ఈ క్షేత్రము చేరుటకు దంగేరు నుండి గాని లేదా బాలాంతరము నుండి గాని మార్గము గలదు. ప్రైవేటు వాహనము లేదా సొంత వాహనము ద్వారా ఈ క్షేత్రమునకు చేరుట ఉత్తమము. నక్షత్ర శివాలయముల వ్యవస్థ ప్రకారము ఈ క్షేత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము మూడవపాదమునకు చెందినదిగా తెలియుచున్నది. అందువల్ల ఈ జాతకులు గుడిగళ్ళభాగ క్షేత్రమునందలి శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి వారికి అర్చనాభిషేకములు నిర్వహించడం ద్వారా విశేష ఫలములు పొందవచ్చునని భక్తుల విశ్వాసము.
పురాతనమైన ఈ క్షేత్రము ఆలయ పునర్నిర్మాణము 1988వ సంవత్సరంలో ప్రారంభించబడినది. ఈ ఆలయము నందు చండీశ్వరాలయము, నవగ్రహ మంటపము ఉపాలయములుగా గలవు. స్వామివారి కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. ఇవి గాక ఈ క్షేత్రములో శరన్నవరాత్రులు, గణపతి నవరాత్ర్రులు కూడా ప్రసిద్ధి.