info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి – గొర్రిపూడి (భీమలింగపాడు)

పునర్వసు నక్షత్రం – ప్రథమ చరణంGorripudi

ఈ క్షేత్రం గొర్రిపూడి గ్రామ శివారు భీమలింగపాడు నందు కలదు. అయితే భీమలింగపాడు అనునామం నేడు వ్యవహారంలో లేకపోవుట వలన ఆ పేరు అనేకులకు తెలియదు. అయితే పాటిమీదగుడి అంటే దారి చెపుతారు. గొర్రిపూడి గ్రామం కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిపై గలదు. ఇక ప్రస్తుత క్షేత్రం గ్రామ కంఠానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య ఒక దిబ్బపైన వున్నది. ప్రస్తుతం అచట వున్న ఆలయం కేవలం ముప్పై నుండి నలభై సంవత్సరాల క్రితం నిర్మితమయినట్లు తెలియుచున్నది, ఈ ఆలయంలో శివలింగాకృతిలో నిర్మితమయిన శిల్పం మధ్యలో గూడు మాదిరిగా నిర్మించి అందు శివపార్వతుల విగ్రహం యేర్పాటు చేసినారు. అనేక శతాబ్దాల పూర్వం ఇచట ఒక అద్భుతమయిన శివాలయం ఉండేదట. అంతేకాక చక్కని ఒక గ్రామం విలసిల్లి అందు సుమారు నూరు గడపలపైన దేవదాసి కుటుంబాలు ఉండేవట.

దురదృష్టవశాత్తు కొన్ని ఉత్పాతాల వల్ల ఆ ఆలయము గ్రామము కూడా కాలగర్భంలో కలిసిపోయినట్లుగా తెలుస్తున్నది,. నేటికి ఆ శివలింగం భూగర్భంలో ఉండి ఉంటుందని స్థానికుల భావన. అయితే క్షేత్ర విశిష్టత రీత్యా భీమమండలంలోని నక్షత్ర శివాలయం కావడాన కొందరు పుణ్యాత్ములు, ఆధ్యాత్మికపరులు పూనుకుని ప్రస్తుతం వున్న ఆలయం నిర్మించినట్లు తెలియుచున్నది. కార్తీకమాసం, శివరాత్రి ఇత్యాది పర్వదినాలలో తప్ప మిగిలిన సందర్భములలో పెద్దగా భక్తుల తాకిడి వుండదు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా అర్చకులు లేరు.