ఈ క్షేత్రము ప్రసిద్ధ అయినవిల్లి క్షేత్రమునకు సమీపమున కలదు. రాజమండ్రి నుండి మురమళ్ళ, ముక్తేశ్వరం వెళ్ళు బస్సులు ఈ క్షేత్రం గుండా వెళ్ళును. ప్రైవేటు వాహన సౌకర్యం కూడా ఉండును. చేరుట సులభము. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో శ్రవణం నక్షత్రం రెండవ పాదానికి చెందినది. ఈ జాతకులు మడిపల్లి యందు కోలువైయున్న శ్రీ పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.
ప్రస్తుత ఆలయం సుమారు రెండువందల సంవత్సరముల పూర్వము ఓలేటి వంశజులచే నిర్మించబడినది. అంతరాలయంలో గణపతి కొలువైవున్నారు. ఇంకా ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయం, రామాలయం, కనకదుర్గ ఆలయం మరియు మహాలక్ష్మీ ఆలయం కలదు. స్వామివారి కల్యాణోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా నిర్వహించబడుతుంది. శరన్నవరాత్రులు ఈ క్షేత్రంలో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ అతి ముఖ్యమైన ఉత్సవం కనుమరోజున జరిగే ప్రభల ఉత్సవం.