దుగ్గుదూరు క్షేత్రం కుయ్యేరు గ్రామానికి సమీపంలో గొల్లపాలెం – కుయ్యేరు రహదారి యందు కలదు. ఈ గ్రామం చేరుటకు కాకినాడ నుండి బస్సు సౌకర్యం మాత్రమే గాక గొల్లపాలెం, కుయ్యేరు గ్రామాలనుండి ఆటో సౌకర్యం కూడా గలదు. దుగ్గుదూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి క్షేత్రం నక్షత్ర శివాలయాలలోని అశ్వని నక్షత్రం – నాలుగవ పాదానికి చెందినదిగా చారిత్రిక కథనం.
అందువల్ల ఆ జాతకులకు ఈ క్షేత్రదర్శనం, అర్చనం విశేష ఫలాన్నిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆత్రేయ గోదావరి తీరాన విలసిల్లిన ఈ దుగ్గుదూరు గ్రామం యొక్క నామం విషయంలో ఒక ఆసక్తికరమైన కథనం కలదు. దుగ్ధమనగా క్షీరం (పాలు) స్వచ్చతకు, శాంతికి ప్రతీకగా చెబుతారు. దానికి తగ్గట్టుగానే ఈ గ్రామంలో పాడిపరిశ్రమ విశేషంగా జరుగుటయేగాక, ప్రజలు కూడా శాంతికాముకులుగా యుండుట విశేషం. దుగ్ధము నుండి ఈ గ్రామానికి దుగ్దూరు నామం కలిగి పిదప వ్యవహారంలో దుగ్గుదూరుగా మారినదట.
ఈ క్షేత్రాన కోలువైయున్న గణపతికి కామ్య గణపతియని పేరు. దానికి తగ్గట్టుగానే ఈ గణపతి సర్వసిద్దిదాయకుడు. ఏ సంకల్పంతోనయితే స్వామిని నిష్కల్మష భక్తితో త్రికరణశుద్ధిగా సేవిస్తారో ఆ సంకల్పసిద్ధి జరిగినట్లు దృష్టాంతములు గలవు. ఈ ఆలయం సుమారు 250సంవత్సరములకు పూర్వము పిఠాపురం సంస్థానాధీశులు రేచర్ల గోత్రజ్ఞులు రావు గంగాధర రామారావుగారిచే పునర్నిర్మితమయినది. ఆ కారణం చేతనే నేటికిని ఈ ఆలయమున ప్రథమపూజ వారి పేరున జరుగుతుంది. ఇచ్చటి ఈశ్వర రూపం అఘోర రూపంగా చెబుతారు. అంతేకాక పరమేశ్వర స్వరూపమునకు మల్లిఖార్జున నామధేయం కూడా ఆలయ పునఃనిర్మాణం సమయంలో పిఠాపురాధీశులచే స్థిరపరచబడినది.
మల్లికార్జునుడు సత్వగుణ స్వరూపుడు అందువల్ల ఈ స్వామి దర్శనం, అర్చనల వలన సత్వగుణాన్ని పెంపొందిస్తాయని భక్తజనుల విశ్వాసం. స్వామివారి ప్రత్యద్భోత్సవం (దివ్యకల్యాణం) వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా శైవాగమ సిద్ధాంతపరంగా జరుగుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రాల రోజులలో విశేష పూజలు నిర్వహించబడతాయి. ఈ క్షేత్రం ఆత్రేయ గోదావరి తీరాన గలదు. ఈ ఆలయానికి వామపార్శ్వాన రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం మరియు పశ్చిమంగా ముప్పిళ్ళమ్మ అమ్మవారి ఆలయాలు వున్నాయి.