ఈ క్షేత్రము చింతలూరు గ్రామానికి సమీపాన కలదు. ఆలమూరు సమీపంలోని చింతలూరు సెంటరు నుండి వెళ్ళవచ్చును. రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం ఉన్నను నియమిత సమయములలో ఉన్నందున చింతలూరు సెంటరు నుండి ఆటోపై వెళ్ళుట సులభము. జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదమునకు చెందిన ఈ క్షేత్రమును దర్శించి అబిషేకాదులు నిర్వర్తించిన యెడల ఈ జాతకులు వారి గ్రహదోషములు తొలగి సుఖవంతులగుదురు.
విశేష చరిత్ర గల ఈ క్షేత్రంలో ప్రస్తుత ఆలయం 2009వ సంవత్సరంలో దేవాదాయశాఖ మరియు భక్తుల సహకారంతో పునర్నిర్మాణం పునఃప్రతిష్ఠ జరిగినట్లు తెలియుచున్నది. పూర్వాలయం 18వ శతాబ్దం నుండి విలసిల్లినట్లు కథనం. ఆలయం బయట ముఖద్వారం చెంతనే భారీ అభయాంజనేయస్వామి విగ్రహం కూర్చుని ఉన్నట్లుగా నిర్మించబడ్డది. ఈ ఆలయంలో చండీశ్వర ఆలయం తప్ప వేరే ఉపాలయాలు లేవు, గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం శివాలయానికి అతి సమీపంలో ఉండడం విశేషం. ఫాల్గుణ బహుళ షష్ఠి నుండి పాంచాహ్నికంగా స్వామివారి కల్యాణం జరుగుతుంది. శరన్నవరాత్రులు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయి.