ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ – రామచంద్రాపురం మార్గంలో బైపాసు రోడ్డు నుండి మార్గము కలదు. రామచంద్రాపురం నుండి ఆటో ద్వారా గాని వ్యక్తిగత వాహనం ద్వారా గానీ ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చును. ఉత్తరానక్షత్రం మూడవ పాదమునకు చెందినవారు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల ఆ జాతకులు విశేష ఫలితములు పొందగరని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రంలో ఒకే ప్రాంగణంలో శివాలయం మరియు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉండటం విశేషం.
ఆలయ ముఖమంటపంపై నటరాజస్వామి, మార్కండేయుని పరమేశ్వరుడు కాపాడిన ఘట్టం మరియు గీతోపదేశఘట్టం, ఆంజనేయస్వామి, గణపతి, కుమారస్వామి, లక్ష్మీ, సరస్వతుల విగ్రహములు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రానికి సుమారు రెండు శతాబ్ధముల చరిత్ర కలదు. 1995 – 1996 సంవత్సరంలో సభా మంటపము నిర్మాణం జరిగింది. 1982వ సంవత్సరంలో ముఖమంటపం నిర్మితమైనట్లు అక్కడి శిలాఫలకం ద్వారా తెలిసింది. స్వామివారి కల్యాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. దీనితో పాటు శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ గ్రామంలో ఆంజనేయస్వామి వారి ఆలయం మరియు మూడు రామాలయములు కలవు.