ఈ క్షేత్రము మండపేట నుండి రామచంద్రాపురం రహదారిలో పెడపర్తి అను బస్సుస్టాపునకు సమీపంలో వున్నది. మరియు సోమేశ్వరంలోని సోమేశ్వర క్షేత్రమునకు ఎదురుగా వున్న తటాకము ప్రక్కనుండి మార్గము కలదు. సులభముగా చేరవచ్చును. హస్తా నక్షత్రం రెండవ పాదమునకు చెందినవారు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసం. అతి పురాతనమైన ఈ క్షేత్రమునందలి ఆలయము యొక్క పునర్నిర్మాణము దేవాదాయశాఖ మరియు గ్రామస్థుల సహకారంతో కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతిస్వామివారి ఆధ్వర్యంలో 2009వ సంవత్సరంలో జరిగింది. ఆలయమునకు ఎదురుగా ఆంజనేయస్వామివారి ఆలయం కలదు.
శివాలయానికి చేర్చి కనకదుర్గ మరియు గణపతి ఆలయములు ఆలయ ప్రాకారంలోపల చండీశ్వరాలయము కలవు, ఈ ఆలయ గోపురము, ముఖమంటపము శిఖరములపై వివిధ దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడ్డాయి. అంతేకాక ఆలయ వాయువ్య భాగంలో యాగశాల కలదు. ముఖమంటపమునందు శ్రీ దక్షిణామూర్తి, అర్థనారీశ్వరులు, గణపతి ఇత్యాది దేవతల అలంకార మూర్తులు అద్భుతంగా శిల్పీకరించబడ్డాయి అలాగే ముఖమంటపము లోపలి పైకప్పుపై ద్వాదశ రాశులు చిత్రీకరించబడ్డాయి. అంతరాలయంలో గణపతి కొలువై యున్నారు. పశ్చిమాభిముఖంగా వున్న ఈ ఆలయానికి ఎదురుగా కైలాసభూమి (శ్మశానం) వుండడం విశేషం.
ప్రాకారము నందు విడిగా కాలక్షేప మంటపము ఏర్పరచబడినది. అంతేకాక ఎక్కడాలేని విధంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సౌచాలయం (బాత్రూమ్) వుండడం విశేషం. ఆలయంలోని మహానంది సుమారు 200 సంవత్సరముల నాటిది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అంతేకాక శరన్నవరాత్రులు విశేషంగా నిర్వహించబడి నవరాత్రుల పర్యంతం అన్నదానం జరుగుతుంది. గ్రామంలో రామాలయం కలదు.