ఈ క్షేత్రము పందలపాక గ్రామమునకు అతి సమీపమున గలదు. గొల్లలమామిడాడ నుండి రాజమండ్రి నుండి రవాణా సౌకర్యం కలదు. చేరుట సులభము. పుబ్బ నక్షత్రము మూడవ పాదమునకు చెందిన ఈ క్షేత్రమును సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఈ జాతకులకు వారి వారి గ్రహపీడలు తొలగి సుఖసంతోషాలను పొందగలరని భక్తుల విశ్వాసము. పురాతనమైన చరిత్ర కలిగిన ఈ క్షేత్రములో 1900వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగినప్పటికిని 1960వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ జరిగేంత వరకు స్వామివారు ఆలయం బయటే ఉండడం విశేషం.
ఈ ఆలయంలో చండీశ్వర ఉపాలయం కలదు. అలాగే అంతరాలయంలో గణపతి కొలువై ఉన్నాడు. గ్రామంలో ఇంకా సాయిబాబా ఆలయము, దుర్గాదేవి ఆలయము కలవు. ఈ క్షేత్రములో స్వామివారి కళ్యాణోత్సవము మాఘబహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. అలాగే శరన్నవరాత్రులు కూడా ఇక్కడ విశేషం. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవానికి. శరన్నవరాత్రుల సందర్భంలోను, కార్తీక పౌర్ణమి సందర్భంలోను రథోత్సవం నిర్వహించబడుతుంది.