ఈ క్షేత్రము అనపర్తి గ్రామానికి సమీపమున కలదు. అనపర్తి నుండి ఆటో లేదా స్వంత వాహనంపై క్షేత్రమునకు చేరవచ్చును. ఈ క్షేత్రము చిత్త నక్షత్రం మొదటి పాదానికి చెందినది. ఈ జాతకులకు ఈ క్షేత్ర స్థిత స్వామిని దర్శించుకుని అర్చన, అభిషేకాదులు నిర్వహించిన యెడల విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ ఆలయము, నంది, శివలింగము 1972వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేయబడినట్లు తెలుస్తున్నది.
తదుపరి 2010వ సంవత్సరంలో గ్రామస్థులు మరియు భక్తుల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం మరియు పునఃప్రతిష్ఠ జరిగాయి. ఆలయ శిఖరంపైన మరియు ముఖమంటపం పైన చక్కని కళా కౌశలంతో వివిధ దేవతామూర్తుల ఆకృతులు నిర్మించబడ్డాయి. అంతేకాక ముఖమంటపం లోపలి పైకప్పుపై ద్వాదశరాశుల చిత్రాలు మరియు ఆలయ ప్రాకారంపై వివిధ దేవతామూర్తుల చిత్రాలు వర్ణభరితంగా చిత్రీకరించబడ్డాయి.
ఆగ్నేయంలో నాగబంధము, గణపతి మరియు అయ్యప్పస్వామి విగ్రహాలు అందరూ అర్చించుకొనడానికి వీలుగా ప్రతిష్టించబడ్డాయి. అంతరాలయంలో శ్రీ మహాగణపతి కొలువై వున్నారు. గ్రామంలో అలమేలుమంగ పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కలదు. స్వామివారి కళ్యాణోత్సవం శైవాగమన ప్రకారం వైశాఖ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వహించబడతాయి.