info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి – చెంతలూరు

అనూరాధ నక్షత్రం – ద్వితీయ చరణంchintaluru

ఈ క్షేత్రము రామచంద్రాపురం – రావులపాలెం ప్రధాన రహదారిలో ఆలమూరుకు ముందు చింతలూరు సెంటర్ నుండి మళ్ళవలెను. ఈ క్షేత్రము సుప్రసిద్ధ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం ద్వారా కూడా బహుళ ప్రచారంలో వున్నది. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో అనూరాధ నక్షత్రం ద్వితీయ పాదానికి చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్రమున కోలువైయున్న శ్రీ పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామిని దర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు కలిగెదవని ప్రతీతి.

ఈ ఆలయ స్థిత స్వామి స్వయంభువుగా చెబుతారు. ఈ స్థలపురాణం ఆసక్తికరంగా వున్నది. అనేక సంవత్సరాల క్రితం ఈ ఆలయం గల ప్రాంతంలో దట్టమైన పొదలతోను లతలతోను నిండిఉండేదట. ఒకనాడు ఒక ఎరుకలవాడు కొంగను వేటాడుటకై పంగళ కర్రతో దాన్ని కొట్టగా ఆ కొంగ గాయపడింది. ఆ కొంగ అతనికి కనబడలేదట. పొదలను తొలగించి వెతుకగా పొదలమధ్య గుండ్రటి రాయి దానిపైన రక్తపు మరకలు కనిపించాయట. అతడు భయంతో వారి కులపెద్దకు ఈ విషయాన్ని వివరించి రక్తం కక్కుకుని మరణించినట్లుగాను ఆ విషయాన్ని కులపెద్దలు అప్పటి కరణంగారైన చింతలూరు వారికి తెలియజేయగా ఆయన ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి ఆ రాతి యొక్క మూలం కనుగొనడానికి త్రవ్వకాలు ప్రారంభించారట.

ఎంత లోతుకు త్రవ్వినా ఆ శీల అంతుదొరకకున్నదట. సుమారు ఒక పెద్ద తాటిచెట్టు ప్రమాణంలో త్రవ్విన తరువాత ఆ శిల చెరువువైపు మళ్ళినట్లుగా గమనించారట. అంతే ఇక త్రవ్వడం తమవల్ల కాదని గ్రహించి ఎక్కడ ఆ లింగం కనబడిందో అక్కడే పానపట్టంతో ఒక పీఠమును ఏర్పరచి దానికి తాత్కాలికంగా మందిరాన్ని ఏర్పాటు చేశారట. పృథ్వినుండి ఉద్భవించిన కారణంగా ఆ శివస్వరూపానికి పృధ్వీశ్వర నామాన్ని నిర్ణయించారు. ఉత్తరోత్తరా చింతలూరు రమణయ్యగారి పూర్వులచే ఆలయ నిర్మాణం జరిగినదట. అనంతరం 1900వ సంవత్సరంలో పునరుద్దరింపబడినది. ముఖ మంటపము దేవాదాయశాఖవారిచే కీ.శ. 1981వ సంవత్సరంలో నిర్మించబడినట్లు అక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తున్న్నది. ప్రస్తుతం ఆలయం చెంతనున్న తటాకము స్వామి పుష్కరిణిగా తెలుస్తోంది.

స్వామివారి దివ్య కళ్యాణోత్సవం వైశాఖ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అంతేకాక ఈ క్షేత్రంలో శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఆలయంలో గణపతి, గాయత్రీదేవి ఉపాలయములు కలవు. ఈ ఆలయమునకు చేర్చి అత్యద్భుత శిల్పకళతో నిర్మించబడ్డ ధన్వంతరి ఆలయం కలదు. దీనిని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదనిలయం వారు నిర్మించారు. ఈ ఆలయం విశాలమైన ముఖమంటపము మరియు చక్కని పరిసరాలతో అత్యంత హృద్యంగా నిర్మించబడినది. ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం మరియు గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి ఆలయం సుప్రసిద్ధం.