శీల గ్రామం చేరుటకు ద్రాక్షారామం నుండి రోడ్డు రవాణా సంస్థవారి బస్సులు గలవు. అంతేకాక గొల్లపాలెం నుండి కుయ్యేరు వెళ్ళు మార్గంలో కాజులూరు చేరుటకు మార్గం కలదు. ప్రయివేటు వాహనముల (ఆటో లేదా కారు) ద్వారా వెళ్ళు వారు ఈ మార్గాన్ని అనుసరించవచ్చును.
ఇక ఈ క్షేత్రమున కోలువైయున్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి రోహిణి నక్షత్రం – నాలుగవపాదాన జన్మించిన వ్యక్తులకు యోగకారకుడు. ఈ క్షేత్ర దర్శనము, ఆర్చనాభిషేకాదులు పై జాతకులకు విశేష ఫలితములు కలుగజేస్తాయని భక్తుల విశ్వాసం.
శ్రీ రామార్చితపాదపద్మయుగళంశ్రీకంఠమైశ్వర్యదం !
సౌరీంద్రాదిసమస్తదేవావినుతంశౌర్యేణసుశోభితం !
గౌరీనాధమనంతవైభవయుతంగౌరీసమారాధితం !
దీరం శూలధరంమమార్తిహరణంశ్రీరామలింగంభజే !!
పై శ్లోకం మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావుగారు శ్రీరామలింగేశ్వరస్వామివారిని గూర్చి వ్రాసినది. ఈ క్షేత్రమున కొలువైయున్న శ్రీరామలింగేశ్వరులు త్రేతాయుగమునందు శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్టించబడ్డ సైకతలింగంగా చెపుతారు. రావణబ్రహ్మ వధానంతరం బ్రహ్మహత్యాదోష నివారణార్థం వశిష్టుల సూచన ప్రకారం ప్రతిష్టించిన అనేక శివలింగములలో ఈ గ్రామంలోని శివలింగం కూడా ఒకటియని కథనం. అంతేకాక వేదవ్యాస మహర్షి కాశీపురమును విడిచి దక్షారామమును చేరు క్రమంలో అగస్త్యమహర్షిని కలిసి శిష్యులతో కూడి ఈ గ్రామాన కొలువైయున్న పార్వతీ సమేత రామలింగేశ్వరుని సేవించినట్లుగా చారిత్రిక కథనం. అట్టి మహోత్కృష్టమైన ఈ దివ్యక్షేత్రం కేవలం పైన తెలుపబడ్డ జాతకులకు మాత్రమేకాక అందరికీ కూడా సర్వశుభకరము, పాపహరము.
ఈ గ్రామంలో ఈ క్షేత్రంతో పాటుగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి ఆలయం కలదు. రామలింగేశ్వరాలయంలో గణపతి, పార్వతీదేవి ఉపాలయములు కలవు. రామలింగేశ్వరస్వామివారి దివ్య కల్యాణం మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇది మాత్రమేగాక గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రుల అనంతరం భక్తుల సహకారంతో విశేషంగా అన్నసమారాధన జరుగుతుంది. ప్రముఖ సంస్కృతపండితులు బ్రహ్మశ్రీ పులవర్తి నూకాలరావుగారు తమ శివ చాలీసా గ్రంథంలో శీల గ్రామంలో వెలసియున్న శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరులను స్తుతిస్తూ రామలింగేశ్వరాష్టకమ్ రచించారు.