారు. పూర్వము కిరాతార్జునీయ ఘట్టంలో పార్థునకు పరమశివునకు యుద్ధం జరిగిన సందర్భంలో పార్థుడు తన అస్త్రములు పనికిరానప్పుడు గాండీవముచే స్వామి శిరముపై మోదినట్లు కథ అందరూ ఎరిగినదే. ఆ సమయంలో స్వామి శిరస్సుపై పడిన గాయం తాలూకు రక్తపు మరక ఈ శివలింగంపై ఎరుపు రంగులో దర్శనమిస్తుంది. అని స్థలపురాణం.

ఈ ఆలయమందు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, భ్రమరాంబదేవీ, సాయిబాబా మరియు నవగ్రహ మంటపము ఉపాలయాలుగా కలవు. వైశాఖ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జరుగుతుంది. అంతేగాక ఇక్కడ శరన్నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి పర్వములను విశేషంగా నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ఈ ఆలయంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామివారి ఆలయం కూడా ప్రముఖమైనది.